ఎగుమతుల ప్రోత్సాహకానికి ఉప సంఘాలు
eenadu telugu news
Updated : 24/09/2021 06:27 IST

ఎగుమతుల ప్రోత్సాహకానికి ఉప సంఘాలు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: సముద్ర ఉత్పత్తులు, ఫార్మా, కాయిర్‌ మొదలైన రకాల ఉత్పత్తుల దిగుబడులు పెంచి ఎగుమతులు ప్రోత్సహించేందుకు ఉప కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ (డిఐఇపిసి) సమావేశం గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫార్మా, బల్క్‌డ్రగ్‌ ఎగుమతులకు సంబంధించి ప్రతీ పది రోజులకు ఒకసారి ఉప సంఘాలు సమావేశమై కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజరు రామలింగరాజు మాట్లాడుతూ జిల్లాలో 120 ఫార్మా యూనిట్లు ఉన్నాయన్నారు. మరో 50 యూనిట్లు ప్రతిపాదనల దశలో ఉన్నట్లు చెప్పారు. అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో 27 కంపెనీలు నిర్మాణపు పనుల్లో ఉన్నాయని, ఏడు కంపెనీలు ఉత్పాదనకు సిద్ధంగా ఉన్నాయన్నారు. విశాఖ పోర్టు ద్వారా 2,16,457 టన్నుల సముద్ర, మెరైన్‌ ఉత్పత్తులను ఎగుమతి చేశామన్నారు. ఏక గవాక్ష విధానంలో పరిశ్రమల అనుమతుల కోసం గత నెల 26 నుంచి ఈనెల 22 వరకు 90 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 56 దరఖాస్తులను ఆమోదించామన్నారు. ఎంఎస్‌ఎంఇ ఆన్‌లైన్‌ క్లెయిములు 82 వరకు వచ్చాయని, ఇంతవరకు 70 పరిష్కరించి రూ.4.83 కోట్లు మంజూరు చేశామన్నారు. మిగిలిన 12 తిరస్కరించినట్లు చెప్పారు. సమావేశంలో ఏపీఐఐసీ, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, ట్రాక్స్‌కో, ఫ్యాక్టరీలు, కాలుష్య నివారణ, అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని