అవినీతి ఏఈకి అనిశా షాక్‌
eenadu telugu news
Updated : 23/10/2021 06:06 IST

అవినీతి ఏఈకి అనిశా షాక్‌

లంచం సొమ్ముతో చిక్కిన మహేశ్వరరావు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: విద్యుత్తు సంస్థలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టిన ఏఈ అనిశాకు చిక్కాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కార్యాలయంలో కాకుండా అనకాపల్లి బస్‌స్టేషన్‌లో రూ. 2 లక్షలు తీసుకునేందుకు సిద్ధమైనా, అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనిశా డీఎస్పీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... వేగి మహేశ్వరరావు బుచ్చెయ్యపేట మండలం వడ్డాది సెక్షన్‌ విద్యుత్తు విభాగంలో ఏఈగా పనిచేస్తున్నారు. ఈ మండలంలో విద్యుత్తు లేబర్‌ పనులు చేసిన గుత్తేదారు పి.రమణ తనకు రావాల్సిన బిల్లుల కోసం ఏఈని కలిశారు. బిల్లులు చేయాలంటే అందులో 5 శాతం కమీషన్‌ ఇవ్వాలని ఏఈ డిమాండ్‌ చేశారు. గతంలో చేసిన, ప్రస్తుతం చేసిన పనులకు కలిపి మొత్తం రూ. 3.20 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టారు. గుత్తేదారు లంచం ఇవ్వడానికి ఇష్టం లేక అనిశాను ఆశ్రయించారు. అధికారుల సూచన ప్రకారం రూ. 2 లక్షలు ఇస్తానని రమణ చెప్పారు. నగదును అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్దకు తీసుకురావాలని ఏఈ మహేశ్వరరావు చెప్పాడు. శుక్రవారం సాయంత్రం నగదు ఇస్తుండగా అనిశా అధికారులు మాటువేసి పట్టుకున్నారు. మహేశ్వరరావు వడ్డాది సెక్షన్‌ ఏఈగా ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నారు. పెందుర్తిలో నివాసం ఉంటున్న ఈయన ఎవరికీ అనుమానం రాకుండా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో లంచం తీసుకోవడానికి ప్లాన్‌ వేశారు. అనిశా ముందస్తు వ్యూహంతో దొరికిపోయారు. నిందితుడు మహేశ్వరరావును శనివారం అనిశా కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే అనిశాను ఆశ్రయించాలని సూచించారు.

చేతులు తడిపితేనే పనులు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వడ్డాది విద్యుత్తు ఏఈ కార్యాలయం అవినీతికి చిరునామాగా మారింది. ఏ పని కావాలన్నా భారీగా మూమూళ్లు ముట్టజెబితే తప్ప పనులు జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముడుపులిస్తే పనులు చేస్తున్నారు, లేదంటే కొర్రీలు పెట్టి తిప్పిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్‌కు రూ. 50 వేల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణంగా ఒక కనెక్షన్‌కు ఖర్చయ్యేది రూ. అయిదు వేలు మాత్రమే. మిగతా సొమ్ము అంతా అధికారులు, సిబ్బంది కలిసి పంచుకుంటున్నారు. గత అయిదేళ్లలో మండలంలో దాదాపు 400 వరకు వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చారు. ఇటీవల సీతయ్యపేటలో ఓ రైతు కనెక్షన్‌ కోసం రూ. 3 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. ఈపీడీసీఎల్‌కి ఫీజు రూపేణా చెల్లించింది మాత్రం రూ. వేలల్లోనే. విద్యుత్తు సంస్థలో పనులు చేసేందుకు గుత్తేదారులున్నా వ్యవహారమంతా ఏఈ కనుసన్నల్లోనే జరుగుతోంది. నర్సీపట్నానికి చెందిన ఓ గుత్తేదారు పేరుతో పనులు చేస్తున్నా చేయించేది మాత్రం ఎర్రవాయి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఓ లైన్‌మెన్‌ అంటే ఆశ్చర్యం కలగక మానదు. అవసరానికి మించి భారీగా ఖర్చులు రాసుకుని రూ.లక్షలు స్వాహా చేస్తున్నట్లు సమాచారం. తాజాగా సంస్థ పనులు చేసే గుత్తేదారే ఏఈ లంచాల మోత భరించలేక అనిశాను ఆశ్రయించారంటే ఇక్కడి పరిస్థితులు అర్ధం చేసుకోవచ్చు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని