ఆ రోజు... గూండాలను ఎదిరించా!
eenadu telugu news
Updated : 26/09/2021 09:38 IST

ఆ రోజు... గూండాలను ఎదిరించా!

విద్యార్థి నేతగా ఎంతో నేర్చుకున్నా

సివిల్స్‌ కోసం నిత్యం 18 గంటలు కష్టపడ్డా

వాల్తేరు డీఆర్‌ఎం అనుప్‌కుమార్‌ సతపతి

ఈనాడు, విశాఖపట్నం

పల్లెటూరిలో పుట్టినా పట్నవాసం చదువులు మరో మెట్టెక్కించాయి! ఇంట్లో తండ్రి, చిన్నాన్నలు, మామయ్య అందరూ ప్రభుత్వ ఉద్యోగులే... తానూ అదే తపనతో కదిలారు... చదివారు... గెలిచారు!!

అలా ఉద్యోగం పొందిన రైల్వేలో ఎన్నో రికార్డుల్లో తానూ భాగస్వామ్యమయ్యారు.ఈ క్రమంలో డీఆర్‌ఎం అనుప్‌కుమార్‌ సతపతి జీవితంలో చోటుచేసుకున్న కీలక మలుపులు ఆయన్ని ఒక్కో మెట్టు ఎక్కించాయి. పురోగతికి బాటలు వేశాయి. అవి ఆయన మాటల్లోనే.

అలా ప్రాణహాని... ఏర్పడింది..

పేరు: అనుప్‌కుమార్‌ సతపతి

హోదా: వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం స్వస్థలం: ఝార్ఖండ్‌లోని ఖండామౌదా గ్రామం (ఒడిశా, పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో)

చదువు: డిగ్రీలో బీఎస్సీ; పీజీలో ఆర్ట్స్‌- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రోపాలజీ. సివిల్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసుకున్నారు.

నా విద్యార్థి జీవితం నాకు ఎన్నో నేర్పింది. అందులో ఓ ఘటన నా జీవితాన్నే మలుపు తిప్పింది. చెడును అడ్డుకోవాలనే తత్వం నాది. ఒడిశాలోని ఉత్కల్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చదివే రోజులవి. రోడ్డుపై వెళుతున్న అమ్మాయిని ఓ గూండా ఏడిపిస్తుంటే తట్టుకోలేకపోయా. అతన్ని వారించి అడ్డుకున్నా. ఇది సహించలేక ఆ గూండా, అతని అనుచరవర్గం నాపై దాడికి దిగారు. నిరసనగా నేనొక్కడినే క్యాంపస్‌లోనే ధర్నాకు కూర్చున్నా. నాకు మద్దతుగా ఎంతో మంది వచ్చారు. అతని అనుచరులు నాపై కక్ష కట్టారు. మంచి చేస్తే ఇబ్బందులొస్తాయని అప్పుడే తెలిసింది. పైగా వారికి రాజకీయ చరిత్ర ఉండటంతో నాకు ప్రాణహాని ఏర్పడింది. ఈ పరిస్థితులన్నీ గమనించిన నా సన్నిహితులు, ప్రొఫెసర్లు క్యాంపస్‌ విద్యార్థినేతగా ఉండాలని సూచించారు. అలా డిగ్రీ తొలి సంవత్సరంలోనే కాలేజీ యూనియన్‌కి ప్రధాన కార్యదర్శినయ్యా. తరువాత అధ్యక్షుడినయ్యా. దీంతో యూనివర్సిటీ విద్యార్థుల కోసం జడ్జిలు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, విలువలున్న రాజకీయనేతలు.. ఇలా ఎంతోమందితో అతిథి ఉపన్యాసాలు ఇప్పించాను. అలా అప్పటి సీఎం బిజూపట్నాయక్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలూ నన్ను ప్రోత్సహించారు.

* ఆ మాటలు ఆలోచింపజేశాయి: కళాశాల నేతగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఓసారి బాలాసోర్‌ (ఒడిశా) కలెక్టరేట్‌ను ముట్టడించాం. కలెక్టర్‌ శ్రీనివాస మా డిమాండ్లు అంగీకరించి.. నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఆ మాటలు స్ఫూర్తి నింపాయి. సివిల్స్‌ రాస్తే మీలాంటి వారు అనుకున్నట్లు ఎక్కువ మందికి సేవ చేయవచ్చని వివరించారు. అందుకు ఓ ప్రణాళిక కూడా ఇచ్చారు.

* పనిపై ఇష్టం ఉన్నవారితో: ఈశాన్య రైల్వే చక్రధర్‌పూర్‌ డివిజన్‌లో కేవలం ఐదేళ్లలో ఐరన్‌ఓర్‌, సిమెంటు, స్టీల్‌ రవాణా 10 రెట్లు పెంచేలా మార్పులు తెచ్చాం. ఆ తర్వాత ఈశాన్య మధ్య రైల్వేలో మూడు డివిజన్లకు సేఫ్టీ ఆఫీసర్‌గా నన్ను నియమించారు. ఆ కాలంలో పట్టాలపై ఎలాంటి మరణాలుగానీ, ప్రమాదాలుగానీ లేకుండా చర్యలు తీసుకున్నాం. పనిమీద ఇష్టం ఉన్నవారికి మాత్రమే ట్రాక్‌ పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించడంతో ఈ ఫలితాలు వచ్చాయి. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీజీఎంగా ఉన్నప్పుడు మధ్యభారతదేశంలో రవాణాసామర్థ్యాన్ని పెంచడంతో ప్రభుత్వ ప్రశంసలు వచ్చాయి. వ్యాపార మెలకువలు తెలుసుకునేందుకు రైల్వేలో చేరిన తరువాత ఎంబీఏ చేశా. సరకు రవాణాలో అవగాహనకు యూరప్‌లోని పోర్టులో శిక్షణ తీసుకున్నా. రైల్వే సమస్యలు ఏం చెప్పినా పరిష్కరించేందుకు మా బృందం సిద్ధంగా ఉంది.

* రైల్వేతో ప్రేమ: ఏ చిన్న ఉద్యోగం దక్కినా నలుగురికి మంచి చేయాలనే తపనే నాలో ఉండేది. డిగ్రీ అయ్యాక పీజీ కోసం దిల్లీ వెళ్లా. పలు సార్లు రైలులో ప్రయాణించేటప్పుడు ఎంతోమందితో మాట్లాడేవాడ్ని. రైల్వేమీద నాకొక అవగాహన వచ్చింది. దిల్లీలో ఉంటూ సివిల్స్‌ రాయాలనుకున్నా. బాగా సిద్ధపడ్డాను. దిల్లీ జేఎన్‌ యూనివర్సిటీలో చదివేటప్పుడే నిత్యం 18 గంటల పాటు చదివేవాడిని.

* తొలి ప్రయత్నంలోనే 615 ర్యాంకు వచ్చింది. కస్టమ్స్‌లో ఉద్యోగం వచ్చింది. కానీ చేరలేదు. రెండోసారి రైల్వేస్‌లో అవకాశం చిక్కింది. జాతీయ పురోగతిలో కీలకపాత్ర పోషించే ఈ రంగాన్ని ఎన్నుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. నా స్నేహితులతో, రైల్వేలో ఉద్యోగం చేస్తున్న నా సన్నిహితుల అభిప్రాయాలూ తీసుకుని చేరిపోయా.

కుటుంబసభ్యులతో అనుప్‌కుమార్‌ సతపతి

* ఇల్లు...పూలతోటైపోతుంది: మాది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఆమె పేరు పారిజాత సతపతి. తోటలు, పచ్చిక, సేంద్రియ పంటల్లో ఆమెకు మంచి ప్రావీణ్యముంది. యోగా, ప్రకృతి వైద్యంలోనూ ప్రవేశముంది. మేం ఎక్కడికెళ్లినా ఆ ఇంటిని చక్కటి పూలతోటలా మార్చేస్తుంది. తక్కువ నీటితో పెరిగే మొక్కల్ని ఎంపికచేస్తుంది. మాకు ఇద్దరు పిల్లలు. సమయం దొరికినప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. అంధపాఠశాలలు, అనాథలున్నచోటికి వెళ్తుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని