నేరగాళ్ల ముద్ర... ‘నిఘా’ నిద్ర!!
eenadu telugu news
Updated : 24/10/2021 05:45 IST

నేరగాళ్ల ముద్ర... ‘నిఘా’ నిద్ర!!

ఈనాడు, విశాఖపట్నం

జైలు రోడ్డులో సీసీ కెమేరా చుట్టూ అల్లుకున్న మొక్కలు

ఇటీవల అగనంపూడిలో ఓ బాలికపై అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఈ కేసులో సాగిన విచారణతో.... నగర శివారుల్లో భద్రతలో డొల్లతనం బయటపడింది. బాలిక ప్రాణాలు కోల్పోయిన ప్రాంతంలోని కొన్ని భవనాల్లో అసలు సీసీ కెమేరాలే లేవు.

కొన్ని నెలల కిందట నగరం మధ్యలో ఓ దుకాణంలో చోరీ జరగ్గా... సీసీ ఫుటేజీ కోసం పోలీసులు వాకబు చేశారు. ఆ దుకాణంలో... సమీపంలోని మరికొన్ని దుకాణాల్లో కెమేరాలే లేకపోవడం గుర్తించారు.

నేరాలు, చోరీలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్న సీపీ సిన్హా ఆదేశాలను కొందరు పోలీసు అధికారులు అంతగా పట్టించుకోవడం లేదు. కొందరు అధికారులు నిఘా కెమేరాల ఏర్పాటు అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువ సంఖ్యలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. కొందరు మాత్రం రకరకాల కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ‘ఒక్క నిఘా కెమేరా.... వంద మంది పోలీసులతో సమానం’ అంటూ ప్రతిరోజూ నగర వ్యాప్తంగా వివిధ ట్రాఫిక్‌ కూడళ్లలో ఏర్పాటు చేసిన ‘స్మార్ట్‌పోల్స్‌’ స్తంభాల మైక్‌ నుంచి ప్రకటనలు ఎన్నోసార్లు వినిపిస్తుంటారు. ఆ ప్రకటనల గళంలో ఉన్న తీవ్రత క్షేత్రస్థాయిలో కనిపించటం లేదు. మరో వైపు ‘మనకోసం’ పేరిట ‘కమ్యూనిటీ సీసీటీవీ నిఘా ప్రాజెక్ట్‌’కు పోలీసులు శ్రీకారం చుట్టారు. విశాఖ నౌకాశ్రయం, గంగవరం పోర్టు, స్టీల్‌ప్లాంట్‌, దివీస్‌, ఎన్‌.టి.పి.సి.సింహాద్రి... తదితర సంస్థ నిధులతో కెమేరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు.  ఆయా సంస్థల తోడ్పాటుతో కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. బీ విచిత్రమైన మరో అంశమేమంటే..ఉన్న కెమేరాల చుట్టూ మొక్కలు పెరిగినా..కొమ్మలు కప్పేసినా ఎవరూ పట్టించుకోకపోవడం. ఇలాంటి పరిస్థితి నగరంలో ఎన్నో ప్రాంతాల్లో ఉంది.


సీపీ ఏమన్నారంటే...

* అన్ని వీధుల్లోనూ సీసీ కెమేరాలు ఉండాలి.

* ప్రతి బహుళ అంతస్తులో తప్పనిసరి

* ‘మన ఇల్లు... మన బాధ్యత’ కార్యక్రమంలో ప్రజల్లో అవగాహన తేవాలి.

* వాణిజ్య దుకాణాలు, హోటళ్లలోనూ ఏర్పాటు చేయాలి.


ఏం జరిగిందంటే...

* కొన్ని బహుళ అంతస్తుల్లో నేటికీ ఏర్పాటు చేయలేదు.
* దుకాణదారులు కూడా అందరూ స్పందించలేదు
* కీలక ప్రాంతాల్లోనూ నెలకొల్పలేదు.


శివారుల్లో తక్కువే...

నేరగాళ్లు ఎక్కువగా శివారు ప్రాంతాలపైనే దృష్టికేంద్రీకరిస్తున్నారు. అయినా ఆయా ప్రాంతాల్లో నిఘా కెమేరాలు అనుకున్నంత స్థాయిలో ఏర్పాటు కాలేదు.

మొత్తం:  23,913


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని