ఘాట్‌రోడ్డులో మరోసారి దారి దోపిడీ
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

ఘాట్‌రోడ్డులో మరోసారి దారి దోపిడీ

సీలేరు, న్యూస్‌టుడే: దారకొండ ఘాట్‌రోడ్డులో మరోసారి దొంగలు చెలరేగిపోయారు. కారును ఆపి అందులో ఉన్న ప్రయాణికుల వద్ద నుంచి నగదు, బంగారం తీసుకుని, వాహనంతో పాటు డ్రైవర్‌ను అపహరించుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నుంచి ముగ్గురు వ్యక్తులు లంబసింగి సందర్శనకు వచ్చారు. తిరిగి సీలేరు మీదుగా కర్నూలుకు పయనమయ్యారు. శనివారం తెల్లవారుజామున సప్పర్ల రెయిన్‌గేజ్‌ వద్దకు వచ్చేసరికి ఆరుగురు దుండగులు కత్తులు, రాడ్లతో బెదిరించి కారును ఆపారు. కారును చుట్టుమట్టి అందులో ఉన్నవారిని బయటకు దించి కొట్టారు. వారి నుంచి నగదు, బంగారం తీసుకున్నారు. అనంతరం కారుతో సహా డ్రైవర్‌ను అపహరించుకుపోయారు. దుండగుల చేతిలో దెబ్బలు తిన్న ఇద్దరు బాధితులు కారడవిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిస్సహాయతతో నిరీక్షించారు. ఇంతలో విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు రావడంతో అందులో   సీలేరు చేరుకున్నారు. అక్కడి నుంచి భద్రాచలం వెళ్లిపోయారు. ఈ  ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

అనుమానాలు తావిస్తున్న ఘటనలు

దారాలమ్మ ఘాట్‌రోడ్లో ఇటీవల జరుగుతున్న సంఘటనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈనెలలో జరిగిన మూడు సంఘటనల్లో కారుతో పాటు డ్రైవర్‌ను అపహరించుకుపోయారు. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. సమాచారం తెలిసిన తరువాత పోలీసులు బాధితుల గురించి ఆరా తీస్తుంటే వారి ఆచూకీ తెలియడం లేదు. బాధితులకు, గంజాయి మాఫియాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని