విశ్వవిద్యాలయాల నిధులపై ఆరా!
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

విశ్వవిద్యాలయాల నిధులపై ఆరా!

రూ.100కోట్ల వరకు సమీకరించే యోచన

ఈనాడు, విశాఖపట్నం

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల నిధులపై కొందరు ఉన్నతాధికారులు ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది.

విశ్వవిద్యాలయాలు వివిధ కోర్సులను నిర్వహించి ఆర్జించిన మొత్తాలు, దాతలు సమకూర్చిన మొత్తాలు, బ్లాక్‌ గ్రాంట్‌ కేటాయింపులను ఖర్చు చేయగా మిగిలిన సొమ్ము ఎప్పటికప్పుడు వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌.డి.) చేస్తారు. వాటిపై వచ్చే వడ్డీని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి వినియోగించడమో,  మళ్లీ ఎఫ్‌.డి. చేయాలనో నిర్ణయించుకుంటారు. విశ్వవిద్యాలయాలు ఉద్యోగులకు, పింఛనర్లకు చెల్లించే మొత్తాలను ప్రభుత్వం బ్లాక్‌ గ్రాంటు రూపంలో ఇస్తుంది. ఇవి మంజూరు చేయడంలో ఒక్కోసారి జాప్యం జరిగితే ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా జీతాలను, పింఛన్లను సకాలంలో చెల్లించడానికి, వర్సిటీ నిర్వహణకు వీలుగా కొంత మొత్తాన్ని విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉంచుకుంటాయి. ఉద్యోగ విరమణ చేసేవారికి చెల్లించడానికి, ఒప్పంద అధ్యాపకులకు, వివిధ కార్యక్రమాల నిర్వహణలకు వీలుగా ఈ నిధులు ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో విశ్వవిద్యాలయాల్లో వివిధ రకాల మౌలిక వసతుల అభివృద్ధికి వీలుగా వివిధ పథకాల కింద కేంద్రం భారీగా నిధులు విడుదల చేస్తుండడంతో వర్సిటీల ఎఫ్‌.డి.లను ఉపయోగించాల్సిన అవసరం ఉండడంలేదు.

* రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల దగ్గర ఉన్న మొత్తం నిధులు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. అందులో అత్యధికభాగం నిధుల్ని బదిలీ చేయడానికి అవకాశంలేదు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉన్న ఆయా నిధుల్లో కొంతభాగాన్ని ఎ.పి.స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎఫ్‌సీ)కు బదిలీ చేస్తే... ఆ నిధులను పూచీకత్తుగా చూపించి మరిన్ని కోట్ల రూపాయల నిధులను రుణంగా పొందే అవకాశంపై ఆలోచన చేస్తున్నట్లు  ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో వివిధ ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి.


అలా చేస్తే ఆర్థికంగా నష్టమే...

నిధులను బ్యాంకుల నుంచి ఎ.పి.ఎస్‌.ఎఫ్‌.సి.కి బదిలీ చేస్తే విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్ణీత కాలంపాటు ఆయా నిధులను ఉంచకుండా ముందే ఎఫ్‌.డి.లను ఉపసంహరిస్తే బ్యాంకులు చెల్లించే వడ్డీలో భారీగా కోతపడుతుంది. భారీ మొత్తాలను పొదుపు చేస్తాయన్న ఉద్దేశంతో పలు బ్యాంకులు వారి శాఖలను కూడా విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేసుకున్నాయి. విశ్వవిద్యాలయాలు, లక్షలాది మంది విద్యార్థుల  బ్యాంకింగ్‌ అవసరాలను ఆయా బ్యాంకులే చూసుకుంటుంటాయి. ఒక్క ఏయూ ప్రాంగణంలోనే ఎస్‌.బి.ఐ., ఆంధ్రా, సిండికేట్‌ బ్యాంకులకు చెందిన ఐదు శాఖలు కొనసాగుతున్నాయి. వీటిలో ఎఫ్‌.డి.లను ఉపసంహరిస్తే ఆయా బ్యాంకుల ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందోనన్నదీ చర్చనీయాంశంగా మారింది.


అందుకే ఆ నిధులపై దృష్టి..

విశ్వవిద్యాలయాలపై ఎలాంటి ఆర్థిక నష్టం లేకుండా, తక్కువ కాలపరిమితున్న ఎఫ్‌.డి.లను వాటి కాలపరిమితి ముగిసిన తరువాత బదిలీ చేయవచ్చని చెబుతూ  వాటిని ఎ.పి.ఎస్‌.ఎఫ్‌.సి.కి బదిలీ చేసేలా సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో విశ్వవిద్యాలయం నుంచి వాటి ఆర్థిక స్థితిని బట్టి అత్యధికంగా రూ.10 కోట్ల వరకు బదిలీచేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతానికి అన్ని విశ్వవిద్యాలయాల నుంచి రూ.100కోట్ల వరకు నిధులను సమకూర్చుకోవడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని