‘తెదేపా అధికారంలోకి రాగానే డీజీపీపై విచారణ’
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

‘తెదేపా అధికారంలోకి రాగానే డీజీపీపై విచారణ’

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బండారు, చిత్రంలో ఎమ్మెల్సీ రామారావు, మాజీ ఎమ్మెల్యే పల్లా

విశాఖపట్నం, న్యూస్‌టుడే: రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ వైకాపా కార్యకర్త తరహాలో వ్యవహరిస్తున్నారని, తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనపై విచారణ జరిపి జైలులో పెడతామని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి వెల్లడించారు. పార్టీ నేతలు పల్లా శ్రీనివాసరావు, దువ్వారపు రామారావు తదితరులతో కలిసి బండారు శనివారం విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కుప్పం వస్తే చంద్రబాబు వాహనంపై బాంబులు వేస్తామంటూ వైకాపా నాయకుడు హెచ్చరించినా డీజీపీ స్పందించకపోవడం దారుణమన్నారు. పైగా యాక్షన్‌కు రియాక్షన్‌ అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌, విజయసాయిరెడ్డిలకు జైలు అనుభవం ఉందని, గౌతమ్‌సవాంగ్‌ సైతం దానికి సిద్ధంగా ఉండాలన్నారు. తెదేపా నేత పట్టాభి భార్యను ఇబ్బంది పెట్టిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే ‘రూల్‌ ఆఫ్‌లా’ ఉల్లంఘనలపై కమిటీలు వేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారన్నారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో చేపట్టిన కట్టడాల్లో అత్యధికం అక్రమాలున్నాయని, కూర్మన్నపాలెంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారన్నారు. అటువంటి వ్యక్తులు చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమన్నారు. తెదేపా అధికారంలో ఉన్న అయిదేళ్లలో ఎంత గంజాయి పట్టుబడింది? వైకాపా రెండున్నరేళ్ల పాలనలో ఎంత గంజాయి పట్టుబడిందో గణాంకాల సహా పోలీసులు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

దాడికి బాధ్యులను అరెస్టు చేయాలి

నగరంలోని తెదేపా కార్యాలయంపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేయాలని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. విలేకర్ల సమావేశంలో పల్లా మాట్లాడుతూ దాడి ఘటనపై అదే రోజు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మరోసారి వెళ్లి కలుస్తామని, అప్పటికీ స్పందించకపోతే సీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, కోరాడ రాజబాబు, పుచ్ఛా విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని