విశాఖ ఉక్కుకు...బొగ్గు కొరత గండం
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

విశాఖ ఉక్కుకు...బొగ్గు కొరత గండం

నెలకు రూ.500 కోట్ల భారం?

ఈనాడు, విశాఖపట్నం

ఆర్థిక సమస్యల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారంలో తాజాగా బొగ్గు కొరత తలెత్తింది. ఇక్కడి అవసరాలకు తగినంత బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో విదేశీ బొగ్గును వినియోగించాల్సి వస్తోంది. సంస్థకు ప్రతి నెలా సుమారు 23 వరకు రేక్‌లు వస్తాయి. ఒడిశాలోని బొగ్గు క్షేత్రాల నుంచి అధికారులు కొనుగోలు చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం బొగ్గు కొరత సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బొగ్గును విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు మాత్రమే పంపిస్తున్నారు. పరిశ్రమలకు సరఫరా చేసే బొగ్గును నిలిపివేయడంతో విశాఖ ఉక్కు కర్మాగారానికి కూడా సరఫరా 15 రోజులుగా నిలిచిపోయింది. ఉన్న నిల్వలు కూడా చాలా వరకు అయిపోవడంతో ఉక్కులోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలను నడిపించడానికి కర్మాగార అధికారులు విదేశీ బొగ్గును వినియోగిస్తున్నారు.

* అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు సుమారు నాలుగు రెట్లు పెరగడంతో సంస్థపై కొనుగోలు భారం కూడా భారీగా పడినట్లైంది. తాజా పరిణామాలతో సంస్థపై ప్రతి నెలా సుమారు రూ.500 కోట్ల వరకు భారం పడొచ్చని అంచనా. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్న నేపథ్యంలో దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలు ఎదుర్కొంటున్న సమస్యనే విశాఖ ఉక్కు ఎదుర్కొంటోందని కర్మాగార ఉన్నతాధికారి ‘ఈనాడు’కు వెల్లడించారు. తాజా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక భారం పడుతున్న విషయం వాస్తవమేనని తెలిపారు. దేశంలో బొగ్గు సరఫరా క్రమంగా మెరుగవుతున్న నేపథ్యంలో త్వరలోనే కర్మాగారానికి దేశీయ బొగ్గు సరఫరా పునరుద్ధరిస్తారని భావిస్తున్నామని వివరించారు.

ప్రభుత్వ రంగ సంస్థకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా బొగ్గు సరఫరా నిలిపివేయడం దారుణం. ఇప్పటికే ఇనుప ఖనిజం ధరలు పెరిగి అవస్థలు పడుతున్న సంస్థపై బొగ్గు సంక్షోభం మరింత ఆర్థిక భారం మోపుతోంది. సంస్థపై రూ.కోట్ల భారం పడకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి’ అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని