సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 19/10/2021 04:05 IST

సంక్షిప్త వార్తలు

25 గంటల నిరాహార దీక్ష నేడు

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 250వ రోజుకు చేరుకున్న సందర్భంగా మంగళవారం 25 గంటల దీక్ష నిర్వహించనున్నారు. ఏయూ విశ్రాంత వీసీ, ప్రస్తుత సెంచూరియన్‌ వర్సిటీ వీసీ జీఎస్‌ఎన్‌ రాజు, ఉక్కు విశ్రాంత డైరెక్టర్‌(పర్సనల్‌) కేకే రావు దీక్షను ప్రారంభిస్తారని పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు. 250 మంది కార్మికులతో దీక్ష కొనసాగుతుందన్నారు.


పదోన్నతుల జాబితాలో నలుగురికి చోటు

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : అదనపు ఎస్పీలుగా పదోన్నతులు పొందే జాబితాలో నగరానికి చెందిన నలుగురు డీఎస్పీలకు చోటు దక్కింది. దిశా ఏసీపీ ప్రేమ్‌కాజల్‌, ద్వారకా ఏసీపీ మూర్తి, ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఏసీపీ టి.మోహనరావు, డీటీసీ కె.ప్రవీణ్‌కుమార్‌లు పదోన్నతుల జాబితాలో ఉన్నారు. వీరికి సంబంధించిన వివరాలు, పనితీరు, క్రమశిక్షణ చర్యలు ఇతరత్రా శాఖాపరమైన అంశాలతో కూడిన వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి.


కోలుకుంటున్న గిరిజనులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పోలీసు కాల్పుల్లో గాయపడిన చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన గిరిజనులు కిల్లో కామరాజు, కిల్లో రాంబాబు కోలుకుంటున్నారు. వారి ఎముకలు విరిగిపోవడంతో నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత తదుపరి వైద్యం కోసం కేజీహెచ్‌ ఎముకల వార్డులో చేర్చారు. వీరికి ఎటువంటి ప్రాణాపాయం లేదని, శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉందని వైద్యులు తెలిపారు.


బాలిక మృతిపై నివేదిక సమర్పించండి

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: అగనంపూడిలో ఇటీవల ఓ భవనంపైనుంచి పడి ప్రాణాలు కోల్పోయిన బాలిక మృతి కేసుకు సంబంధించి నివేదిక సమర్పించాలని సీపీ ఎంకే సిన్హాను మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వి.పద్మ ఆదేశించినట్లు మహిళా కమిషన్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. బాలిక మృతిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అది హత్యా? ఆత్మహత్యా? అనే విషయంపై సమగ్ర నివేదికను సమర్పించాలని కోరినట్లు తెలిసింది.


11 కరోనా కేసులు నమోదు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ 11 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ తెలిపారు. బాధితుల సంఖ్య 1,57,821కు చేరిందని చెప్పారు. తాజాగా 40 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 1,55,919 మంది డిశ్ఛార్జి అయ్యారన్నారు. అక్కయ్యపాలెంకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడు కొవిడ్‌తో మృతి చెందటంతో మృతుల సంఖ్య 1,094కు చేరిందన్నారు. ప్రస్తుతం 808 మంది ఆసుపత్రులు, ఇళ్లలో చికిత్స పొందుతున్నారని వివరించారు.


మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న కలెక్టర్‌

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే: కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల క్షేత్రం శ్రీమల్లేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం విశాఖపట్నం కలెక్టర్‌ (కడప జిల్లా సీకేదిన్నె మండల వాసి) ఎ.మల్లికార్జున కుమారుడి కేశఖండన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ కుటుంబ సభ్యులు స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కరించారు.


రెండు వర్గాల ఘర్షణ: ఒకరికి కత్తిపోటు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు వర్గాల మధ్య గ్యాంగ్‌వార్‌ సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనలో ఓ యువకుడిపై కత్తితో దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేపలరేవు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక దండుపాలెం గ్యాంగ్‌గా పిలిచే యువకులు, మరో బృందానికి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. గాయపడిన ఒకరు కేజీహెచ్‌లో చికిత్స పొంది ఇంటికి వెళ్లిపోయారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. అయితే ఘటనపై పోలీసులకు సమాచారం ఉండడంతో ఇరువర్గాల వారిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం కోట్లాటతో ఎటువంటి సంబంధం లేని లోకేష్‌ అనే యువకుడు ఇంటికి వెళ్లిపోతున్న సమయంలో గ్యాంగ్‌లోని గుర్తుతెలియని యువకుడు వచ్చి కత్తితో పొడిచి పరారయ్యాడు. క్షతగాత్రుడిని స్థానికులు కేజీహెచ్‌కు తరలించారు. యువకుడికి ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. కోట్లాటలో సుమారు 20 మందికి పైగా పాల్గొనగా, వారిలో మైనర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని