ముందుంది పన్నుపోటు!
eenadu telugu news
Published : 19/10/2021 04:05 IST

ముందుంది పన్నుపోటు!

శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలకు జీవీఎంసీ ధరలు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

జీవీఎంసీ పరిధిలో ● అసెస్‌మెంట్లు: 5.80 లక్షలు (సుమారు)

వసూలయ్యే ఆస్తిపన్ను: రూ.360 కోట్లు

కొత్త విధానంలో: రూ.500 కోట్లకు చేరొచ్చని అంచనా

మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ)లో మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానం అమలు చేసేలా రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న శిక్షణ అనంతరం నగరంలోని అసెస్‌మెంట్లన్నీ కొత్త విధానంలోకి రానున్నాయి. మరో నెల రోజుల్లో కొత్త పన్నులకు సంబంధించిన డిమాండ్‌ నోటీసులు సిద్ధం చేయనున్నారు. ప్రభుత్వం మూలధన విలువ ఆధారిత పన్ను 0.15 శాతం విధించాలని ప్రతిపాదించగా... పలువురి అభ్యర్థన మేరకు 0.3శాతం తగ్గించి 0.12 శాతం ఆస్తి పన్నుగా విధించేలా పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ క్రమంలో ఖాళీ స్థలాలకు 0.50 శాతం, వాణిజ్య సముదాయాల నుంచి 2 శాతం వసూలు చేస్తే పన్ను భారీ పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా జీవీఎంసీకి ఏటా మరింత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

విలీన పంచాయితీల్లో దడే: జీవీఎంసీ శివారు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో లేఅవుట్‌లు ఏర్పాటయ్యాయి. నగరంలో విలీనమైన పది పంచాయతీల్లోనూ భారీగా ఖాళీ స్థలాలున్నాయి. ఇక్కడ వ్యవసాయేతర భూములన్నింటికీ ఖాళీ స్థలాల పన్ను విధిస్తే జీవీఎంసీకి రూ.60 కోట్ల వరకూ ఆదాయం వస్తుందనేది ఓ అంచనా. ఇప్పటి వరకు పంచాయితీ ధరలనే జీవీఎంసీీ అమలు చేస్తుండగా ... ఇకపై కొత్త విధానంలో అక్కడ వసూలు చేయనున్నారు.

2021-2022 నుంచే అమలు: కొత్త ఆస్తి పన్ను విధానాన్ని 2021-2022 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేకాధికారి పాలనలోనే దానికి అంగీకారం తెలపగా, తాజాగా పాలకవర్గం ఏర్పడిన తరువాత మరోసారి చర్చించి ఆమోదం తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్ధ సంవత్సరం పన్నులు ఇప్పటికే చాలా మంది చెల్లించారు. రెండో అర్ధ సంవత్సర పన్ను కొత్త విధానంలోకి మార్చిన తరువాత వసూలు చేయనున్నారు.

వారూ కొంత చెల్లించాల్సిందే: రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆస్తి పన్ను విధానాన్ని అమలు చేయడానికి ఇచ్చిన ఉత్తర్వుల్లో 350 చదరపు అడుగుల ఇళ్లల్లో నివసించేవారి నుంచి రూ.50 మాత్రమే ఆస్తి పన్ను వసూలు చేయాలని పేర్కొంది. నగరంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం (జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం) ద్వారా నిర్మించిన 14 వేల గృహాలు, హుద్‌ హుద్‌ గృహాలు నాలుగువేలు, టిడ్కో ద్వారా నిర్మిస్తున్న ఇళ్లకు మాత్రమే రూ.50ల ఆస్తి పన్ను పడే అవకాశాలున్నాయి. గతంలో పేదలుండే గృహాలుగా భావించి వీటికి పన్ను మినహాయించారు. నూతన విధానంలో 60 గజాల స్థలం కలిగినవారు రెండు అంతస్తులు నిర్మించుకున్నా...ప్లాను లేకపోయినా 40 శాతం వరకు ఆస్తి పన్ను అదనంగా విధించే అవకాశాలున్నాయి. పన్ను విధానం అంతా ఆన్‌లైన్‌ ప్రక్రియ కావడంతో మార్పులు చేర్పులు చేయడానికి వీల్లేకుండా పకడ్బందీగా రూపకల్పన చేస్తున్నారు.

ప్రభుత్వంతో చర్చిస్తాం: నూతన ఆస్తి పన్ను విధానంలో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వంతో చర్చిస్తాం. రిజిస్ట్రేషన్‌ కాని భూములు, మురికివాడల్లో 70, 80 గజాలలోపు ఇళ్లపై అదనపు అంతస్తులను అనధికారిక నిర్మాణాలుగా పరిగణించవద్దని కోరుతాం. కచ్చితంగా కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని వర్గాలపై భారం లేకుండా చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మూలధన విలువపై 0.12 శాతం పన్నే విశాఖలోనే అమలు చేయాలని నిర్ణయించాం.

- గొలగాని హరి వెంకట కుమారి, మేయర్‌, జీవీఎంసీ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని