అక్రమాల పుట్టగా ఐసీడీఎస్‌
eenadu telugu news
Published : 19/10/2021 03:39 IST

అక్రమాల పుట్టగా ఐసీడీఎస్‌

ఎమ్మెల్యే కన్నబాబు ఆగ్రహం


సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కన్నబాబు

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అన్ని ప్రభుత్వ శాఖల్లో మార్పు వచ్చినా ఐసీడీఎస్‌లో మాత్రం అవినీతి పోలేదని ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తిరాజు (కన్నబాబు) మండిపడ్డారు. ఎలమంచిలి మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐసీడీఎస్‌లో అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్ల అవినీతి పెరిగిపోయిందన్నారు. రాంబిల్లి మండలంలో మరుగుదొడ్ల సొమ్మును అంగన్‌వాడీ కార్యకర్త తన ఖాతాలో వేసుకుందని, తాను విచారణ జరిపించే వరకూ ఈ విషయం ఐసీడీఎస్‌ అధికారులకు తెలియలేదంటూ మండిపడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఏమీ ఇవ్వకపోయినా ఇచ్చినట్టు రాసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అంగన్‌వాడీ కేంద్రాలను వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులకు సమాచారం అందించి వారి సమక్షంలో తనిఖీలు చేయాలన్నారు. జగనన్న కాలనీలు నిర్మిస్తున్న ప్రాంతాల్లో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్తు తీగలను మార్చాలని ఈపీడీసీఎల్‌ అధికారులకు సూచించారు. ఏఈ వెంకటరమణ మాట్లాడుతూ ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు వేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. రైతులకు అందిస్తున్న రాయితీలను వ్యవసాయ శాఖ అధికారి స్వప్న వివరించారు. జలవనరులశాఖలో జరుగుతున్న పనులను ఏఈ చిన్నారావు సభలో వివరించారు. రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంపీపీ బోదెపు గోవింద్‌ మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు రాజాన శేషు, జడ్పీటీసీ సభ్యురాలు సేనాపతి సంధ్యారాణి, ఎంపీడీఓ సత్యనారాయణ, తహసీల్దార్‌ శ్రీనివాసరావు, రేగుపాలెం వైద్యాధికారి వెంకటరత్నం, డీఈఈ నాగేశ్వరరావు, ఎంఈఓ మూర్తి, సర్పంచులు వర్రే గాంధీ, కొండబాబు, రాజాన వెంకట మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని