మాకలలు.. కాలేదు కల్లలు!!
eenadu telugu news
Published : 26/09/2021 03:40 IST

మాకలలు.. కాలేదు కల్లలు!!

నేడు కూతుళ్ల దినోత్సవం

సివిల్స్‌ విజేత లక్ష్మీసౌజన్య తల్లిదండ్రుల ఆనందం

న్యూస్‌టుడే, ఉక్కునగరం(గాజువాక)

ఏడాదికి రూ. 20 లక్షల వేతనం .. చక్కగా కార్యాలయంలో కూర్చొని విధులు నిర్వహించే ఉద్యోగం... ఆ జీవితం తనకు వద్దని ఏ కూతురైనా అంటే... ఆమె తల్లిదండ్రుల్లో చాలా కంగారు పుడుతుంది తమ బిడ్డ భవిష్యత్తుపై కలవరం రేగుతుంది!

లక్ష్మీ సౌజన్య తల్లిదండ్రులు మాత్రం ఆమెలోని ప్రతిభపై నమ్మకం ఉంచారు! నీకు నచ్చిన విధంగా ముందడుగు వెయ్‌... అండగా మేముంటామని భరోసా ఇచ్చారు!

ఆ ఫలితమే... సివిల్స్‌లో 127వ ర్యాంకు.

నేడు కూతుళ్ల దినోత్సవం నేపథ్యంలో తమ కూతురి విజయ ప్రస్థానంపై వెంకటరావు, పద్మావతి ఏమంటున్నారో చూద్దామా!!

* వెంకటరావు విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్‌ఎంఎస్‌ విభాగంలో సీనియర్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌).

* వెంకటరావు కుమారుడు వరుణ్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా బెంగళూరులో పని చేస్తున్నారు.


మూడోసారి విజయం...

కుమార్తెకు మిఠాయి తినిపిస్తున్న తల్లితండ్రులు

2016 నుంచి బెంగళూరులో అన్నయ్య వద్ద ఉంటూ... అక్కడే శిక్షణ తీసుకుంది. రోజూ 14 గంటలు శ్రమించేది. రెండు గంటలు చదివి... కొంత విరామం ఇచ్ఛి.. మళ్లీ చదువుకునేది. తొలిసారి మెయిన్‌ స్థాయిలోనే అపజయం ఎదురయింది. అయినా వెనకడుగు వేయలేదు. రెండోసారి మాత్రం 560 ర్యాంకు దక్కింది. తాననుకున్న ఉద్యోగం దక్కే అవకాశం లేకపోవడంతో...ఆ అవకాశాన్ని వదిలేసి 2020లో ప్రయత్నం చేసింది. ఈసారి 127 ర్యాంకు రావడంతో మా అందరి కల నెరవేరింది. విజయనగరం జిల్లా ఎస్‌.కోట ప్రాంతం నుంచి వచ్చిన మాకు పేదరికం, పేదల పరిస్థితులు తెలుసు. ఐఏఎస్‌ సాధించి ఉన్నత స్థాయిలో ఉంటే పేదల బాధలు తీర్చే అవకాశం ఉంటుంది.


ఆనందంగా ఒప్పుకున్నాం..

కుమారుడినైనా...కూతురినైనా ఒకేలా ప్రోత్సహించాలి. మేమలాగే చేశాం. మా కూతురు విజయం ఎంతో ఆనందం కలిగిస్తోంది. ఇదేమీ అంత తేలికగా రాలేదు. బిడ్డల్ని ఉన్నత స్థాయిలో చూసే అరుదైన అవకాశం అందరికీ లభించదు. కానీ, మాకు దక్కింది. లక్ష్మీ సౌజన్య వరంగల్‌ ‘నిట్‌’లోలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసిన తరువాత ‘ఒరాకిల్‌’లో ఉద్యోగం సాధించింది. అక్కడ పని చేస్తున్న క్రమంలోనే సివిల్స్‌ రాయాలనుకుంది. అప్పటికే రూ.20లక్షల ప్యాకేజీతో పని చేస్తోంది. ఉద్యోగం మానేసి సివిల్స్‌కు సిద్ధపడతాను అంటే ఆనందంగా ఒప్పుకున్నాం. నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకునే వరకూ... ఎంతకాలమైనా మేం తోడుగా నిలుస్తాం అన్నాం. తనను అన్ని విధాలుగా ప్రోత్సహించాం.


లక్ష్మీసౌజన్య ఏమంటున్నారంటే...

నా తొలి ప్రాధాన్యం ఐఏఎస్‌. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటే నేను, నా కుటుంబం మాత్రమే సంతోషంగా ఉండగలం. సివిల్స్‌లో విజయం సాధిస్తే ఎంతో మందికి మేలు చేసే అధికారం...అవకాశం దక్కుతుంది. నేను ఇంజినీరింగ్‌ చదివినా...సివిల్స్‌లో జాగ్రఫీని ఐచ్ఛికంగా ఎంచుకున్నా. ఇంటర్వ్యూలో ఎక్కువగా కరంట్‌ అఫైర్స్‌పైనే అడిగారు. వాతావరణంలో మార్పుల ప్రభావం, నగరీకరణ పరిస్థితులు, మహిళల భద్రత, ప్రభుత్వ రంగ సంస్థల పురోగతిపై ప్రశ్నించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని