అప్పుడే నయం.. ఇప్పుడు మాయం
eenadu telugu news
Published : 24/10/2021 05:37 IST

అప్పుడే నయం.. ఇప్పుడు మాయం

నాలుగేళ్లలో తగ్గిన వన్యప్రాణులు

ముగిసిన జంతు గణన

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

పులి గాండ్రింపులు లేవు.. దుప్పులు, జింకల పరుగులు లేవు.. కనువిందు చేసే మయూరాలూ లేవు.

అడవి పందులు, కణుజులు ఏమయ్యాయో తెలియడం లేదు. జాతీయ జంతు గణన కార్యక్రమం ఈ నెల ఎనిమిదిన మొదలై 18తో ముగిసింది. దాదాపు రెండొందల మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కలిసి 52 బీట్లలో కాలినడకన తిరిగారు. నిర్దేశించిన అటవీ ప్రాంతంలో అధునాతన పరికరాలతో అణువణువూ గాలించారు. జంతువుల పాదముద్రలు, విసర్జితాలు, చెట్ల రాపిడి, బొరియలు ఇలా అన్ని కోణాల్లో పరిశీలించారు. మర్రిపాకలు అటవీ రేంజ్‌లో తప్ప నర్సీపట్నం, కృష్ణదేవిపేట, చింతపల్లి, లోతుగెడ్డ, ఆర్వీనగర్‌, సీలేరు రేంజ్‌ల్లో చెప్పుకోదగ్గట్లు జంతువులేవీ కనిపించలేదు.

దేశవ్యాప్తంగా నాలుగేళ్లకోసారి జంతుగణన జరుగుతుంది. ఈసారి క్షేత్రస్థాయి నుంచి జంతువుల ఆనవాళ్లు, ఇతర అంశాలను యాప్‌లో నమోదు చేసే కార్యాచరణ చేపట్టారు. నర్సీపట్నం అటవీ డివిజన్‌ మొత్తంగా ఎక్కడా పులులు, చిరుతల జాడలేదు. వీటి అరుపులైనా వినలేదని గిరిజనులు చెబుతున్నారు. ఇవి ఎక్కడైనా సంచరిస్తున్నట్టయితే సమీప గ్రామాల్లో పశువులకు నష్టం జరుగుతుంటుంది. మర్రిపాకలు రేంజ్‌లో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. గతంలో ఇక్కడ పులులు, చిరుతలు ఉండేవి. ఇప్పుడు గడ్డి పిల్లి (జంగిల్‌ క్యాట్‌), గొర్రె గేదె (బైసన్‌), నెమళ్లు, కణుజు, కొండగొర్రెలు ఉన్నట్లు ఆ ప్రాంతీయులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 2018లో జంతు గణన జరిగినప్పుడు రెండు కృష్ణజింకలు, 17 కొండ గొర్రెలు, మూడు కుందేళ్లు, రెండు నెమళ్లు, 74 కణుజులు, మూడు అడవి గేదెలు, 159 అడవి పందులు, 23 అడవి కోళ్లు కనిపించాయి. ఇప్పుడు ఆ స్థాయిలోనూ కనిపించలేదని సమాచారం. అడవిలో స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడ్డాయి. వాతావరణం సహకరించక అవి తమ ఆవాసాల్లోనే ఉండిపోయాయా అని అధికారులు అనుమానిస్తున్నారు.

వర్షాల వల్లనేనా?

జంతుగణనకు చలికాలం, వేసవి కాలం అనుకూలమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వేసవిలో అయితే మాంసాహార జంతువులు, శాఖాహార ప్రాణులు తాగునీటి కోసం గెడ్డల వద్దకు వస్తుంటాయి. తద్వారా వాటి పాదముద్రలు, పెంటికలు (విసర్జితాలు), చెట్ల రాపిళ్ల ద్వారా ఏ రకాల జంతువులు తిరుగుతున్నాయో అంచనా వేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈసారి జంతుగణన మొదలైనప్పుటి నుంచి మన్యంలో వర్షాలు పడుతున్నాయి. గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకైతే వాగులు దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. గణన కొన్నాళ్లు వాయిదా వేద్దామన్నా జాతీయ కార్యక్రమం కావడంతో వీలుకాని పరిస్థితి. ప్రస్తుతం అటవీ ప్రాంతమంతా పచ్చదనం పరచుకుని దట్టంగా ఉంది. దీంతో కొన్నిచోట్ల లోపలకు వెళ్లడానికి సిబ్బంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. వేటగాళ్ల ఉచ్చుల కారణంగా ఇప్పటికే జింకలు, దుప్పులు, కణుజులు, అడవిపందులు, కొండగొర్రెల సంఖ్య తగ్గింది. క్రూరజంతువుల జాడ ఎలాగూ లేదు.. మిగిలిన జంతువులనైనా కాపాడుకునేలా అధికారులు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరముంది.

గొర్రె గేదె


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని