పత్తికీ ‘కత్తెర’
eenadu telugu news
Published : 19/10/2021 04:46 IST

పత్తికీ ‘కత్తెర’

మొక్కజొన్న నుంచి ఇతర పంటలకూ వ్యాప్తి

గుంటూరు జిల్లా తాడికొండ ప్రాంతంలో గుర్తింపు

ఇప్పుడిప్పుడే మొదలు.. విస్తరిస్తే పెను నష్టమే!

పత్తికాయను ఆశించిన కత్తెర పురుగు

ఈనాడు, అమరావతి: మూడేళ్లుగా మొక్కజొన్న రైతును కలవరపెడుతున్న కత్తెర పురుగు.. ఇప్పుడు పత్తికీ ఆశించింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని కొన్నిచోట్ల దీని ప్రభావాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫాల్‌ ఆర్మీవామ్‌(స్ఫూడోప్తెరా ఫ్రూగిపెర్దా)గా పిలిచే ఈ పురుగు.. 80 రకాల పంటల్ని నష్టపరుస్తుంది. వివిధ దేశాల్లో మొక్కజొన్నతో సహా పలు పంటలకు పెను విపత్తుగా తయారైంది. మన రాష్ట్రంలోనూ కొంతకాలంగా మొక్కజొన్న సాగుకు సంకటంగా తయారైంది. గతంలో అక్కడక్కడా వరి, ఇతర పంటలనూ ఆశించినా నష్టం పరిమిత స్థాయిలోనే ఉంది. మన రాష్ట్రంలో పత్తిపై కన్పించడం ఇప్పుడే అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే పురుగు ప్రభావం మొదలైంది. ఇది విస్తరిస్తే పత్తికి పెను విపత్తుగా మారే ప్రమాదం ఉంది. కాయ తొలవడం ద్వారా పత్తి దిగుబడిని దెబ్బతీయడంతో పాటు.. పురుగు మందులకు అయ్యే పెట్టుబడిని పెంచుతుంది.

గులాబీ గుబులు.. తగ్గిన సాగు

గతేడాది భారీవర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులు.. ఈ ఏడాది పత్తి సాగు తగ్గించారు. ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 14.90 లక్షల ఎకరాలుకాగా.. 13.05 లక్షల ఎకరాల్లోనే వేశారు. పత్తి సాగుకు ఎకరాకు రూ.30వేల పైనే ఖర్చవుతోంది. గులాబీ పురుగు తాకిడి అధికమైంది. ఎన్ని మందులు చల్లినా లోపల ఉండే దీన్ని నివారించడం సాధ్యంకావడం లేదు.

గతంలో మొక్కజొన్న పంటను ఆశించిన కత్తెర పురుగు

కత్తెర పురుగుతో పిప్పి..

కత్తెర పురుగు ఆశిస్తే.. మొక్కజొన్న కంకులు, ఆకులతో సహా పిప్పిగా తయారవుతాయి. పత్తిలో కాయను తొలిచేస్తుంది. రెక్కల పురుగు దశలో.. గాలివాటానికి ఒక రాత్రిలోనే వంద కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అంటే రాష్ట్రాల హద్దుల్నే దాటేస్తుంది. రోజుకు ఒక్కో పురుగు 25 నుంచి 30 గ్రాముల వరకు తింటుంది. ఒకటిరెండు రోజుల్లోనే కాయను తినేస్తుంది. దీని నియంత్రణకు అధిక మొత్తంలో పురుగు మందులు పిచికారీ చేయాలి. ఫలితంగా పెట్టుబడులు పెరుగుతాయి. ఎకరాకు 2-3 క్వింటాళ్ల దిగుబడులు పడిపోయే ప్రమాదముంది. ఈ పురుగు తలపై తిరగేసిన ‘వై’ ఆకారంలో ఉంటుంది. పొట్ట చివరన.. 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటాయి.

మూడేళ్ల కిందట భారత్‌కు

దక్షిణాఫ్రికాను వణికించిన కత్తెర పురుగు.. అమెరికా, నైజీరియా, జాంబియా, జింబాబ్వే, కెన్యా, ఇథియోపియో తదితర దేశాల్లో కల్లోలం సృష్టించింది. ఘనాలో అత్యవసర పరిస్థితి విధించాల్సిన అవసరం ఏర్పడింది. భారత్‌లో 2018 జులై, ఆగస్టులో కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ ప్రాంతంలోని మొక్కజొన్నలో గుర్తించారు. తర్వాత చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చేరింది. దీని తాకిడికి కర్నూలు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్నను దున్నేయాల్సి వచ్చింది. గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వరి, జొన్న, చెరకు పంటలను నష్టపరిచింది. మహారాష్ట్రలో రెండేళ్ల కిందట పత్తిపై కత్తెర పురుగు ప్రభావాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోనూ కొన్నేళ్ల కిందట పత్తిపై ఈ పురుగు ప్రభావం కన్పించింది.

ఆ మందుల్నే పిచికారీ చేసుకోవచ్చు: సుధారాణి, ప్రధాన శాస్త్రవేత్త(పత్తి), లాం వ్యవసాయ పరిశోధనాస్థానం, గుంటూరు

గుంటూరు జిల్లా తాడికొండ ప్రాంతంలో పత్తిపై కత్తెరపురుగు ప్రభావం కొన్నిచోట్ల కన్పించింది. కర్నూలు జిల్లాలోనూ పరిశీలించాం. మొక్కజొన్న, జొన్నకు పక్కనున్న.. పొలాల్లో కన్పించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి దీని ప్రభావం చాలా తక్కువగానే ఉంది. గులాబీ పురుగు నివారణకు వాడే మందుల్నే దీనికి చల్లుకోవచ్ఛు గట్ల వెంట వయ్యారి భామ, ఇతర కలుపు మొక్కలు లేకుండా చూడాలి.

కత్తెర పురుగు ప్రభావాన్ని పరిశీలిస్తాం: అరుణ్‌కుమార్‌, కమిషనర్‌, వ్యవసాయశాఖ

పత్తికి కత్తెర పురుగు ఆశించిన విషయం మా దృష్టికి రాలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయిస్తాం. గులాబీ పురుగు ఉద్ధృతి తక్కువగానే ఉంది. పంటకు నష్టం చేసేంత స్థాయిలో లేదు. గుంటూరు జిల్లాలో అక్కడక్కడా ఉన్నట్లు గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని