చుక్కలనంటుతున్నాయ్‌!
eenadu telugu news
Updated : 24/10/2021 05:40 IST

చుక్కలనంటుతున్నాయ్‌!

కూరగాయలు కొనేదెలా..!

అనకాపల్లి, న్యూస్‌టుడే

గులాబ్‌ తుపాను తరవాత కూరగాయల ధరలు మండుతున్నాయి. వంటలో రోజూ తప్పనిసరిగా ఉండే ఉల్లిపాయలు, టమాటాల ధరలూ విపరీతంగా పెరగడంతో సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు పడుతోంది. చాలావరకు ఆకుకూరలు మార్కెట్‌కే రావడమే లేదు. దాంతో చౌకగా లభించాల్సిన ఆకుకూరలూ కొండెక్కాయి.

అనకాపల్లిలో హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ ఉంది. ఇక్కడ నుంచి గ్రామీణ జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు గాజువాక, స్టీల్‌ప్లాంట్‌, కూర్మన్నపాలెంకు కూరగాయలను సరఫరా చేస్తారు. డిమాండ్‌కు సరిపడా సరకు రాకపోవడంతో రోజురోజుకు ధరలు పెరుగుతున్నట్లు వర్తకులు తెలిపారు. తుపాను కారణంగా జిల్లాలోని అనేక గ్రామాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని, ఇదే ధరల పెరుగుదలకు కారణమని హోల్‌సేల్‌ వ్యాపారులు అంటన్నారు. మార్కెట్‌లో రోజుకు అన్నిరకాల కూరగాయలు కలిపి 1,600 క్వింటాళ్లు అవసరం కాగా, ప్రస్తుతం 1,100 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నట్లు వర్తకులు చెబుతున్నారు.


ఉల్లి పేరు వింటేనే హడల్‌

వంటకాలు అన్నింటిలోనూ ఉల్లి ఉండాల్సిందే. ఇప్పుడు దాని పేరు వింటేనే వినియోగదారులు బెంబేెలెత్తిపోతున్నారు. మార్కెట్‌లో కేజీ రూ. 50 నుంచి 60 ధర పలుకుతోంది. జిల్లాలో ఉల్లి పంట ముగింపు దశకు చేరుకుంది. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి సరకు తెప్పించాల్సి వస్తోంది. కొత్త పంట వస్తే ధరలు తగ్గుతాయని హోల్‌సేల్‌ కూరగాయల వ్యాపారి  వై.చలం తెలిపారు. అనకాపల్లిలో ఉల్లి విక్రయాలకు పలు హోల్‌సేల్‌ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడకు రోజుకు 20 టన్నుల దిగుమతి అవుతుంది. ఇక్కడి నుంచి పాడేరు, చింతపల్లి, అరకులోయ, లంకెలపాలెం, అగనంపూడి, అచ్యుతాపురం, చోడవరం, ఎలమంచిలి, సబ్బవరం ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.


టమాటా ధర పైపైకి..

తుపాను ముందు వరకూ టమాటా కేజీ రూ. 25 నుంచి రూ. 30 వరకు విక్రయించేవారు. ప్రస్తుతం టమాటాలు రూ. 50 నుంచి రూ. 60 మధ్య పలుకుతున్నాయి.  బెంగళూరు, చిత్తూరు నుంచి ఇక్కడి మార్కెట్‌కు సరకు వస్తుంది. జిల్లాలో విస్తారంగా పండించే బీర, వంకాయల ధరలు సైతం  పెరిగాయి. సబ్బవరం, కశింకోట, రోలుగుంట, అనకాపల్లి ప్రాంతాలలో వీటిని రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. స్థానికంగా పంట లేకపోవడంతో విజయవాడ, సికింద్రాబాద్‌ నుంచి రప్పిస్తున్నారు.


పంటలు దెబ్బతిన్నాయి

బీర, బెండ పంటలు సాగు చేస్తాం. వర్షానికి పంట పోయింది. పెట్టుబడి రాని పరిస్థితి ఏర్పడింది. కొద్దిపాటి పంట ఉన్నా పూతదశలో వర్షాలు కురిసినందున దిగుబడులు తగ్గిపోయాయి.

- దాడి వెంకట్‌, రైతు, మునగపాక  


ఇష్టంలేకపోయినా..

మార్కెట్‌లో వేటి ధర తక్కువగా ఉందో చూసుకోని వాటినే కొంటున్నాం. ఇష్టమైన కూరగాయలు కొనుగోలు చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఇంటిలో అందరికీ చిక్కుడు కాయలంటే ఇష్టం. వాటి ధర కేజీ రూ. 100 పలకడంతో రూ. 20 పెట్టి రెండు అరటికాయలు తీసుకున్నాం. ఆకుకూరల ధరలూ పెరిగిపోయాయి.  

- కె.లక్ష్మి, గృహిణి, అనకాపల్లి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని