నిరీక్షణ ఫలించి.. విస్తరణకు నిధులొచ్చి..
eenadu telugu news
Updated : 24/10/2021 06:26 IST

నిరీక్షణ ఫలించి.. విస్తరణకు నిధులొచ్చి..

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

ఇరుగ్గా ఉన్న అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు

సుదీర్ఘకాలంగా ప్రజలు, వాహనదారులు ఎదురుచూస్తున్న అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధిలో భాగంగా దీన్ని నాలుగు వరుసల రహదారిగా విస్తరించనున్నారు. ప్రత్యేక ఆర్థిక మండలిని 16వ నంబర్‌ జాతీయ రహదారితో అనుసంధానం వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు.

గ్రామీణ జిల్లా కేంద్రమైన అనకాపల్లిని అంతర్జాతీయ పరిశ్రమలకు వేదికగా నిలిచే అచ్యుతాపురాన్ని అనుసంధానం చేయడానికి తెదేపా ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకున్నారు. 15 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు ఇరుగ్గా ఉంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 22వేల మంది మహిళా ఉద్యోగులను రోజూ విధులకు తీసుకెళ్లే వందలాది బస్సుల రాకపోకలతో తరచూ ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. దశాబ్దాలుగా వాహనదారులు, ప్రయాణికులు ఎంతో ఇబ్బందిపడుతున్నారు. రోడ్డును 200 అడుగుల మేర విస్తరించాలని అప్పటి తెదేపా ప్రభుత్వం తొలుత ప్రతిపాదించింది. అయితే నిర్వాసితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని దీనిని 120 అడుగుల మేర మాత్రమే విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోడ్డులో రాకపోకలు సాగించే వాహనాలు, ప్రజల రద్దీలపై కెనడాకు చెందిన లీ అసోసియేషన్‌ అనే అంతర్జాతీయ సంస్థతో సర్వే జరిపించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రోడ్డు కొలతలు, నిర్వాసితుల అభిప్రాయాలు తెలుసుకునేలోగా ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది.

సర్వే చేస్తున్న సిబ్బంది

ఏడీబీ రుణంతో...

రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించడానికి ఏషియన్‌ అభివృద్ధి బ్యాంకు రూ.182 కోట్లను రుణంగా అందించడానికి అంగీకరించింది. భూనిర్వాసితులకు పరిహారం అందించిన తర్వాత నిర్మాణ పనులకు టెండర్లను పిలవాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే విజయవాడలో ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. నాలుగు లైన్ల రోడ్డు నిర్మించడంతోపాటు మునగపాక, హరిపాలెం వద్ద రెండు వంతెనలు, అచ్యుతాపురం కూడలి వద్ద ప్లైఓవర్‌ వంతెన నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్లైఓవర్‌ నిర్మాణాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు.

1200 మంది నిర్వాసితులు

రహదారి విస్తరణ కోసం 1200మంది రైతుల నుంచి 1,04,605 చదరపు గజాల స్థలాన్ని అధికారులు సేకరిస్తున్నారు. 100అడుగుల మేర రోడ్డును విస్తరించి రోడ్డుకు ఇరువైపులా కొలతల రాళ్లను ఏర్పాటుచేశారు. దీంతోపాటు ఈ రోడ్డులో ఎంతమంది ఇళ్లు కోల్పోతున్నారనే విషయాలపై ఇప్పటికే ర.భ.శా. అధికారులు సర్వే పూర్తి చేశారు. మిగిలిపోయిన వారి వివరాలను సేకరించడానికి సిబ్బంది సర్వే చేపడుతున్నారు. నిర్వాసితుల ఇళ్లు, ఫొటోలు సేకరిస్తున్నారు.


వెంటనే పనులు ప్రారంభించాలి....

రోడ్డును ఆనుకొని దుకాణం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాము. విస్తరణ పనులను ప్రారంభించకపోవడంతో ఇబ్బంది పడుతున్నా. గతంలో నాయకులు ఎన్నిసార్లు ప్రకటించినా హామీలుగానే మిగిలిపోయాయి.  వెంటనే పనులు ప్రారంభించాలి.

- తురాయిశ్రీరాములు, హరిపాలెం


డ్రైవింగుకు తిప్పలే..

నేను ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నాను. రోడ్డు దెబ్బతిని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళుతున్నాం. గతంలో అనకాపల్లి వెళ్లడానికి ఎంత నెమ్మదిగా వెళ్లినా అరగంటకు మించి పట్టేది కాదు. ప్రస్తుతం ఎంత ప్రయత్నించినా గంటకుపైగా సమయం పడుతోంది.

- రేబాక రమేష్‌, డ్రైవర్‌, తిమ్మరాజుపేట


సెజ్‌లోని పరిశ్రమల నిర్వాహకులు సైతం రోడ్డును విస్తరించాలని ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడల్లా కోరసాగారు. దీంతో వైకాపా నాయకులు దీనిపై దృష్టిసారించారు. విస్తరణలో కీలకమైన ఘట్టమైన నిర్వాసితులకు పరిహారం అందించడానికి రూ.106.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులిచ్చింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని