అధికార పార్టీలో ఆధిపత్య పోరు
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

అధికార పార్టీలో ఆధిపత్య పోరు

మండల పరిషత్తు అధ్యక్షుల ఎన్నిక నేడు
జోరుగా వ్యూహ ప్రతివ్యూహాలు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ప్రాదేశిక ఎన్నికల్లో పెద్దగా శ్రమించకుండానే అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పుడు వారిలో కొందరు ఎంపీపీ రేసులో నిలబడేందుకు శక్తియుక్తులు ఒడ్డాల్సి వస్తోంది. మండలాధ్యక్ష పీఠంపై కొలువుతీరడానికి అవసరమైన మద్దతు కూడగట్టుకునేందుకు నాలుగు రోజులుగా వ్యూహాలకు పదనుపెడుతూనే ఉన్నారు. విపక్షం నుంచి పోటీలేకున్నా స్వపక్షంలోనే పోటాపోటీగా పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు.

* శుక్రవారమే ఎంపీపీలను ఎన్నుకోవాల్సి ఉన్నా గురువారం రాత్రి వరకు కొన్ని మండలాల్లో కొలువుతీరేది ఎవరో ఖరారు కాలేదు. ఎమ్మెల్యేలు తమ పరిధిలో విజేతలతో సమావేశాలు నిర్వహించినా... వ్యక్తిగతంగా అభిప్రాయాలను తెలుసుకున్నా తుది నిర్ణయాన్ని వెల్లడించలేకపోతున్నారు. ఎంపీపీ ఎన్నిక రోజునే భీ ఫాం ఎవరికి ఇస్తే వారికే సభ్యులంతా మద్దతు పలకాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. విప్‌ జారీచేస్తామని, ఎవరైనా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటింగ్‌లో పాల్గొంటే ఎంపీటీసీ సభ్యత్వాలు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు.

* ఎన్నికలు ఏకపక్షంగా జరగడం ఇప్పుడు అధికార పార్టీ నేతలకు కొంత తలనొప్పిగా మారింది. తమ పార్టీలోనే ఇద్దరు ముగ్గురు పోటీకి దిగుతున్నారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారిని కాదని ఇటీవల వచ్చినవారికి పదవులు ఇస్తే ఒప్పుకొనేది లేదని కొన్నిచోట్ల ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఎంపీపీ పదవి ఖాయమనుకున్న వారు ఓడిపోయిన చోట పోటీ తీవ్రంగా ఉంది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఆశావహుల మధ్య పోటీ కనిపిస్తోంది. విపక్షం నుంచి పోటీ ఉంటుందనుకున్న రావికమతం, నర్సీపట్నం మండలాల్లో పలువురు తెదేపా సభ్యులను తమవైపు తిప్పుకొన్నారు. జి.మాడుగులలో విపక్షంతో పాటు, స్వపక్షంలోనూ పోటీ ఉండడంతో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గురువారం మండలానికి వెళ్లి పరిస్థితిపై సమీక్షించారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థిని తమ గూటికి తీసుకువచ్చేలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెదేపా వారు కూడా అతనిపైనే గురిపెట్టినట్లు తెలిసింది.

శిబిరం నుంచి జంప్‌: నర్సీపట్నంలో అధికార పార్టీకి అయిదు, తెదేపాకు నలుగురు సభ్యుల బలం ఉంది. వీరు కూడా శిబిరాలు నిర్వహించారు. వైకాపాకు చెందిన అయిదుగురిలో ఇద్దరు ఎంపీపీ పదవి ఆశిస్తున్నారు. విపక్ష శిబిరంలో నలుగురుండడంతో వారు పోటీపడే అవకాశం ఉందని భావించి ముందుగానే తెదేపా నుంచి ఒకరిని తమ వైపు తిప్పేసుకున్నారు. తరువాత మరో ఇద్దరు అదే బాట పట్టారు.

జడ్పీ తెరపై సుభద్ర: ఈ నెల 25న జడ్పీ ఛైర్‌పర్సన్‌ను ఎన్నుకోనున్నారు. మొదటి నుంచి గూడెంకొత్తవీధి నుంచి గెలుపొందిన కిముడు శివరత్నం పేరు వినిపిస్తోంది. ఆమె వ్యతిరేక వర్గం మరో ఇద్దరిని తెరపైకి తేవడంతో ఈ పీఠం ఎవరి పరం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. శివరత్నం... ముంచంగిపుట్టు నుంచి గెలుపొందిన సుభద్ర, జి.మాడుగుల నుంచి గెలుపొందిన వెంకటలక్ష్మి గత నాలుగు రోజులుగా విశాఖలోనే ఉండి పార్టీ నేతలను కలుస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా బుధవారం రాత్రి విశాఖ చేరుకోవడంతో ఆయన్ను కలిసి జడ్పీ పీఠంపై తమ ఆసక్తిని వెలిబుచ్చారు. మొదట హామీ ఇచ్చిన శివరత్నం కాకుండా ఆదివాసీ తెగ నుంచి ఎన్నికైన సుభద్ర వైపే మొగ్గు చూపి, ఈ మేరకు వారికి హామీ ఇచ్చినట్లు వైకాపా వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే పద్మనాభం జడ్పీటీసీ సభ్యుడు గిరిబాబుకు వైస్‌ ఛైర్మన్‌ ఇచ్చే అవకాశం ఉంది. మరో వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడి కుమార్తె ఈర్లె అనురాధ పేరు కూడా వినిపిస్తోంది.


‘కిడ్నాప్‌’ కలకలం

చోడవరం, రావికమతం, న్యూస్‌టుడే: రావి కమతం మండలంలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 10 స్థానాల్లో అధికార వైకాపా...పది స్థానాల్లో ప్రతిపక్ష తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. ఎంపీపీ ఎన్నికలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన పరిణాలు చర్చ నీయాంశమయ్యాయి. ఎంపీటీసీల కిడ్నాప్‌ అంశం తెరపైకి వచ్చింది. తెదేపా శిబిరం నుంచి గుడివాడ ఎంపీటీసీ సభ్యుడు కరణం అప్పారావు గురువారం ఉదయం వైకాపా గూటికి చేరారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇస్తానంటూ శాసనసభ్యుని ఇంట్లో ఒట్టు వేసి ఆ పార్టీ నేతలకు హామీ ఇస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలాగే క్యాంపులో ఉన్న తెదేపా సభ్యుల్లో తట్టబంద, మరుపాక ఎంపీటీసీ సభ్యులను గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల వెళ్లే దారిలో అడ్డగించి కిడ్నాప్‌ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వైకాపా దౌర్యన్యాలు, కిడ్నాప్‌లపై చోడవరంలోని తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యులు ఓ వీడియో విడుదల చేశారు. వైకాపా వర్గీయులు మూడు కార్లలో సుమారు 15 మంది వరకు వచ్చి, కర్రలు, రాడ్లతో తాము ప్రయాణిస్తున్న కార్లను అడ్డగించి భయబ్రాంతులకు గురిచేశారన్నారు.

మరో వీడియోలో: ‘తెదేపా వారే మమ్మల్ని నాలుగు రోజులపాటు బంధించి, వైకాపా వారు కిడ్నాప్‌ చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు తెలియకుండా తప్పించుకువచ్చాం. మేమిద్దరం వైకాపా మద్దతుతోనే గెలిచాం. ఆ పార్టీ ఎంపీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాం’ అని తట్టబంద, మరుపాక ఎంపీటీసీ సభ్యులు పిల్లా శేషుబాబు, ముచ్చా సూర్యనారాయణ గురువారం రాత్రి మీడియాకు వీడియో విడుదల చేశారు.


కొనసాగుతున్న ఉత్కంఠ

పెందుర్తి మండల పరిషత్తు అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముందుగా ప్రతిపాదించిన అభ్యర్థి ఓటమి చెందడంతో ఆశావహులు పావులు కదుపుతున్నారు. ఆ మేరకు వైకాపా శిబిరంలో తర్జనభర్జనలు జరుగుతున్నట్లు సమాచారం. ఎంపీపీ పీఠం ఈసారి మహిళ(జనరల్‌)కు కేటాయించడంతో ఓ సామాజిక వర్గం నుంచి గట్టిగా డిమాండ్‌ వస్తోంది. ఆ క్రమంలో ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మరో వర్గం నేతలూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని