ఆరు నెలల్లో... ఏమీ చేయలేకపోయాం!!
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

ఆరు నెలల్లో... ఏమీ చేయలేకపోయాం!!

గెలిపించిన ప్రజలకు ముఖం చూపలేకపోతున్నాం

విపక్ష కార్పొరేటర్ల ఆవేదన

28 అంశాలకు జీవీఎంసీ పాలక మండలి ఆమోదం

పింఛన్ల తొలగింపుపై మేయర్‌ పోడియం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న విపక్షాల సభ్యులు

కార్పొరేటర్లుగా గెలిచి ఆరు నెలలు అవుతోంది. మా వార్డుల్లో అభివృద్ధి పనులు చేయలేకపోయాం. మేయరు, కమిషనరు వచ్చిన సందర్భాల్లో కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వడంలేదు. వార్డు అభివృద్ధి ప్రణాళిక తయారు చేసినా... ఒక్కటీ ప్రజలకు ఉపయోగకరమైంది లేదు. ఓట్లు వేసిన ప్రజలకు ముఖం చూపలేకపోతున్నాం.  రహదారులు అధ్వానంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పార్కులు అభివృద్ధి చేస్తారా? ...అంటూ పలువురు విపక్ష కార్పొరేటర్లు ప్రశ్నించారు.

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) పాలక మండలి సమావేశం శనివారం నిర్వహించారు. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైన తరువాత నగర సమస్యలపై జీరో అవర్‌ నిర్వహించాలని సభ్యులు కోరారు. అజెండాలో అంశాలపై చర్చ అనంతరం అవకాశమిస్తామని మేయరు గొలగాని హరి వెంకట కుమారి పేర్కొనగా...సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగి వాయిదా వేయాలని ప్రతిపక్షాలు కోరినా మేయరు పట్టించుకోలేదు. అజెండాలో పేర్కొన్న 28 అంశాలకు జీవీఎంసీ పాలకమండలి ఆమోదం లభించింది. అకారణంగా పింఛన్లు తొలగిస్తున్నారని, జ్వరాల నియంత్రణలో జీవీఎంసీ విఫలమైందని తెదేపా, వామపక్షాలు, జనసేన, భాజపా కార్పొరేటర్లు నిలదీశారు. ఓ దశలో మేయరు పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన నిర్వహించారు.

నగరంలో థీమ్‌పార్కుల ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. ఉపాధ్యాయుల సర్వీసులకు చెందిన మొదటి ఐదు అంశాలకు, మలేరియా విభాగంలో పని చేస్తున్న సిబ్బందికి ఏడాది పాటు వేతనాలివ్వడానికి, గాజువాక, చినముషిడివాడలో దుకాణాలు లీజులకిచ్చేందుకు, సిటిస్‌ పథకంలో పాఠశాలల అభివృద్ధికి రూ.13కోట్ల జీవీఎంసీ నిధులివ్వడానికి సభ్యులు అంగీకారం తెలిపారు.

కొందరు కార్పొరేటర్లు ఏమన్నారంటే...

* తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో చేపట్టిన రూ.40.69కోట్ల పనులకు జీవీఎంసీ సాధారణ నిధులు ఎలా చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు జీవీఎంసీ ఎందుకు చెల్లించాలి (మరి కొందరు సభ్యులూ ఇదే అంశంపై మాట్లాడారు). నగరంలో మలేరియా, డెంగీ విజృంభిస్తున్నా జీవీఎంసీ పట్టించుకోవడంలేదు. వివిధ కారణాలు చూపి అర్హులైన వృద్ధులు, వికలాంగుల పింఛన్లు తొలగించడం దారుణం. ఒక నెల తీసుకోకపోయినా జాబితా నుంచి పేరు తొలగించడం సరికాదు.

సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు

* సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ గంగారావు: జీవీఎంసీ పరిధిలో ప్రతి గంటకు 150 మంది జ్వర పీడితులు కేజీహెచ్‌కు వెళుతున్నారు. నగరంలో డెంగీ నిర్దారణ పరీక్షలు మరిన్ని చోట్ల నిర్వహించాలి.

* భాజపా ఫ్లోర్‌ లీడర్‌ కవిత : కొండవాలు ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులు, చెత్త తరలింపు వాహనాలు సక్రమంగా రావడంలేదు.

* పీతల మూర్తియాదవ్‌ : జీవీఎంసీ రెవెన్యూ విభాగం సీజ్‌ చేసిన దుకాణాలలో.. బకాయిలు చెల్లించి, మూడేళ్ల గడువు ముగియని వాటిని తెరవడానికి కౌన్సిల్‌ ఎలా ఆమోదిస్తుంది. కౌన్సిల్‌లో చర్చించకుండా, లీజులపై నిబంధనలకు విరుద్ధంగా కమిటీని నియమించారు. ప్రత్యేక కమిటీ ఎలాంటి సిఫారసులు చేయకుండానే ఎందుకు దుకాణాలు తెరుస్తున్నారు. పాఠశాలల అభివృద్ధికి రూ.13కోట్ల జీవీఎంసీ సొంత నిధులు ఇవ్వడం సరికాదు. నాడు-నేడులో అభివృద్ధి చేస్తే బాగుండేది.

* బొండా జగన్నాథం: 87వ వార్డు పరిధిలో శ్మశాన ప్రహరీని పడగొట్టి 30 అడుగుల రహదారిని నిర్మిస్తున్నారు. పట్టణ ప్రణాళికాధికారులకు, కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడంలేదు:

* గొలగాని మంగవేణి: 18వ వార్డులో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ దెబ్బతిని జనం ఎన్నో అవస్థలు పడుతున్నారు.●

* పల్లా శ్రీనివాసరావు: గాజువాక మున్సిపాలిటీ విలీనమై ఏళ్లు గడుస్తున్నా... జెడ్పీ, ఎంపీపీ పాఠశాలలన్న పేరుతో వాటిని అభివృద్ధి చేయడం లేదు. న్యాయపరమైన చిక్కులున్నాయని అధికారులంటున్నారు. కుక్కల పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదించిన నిధులను మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తే బాగుండేది. మురికివాడలు, కొండవాలు ప్రాంతాలలో చెత్త సేకరణ జరగక విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.●

* రాపర్తి త్రివేణి: ఎలాంటి దస్త్రాల ఆధారాల్లేకుండా జోన్‌-8 పరిధిలో పన్నులు విధించి అక్రమాలకు సహకరించిన అధికారులు, ఉద్యోగులపై విచారణకు ఆదేశించి 50 రోజులైంది. ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడంలేదు.

* గంధం శ్రీనివాసరావు : ఎంపీ విజయసాయిరెడ్డి నగరానికి తన ఎంపీ ల్యాడ్స్‌ నిధులు ఎంత కేటాయించారు? నగరంలో థీమ్‌, కుక్కల పార్కులు ప్రతిపాదించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి?

* నొల్లి నూకరత్నం : ఈత రాని వారిని కోస్టు గార్డులుగా నియమించారని పాలకవర్గం మొదటి సమావేశంలో అభ్యంతరం తెలిపిన వైకాపా కార్పొరేటర్‌.. ఇప్పుడు ఏడాది పాటు వారిని కొనసాగించాలని ఎందుకు కోరుతున్నారో చెప్పాలి?●


* కుక్కల పార్కులొద్ధు. రోడ్లేయండి..: నగరపాలక సంస్థ పాలకవర్గం నగరాభివృద్ధిపై దృష్టిసారించాలని సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ బి.గంగారావు కోరారు. కుక్కల పార్కుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట పెంపుడు కుక్కలతో నిరసన తెలిపారు. రహదారులు, కాలువలు ఛిద్రమై నగర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, రూ.కోట్ల నిధులు వెచ్చించి కుక్కల పార్కులు నిర్మించడానికి అధికారులు ప్రతిపాదించడం సరికాదన్నారు.


అర్హుల పింఛన్లు తొలగించడంపై తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జీవీఎంసీీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న నాయకులు అక్కడ్నుంచి పాదయాత్రగా కౌన్సిల్‌ సమావేశ మందిరానికి ప్లకార్డులు ప్రదర్శిస్తూ వచ్చారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని