అభిజీత్‌ పేలుడుపై సుందరపు దీక్ష
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

అభిజీత్‌ పేలుడుపై సుందరపు దీక్ష

జనసేన నేతల సంఘీభావం
పోలీసుస్టేషన్‌లో కూర్చున్న సుందరపు, జనసేన నాయకులు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అభిజీత్‌ పేలుడుపై సమగ్ర విచారణ నిర్వహించి, కార్మికుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ జనసేన ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్‌ సుందరపు విజయ్‌కుమార్‌ నిరవధిక నిరశనకు దిగారు. ప్రమాద స్థలాన్ని చూడటానికి బుధవారం రాత్రి కంపెనీకి వెళ్లిన సుందరపుని లోనికి అనుమతించకపోవడంతో ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎలమంచిలి సీఐ వెంకటరమణ సుందరపును అరెస్టుచేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కార్మికుల ప్రాణాలు కాపాడాలని ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న తనను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ సుందరపు పోలీసుస్టేషన్‌ ఆవరణలోనే దీక్షకు దిగారు. పరిశ్రమలు, ఏపీఐఐసీ, కంపెనీ ప్రతినిధులు వచ్చి కార్మికుల రక్షణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో? తెలిపేవరకు కదలేది లేదని నిరవధిక దీక్షకు పూనుకున్నారు. రాత్రంతా నేలపైనే విశ్రాంతి తీసుకున్నారు. సుందరపు ఆందోళన విషయం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు జిల్లాలోని పలువురు నేతలు ఆయనకు మద్దతుగా అచ్యుతాపురం పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసుస్టేషన్‌ ఆవరణలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జనసేన జిల్లా నాయకులు కోన తాతారావు, పరుచూరి భాస్కరరావు, బొడ్డేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు.

బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలి

అభిజీత్‌ కంపెనీలో జరిగిన పేలుడు వల్ల చేయి కోల్పోయిన లాలం సతీష్‌ కుటుంబాన్ని కంపెనీ యాజమాన్యం ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రొంగలి రాము డిమాండ్‌ చేశారు. కంపెనీ ప్రధాన ద్వారం వద్ద గురువారం కార్మికులతో కలిసి ఆందోళన చేశారు. బాధిత కుటుంబానికి రూ.20లక్షల పరహారంతోపాటు అతని భార్యకు కంపెనీలో ఉద్యోగం కల్పించాలన్నారు. నాయకులు సోమునాయుడు, చంటి అప్పలనాయుడు, గణేష్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని