ఊపిరి తీసిన పొగ
eenadu telugu news
Published : 26/09/2021 03:58 IST

ఊపిరి తీసిన పొగ

ప్రాణాంతకంగా మారిన ఫ్రిజ్‌

శ్వాస ఆడక దంపతుల దుర్మరణం

 

ఇంటిలో నుంచి బయటకు వచ్చిన మంటలు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఫ్రిజ్‌ నుంచి పొగ, మంటలు చెలరేగడంతో ఊపిరి ఆడక దంపతులు దుర్మరణం చెంది దుర్ఘటన శనివారం రాత్రి అల్లిపురం వెంకటేశ్వర మెట్ట గోవింద రోడ్డులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వారం రోజుల కిందట దౌలపల్లి సుబ్బారావు(50), దౌలపల్లి రమణమ్మ(48) ఇక్కడ అద్దె ఇంట్లో దిగారు. అంతకు ముందు సమీపంలోని కెప్టెన్‌ రామారావు కూడలిలో ఉండేవారు. సుబ్బారావు కారు డ్రైవర్‌గా పనిచేసేవారు. వీరి కుమారుడు దుర్గాప్రసాద్‌ కూడా కారుడ్రైవరే. అతను భార్య, ముగ్గురు పిల్లలతో భీమిలిలో నివాసం ఉంటున్నారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే: సుబ్బారావు, రమణమ్మ వారం రోజులు క్రితం ఇంట్లో దిగారు. సామాన్లు కూడా పూర్తి స్థాయిలో సర్దుకోలేదు. శనివారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో రమణమ్మ గ్యాస్‌ సిలిండర్‌ వెలిగించి వంట ప్రారంభించారు. కాసేటికి వంటి గది పక్కనే ఉన్న ఫ్రిజ్‌ నుంచి వెనుక నుంచి కొద్దిగా పొగ రావడం మొదలైంది. అది చూసిన ఆమె.. వెంటనే పడక గదిలో ఉన్న భర్తకు చెప్పడానికి వెళ్లింది. సుబ్బారావు ఫ్రిజ్‌ స్విచ్‌ ఆపు చేయాలని వచ్చేలోపు పొగ చుట్టూ కమ్మేసింది. కళ్లు కూడా కనిపించని పరిస్థితి. దీంతో దంపతులు ఇద్దరు పడక గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఫ్రిజ్‌ స్విచ్‌ ఆపే వీలు లేకపోవడంతో కాసేపటికి పొగ ఇల్లంతా వ్యాపించి మంటలు చెలరేగాయి. లోపల ఏమి జరుగుతుందో బయటి వారికి తెలియని పరిస్థితి. దీంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. మర్రిపాలెం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి విద్యుత్తు సరఫరాను నిలుపుదల చేయించారు. అనంతరం ఇంట్లోని మంటలను అదుపు చేశారు. లోపలికి వెళ్లి చూడగా దంపతులు అచేతనంగా పడి ఉన్నారు. విషయాన్ని స్థానికులు కొడుకు దుర్గాప్రసాద్‌కు తెలపడంతో అతను హుటాహుటీన అక్కడికి చేరుకున్నాడు. విగత జీవులుగా ఉన్న తల్లిదండ్రులను చూసి గుండెలవిసేలా విలపించారు. పోలీసుల మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.


మృతులు దౌలపల్లి సుబ్బారావు, రమణమ్మ (పాతచిత్రం)

మృతికి పొగే కారణం?: డీసీపీ సురేష్‌బాబు, తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర ఘటన స్థలి వద్దకు చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేపట్టారు. ఏసీపీ హర్షిత చంద్ర మాట్లాడుతూ ఫ్రిజ్‌ నుంచి పొగ, మంటలు రావడంతో దంపతులు ఊపిరి ఆడక మృతిచెంది ఉంటారని భావిస్తున్నామన్నారు. దర్యాప్తులో పూర్తి వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ బాధితుడు దుర్గాప్రసాద్‌ను ఓదార్చారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని