పోషకాహారం సక్రమంగా అందకపోతే కఠిన చర్యలు
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

పోషకాహారం సక్రమంగా అందకపోతే కఠిన చర్యలు

మంత్రి తానేటి వనిత

చిన్నారికి గోరుముద్ద తినిపిస్తున్న మంత్రి తానేటి వనిత

విశాఖపట్నం, న్యూస్‌టుడే: క్షేత్రస్థాయిలో పరిశీలనలు ముమ్మరం చేసి, చిన్నారులు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో స్త్రీశిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, పర్యవేక్షకులతో  శనివారం జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో పాలప్యాకెట్ల కుంభకోణం చోటు చేసుకుందని, లోపాలను సరిదిద్దే క్రమంలో వేలిముద్రల హాజరు ద్వారా పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎక్కడో ఒక మూల తప్పిదం జరిగితే మొత్తం శాఖపై ఆ ప్రభావం పడుతోందని, అట్టివాటికి అవకాశం ఇవ్వరాదన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పబోవని మంత్రి హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సత్యవతి, మేయరు  హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాష్ట్ర మహిళా సంక్షేమ సంస్థ ఛైర్‌పర్సన్‌ హేమమాలినిరెడ్డి, జేసీ అరుణ్‌బాబు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్‌ చిన్మయిదేవి తదితరులు పాల్గొన్నారు.

* ఈ సందర్భంగా మహిళాభివృధ్ధి, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలపై ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వీటిని మంత్రులు, ఇతర అతిథులు సందర్శించారు. మంత్రి తానేటి వనిత చిన్నారికి గోరుముద్ద తినిపించారు. అనంతరం వివిధ అంశాలపై ముద్రించిన గోడప్రతులను ఆవిష్కరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని