అమెరికాలో విద్యావకాశాలపై మరింత అవగాహన
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

అమెరికాలో విద్యావకాశాలపై మరింత అవగాహన

అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభోత్సవంలో వక్తలు

అమెరికన్‌ కార్నర్‌ సేవలపై వివరిస్తున్న కాన్సులేట్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ అధికారి డేవిడ్‌ మోయర్‌

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఏర్పాటైన అమెరికన్‌ కార్నర్‌లో నిరంతరం వివిధ కార్యక్రమాలు జరుగుతాయని అమెరికన్‌ కాన్సులేట్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ అధికారి డేవిడ్‌ మోయర్‌ పేర్కొన్నారు. అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంగ్లభాషా నైపుణ్యాలపై అవగాహన పెంపొందించడం, అమెరికాలోని విద్యావకాశాలపై అవగాహన కల్పించడం, సంయుక్త కార్యక్రమాల నిర్వహణ, అమెరికా సంస్కృతి గురించి వివరించడం వంటి వాటికి అగ్రప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆచార్యులకు కూడా ఆంగ్ల భాషానైపుణ్యాలపై ఇచ్చే శిక్షణ కారణంగా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అంకురసంస్థల ఏర్పాటు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి అవసరమైన శిక్షణ ఇస్తామని వివరించారు. వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతోనే ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ కల సాకారం అయిందని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన కచ్చితమైన, పూర్తిస్థాయి విశ్వసనీయ సమాచారం ఆమెరికన్‌ కార్నర్‌లో లభ్యమవుతుందని పేర్కొన్నారు. హైస్పీడ్‌ అంతర్జాల సదుపాయం ఉందని, విదేశీ విశ్వవిద్యాలయాలతో అనుసంధానం కావడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో దాదాపు 15 వేల మందికి ఉపయుక్తంగా... సుమారు వంద సదస్సులు నిర్వహించడానికి కాన్సులేట్‌ అధికారులు ప్రణాళికలు రచించారని తెలిపారు. అంకుర సంస్థల అభివృద్ధి, విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు రానున్న రోజుల్లో పెద్దఎత్తున నిర్వహిస్తామని, ఆయా కార్యక్రమాలకు విదేశీ రిసోర్స్‌ పర్సన్‌తో సూచనలు, సలహాలు ఇప్పించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌ విభాగం సమన్వయకర్త డాక్టర్‌ అన్నవరపు కుమార్‌ మాట్లాడుతూ వీసా కౌన్సెలింగ్‌పై కూడా ప్రభుత్వం తరఫున యువతకు అవగాహన కల్పిస్తామని వివరించారు. విదేశీ విద్యపై వెబినార్లు జరుగుతాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఆస్ట్రేలియా, కెనడా సెంటర్ల ఏర్పాటుకు కృషిచేస్తున్నామని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని