‘కోతల’కాలం
eenadu telugu news
Published : 19/10/2021 04:05 IST

‘కోతల’కాలం

సాంకేతిక కారణాలేనంటున్న యంత్రాంగం

ఈనాడు-విశాఖపట్నం

బొగ్గు సరఫరాలో సంక్షోభంతో విద్యుత్తుకోతలు విధిస్తున్నారనే ఆరోపణలు జిల్లావ్యాప్తంగా వస్తున్నాయి. కోతలు మొదలయ్యాయనే ప్రచారమూ పలు సామాజిక మాధ్యమాల్లో జరిగింది. ఈ నేపథ్యంలో అదంతా అవాస్తవం, కోతలు లేవంటూ ఈపీడీసీఎల్‌ అధికారులు అధికారిక ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో అక్టోబరులో కోతలు తీరు ఎలా ఉందనేదానిపై ‘ఈనాడు’ పరిశీలన చేసింది.

గతంతో పోల్చితే కోతలు పెరిగినట్లే కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 862 ఫీడర్లున్నాయి. వీటిలో రోజు వారీ ఎంతసేపు కోతలు విధిస్తున్నారు, ప్రభావితమైన ఫీడర్లేన్నో పక్కన పట్టికలో చూడొచ్ఛు ఏ సమయాల్లో ఎన్ని ఫీడర్లు సరఫరా ఆగిందో అక్కడ చూడొచ్ఛు

గ్రామీణంలో ఎక్కువ: విశాఖ జిల్లాలో నగరంతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఫీడర్లలో కోతలు అమలయ్యాయి. రోజుకు సగటున సుమారు 30 నుంచి 40 శాతంపైగా గ్రామీణ ఫీడర్లలో విద్యుత్తు సరఫరా కొంత సమయం ఆగింది. ఈ ప్రభావం నగరంలో తక్కువగా ఉంది. తాజా గణాంకాల్ని చూస్తే.. ఈ నెల 16న గ్రామీణంలో ఇళ్లకు అందించే 48 శాతం ఫీడర్లలో కోతలు నడిచాయి. 21శాతం ఫీడర్లలో అరగంటకంటే ఎక్కువ సేపు సరఫరా ఆగింది. జీవీఎంసీ, ఇతర మున్సిపాలిటీల్లో 25 శాతం ఫీడర్లకు కోతలుపెట్టారు. ఇందులో 5శాతం ఫీడర్లకు అరగంటకు మించి తీసేశారు.

ఇవి అవి కావా..

బ్రేక్‌డౌన్‌ అవడం, ట్రిప్‌ కావడం లాంటి సమస్యలొచ్చినప్పుడు తక్కువ సమయం విద్యుత్తు కోత ఉంటుంది. కానీ కొన్ని ఫీడర్లలో 20నిమిషాలు, అరగంట, గంటకు మించి కోతలు ఉన్నాయి. ఇవి కచ్చితంగా కోతలేనని పలువురు విమర్శిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. కోతలనేవి కేవలం లోడ్‌ను తగ్గించేందుకు చేస్తారని, కొన్ని ఫీడర్లలోనే కోతలు విధించడం వల్ల అంత మేలు జరగదని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సూర్యప్రతాప్‌ తెలిపారు. ఒకవేళ కోతలు విధించే పరిస్థితే వస్తే కొన్ని ఫీడర్ల పరిధిలో కాకుండా డివిజన్‌లో ఉండే ఫీడర్లన్నింటికీ విద్యుత్తు ఆపేస్తారన్నారు. ఇప్పుడలా జరగడంలేదు కనుక వీటిని కోతలుగా పరిగణించొద్దని పేర్కొన్నారు. ఆ అంతరాయాలన్నీ సాంకేతిక సమస్యలతో వచ్చేవేనని చెబుతున్నారు.

బాధలు తప్పట్లేదు

జిల్లాలో రోజువారీ సగటున సుమారు 20 నుంచి 35శాతం ఫీడర్లలో కోతలు కనిపిస్తున్నాయి. 5 నుంచి 15శాతం ఫీడర్లలో అరగంట, గంటకుమించి విద్యుత్తుకు అంతరాయాలు ఉంటున్నాయి. గతంతో పోల్చితే 10 నుంచి 15 శాతం అధిక ఫీడర్లలో కోతలు ఉంటున్నాయి. అక్టోబరు 18న (సోమవారం) సాయంత్రం 6.30గంటల సమయంలో జిల్లాలో 56 ఫీడర్లలో కోతలు నడిచాయి. ఇందులో అరగంటకు మించి 20కిపైగా ఫీడర్లలో విద్యుత్తు ఆగింది. 24గంటల సరఫరాకే ప్రాధాన్యం అన్నప్పుడు ఈ కోతలెందుకు అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని