ఆదాయం పెంచుకునే లక్ష్యం
eenadu telugu news
Published : 25/10/2021 03:58 IST

ఆదాయం పెంచుకునే లక్ష్యం

క్షేత్రస్థాయిలోకి రిజిస్ట్రేషన్‌ శాఖ


ఇటీవల సమావేశమైన అధికారులు

ఈనాడు, విశాఖపట్నం: ఆదాయ సముపార్జనకు రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రయత్నిస్తోంది. కొవిడ్‌ పరిస్థితుల వల్ల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే దానిపై తప్ప ఇతర మార్గాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. దీంతో రెవెన్యూ అంతంతమాత్రంగానే వచ్చింది. దీన్ని పెంచుకునే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పెండింగు డాక్యుమెంట్లు పూర్తిచేయడం, బకాయిలు రాబట్టడం, తక్కువ రుసుం చెల్లించిన వారికి నోటీసులు జారీ చేయడం, పోస్టుఫ్యాక్టు ఫీజులు వసూలు చేయడం వంటి వాటిపై దృష్టి సారించినట్లు తెలిసింది. ప్రతి నెలా వీటిని అమలు చేస్తున్నప్పటికీ ఇకనుంచి యుద్ధప్రాతిపదికన తనిఖీలు చేపట్టి కొంతవరకైనా ఆదాయం పెంచాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట డీఐజీ కార్యాలయంలో జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్లు సమావేశమయ్యారు. ఇందులో ఆయా కార్యాలయాల నుంచి వసూలవ్వాల్సిన బకాయిలు, పెండింగు డాక్యుమెంట్లు వంటి అంశాలపై సమీక్షించారు.

ఇళ్లకు వెళ్లి తనిఖీలు..

రెవెన్యూ సాధనలో భాగంగా పోస్టుఫ్యాక్టు తనిఖీలు అధికంగా చేయనున్నారు. నిర్మాణాలకు తగ్గట్టు రుసుం చెల్లించారా లేదా అనేది తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్లు చేసిన ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలు చేపట్టే వారిలో ఎక్కువమంది వారికి తెలియకుండానే తక్కువ కొలతలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం జరుగుతుంది. అవగాహన లేకపోవడం, కొలతలపై స్పష్టత లేకపోవడంతో ఇటువంటి తప్పిదాలు చోటుచేసుకుంటాయి. అటువంటివి గుర్తించి మరీ రుసుములు వసూలు చేయనున్నారు. నగర పరిధిలో ద్వారకానగర్‌, సూపర్‌బజార్‌ కార్యాలయ పరిధిలో ఇటువంటి నిర్మాణాలు తక్కువ. మధురవాడ, పెందుర్తి, ఆనందపురం, భీమిలి, గాజువాక, అనకాపల్లి, గోపాలపట్నం, సబ్బవరం, కశింకోట, నక్కపల్లి, నర్సీపట్నం వంటి ప్రాంతాల్లో ఇటువంటివి గుర్తించే అవకాశం ఉంది.

* లక్ష్యం దిశగా..: రెవెన్యూ సాధనలో రిజిస్ట్రేషన్‌ శాఖ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి విశాఖ నగర పరిధిలోని 8 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ప్రభుత్వం వెయ్యి కోట్ల లక్ష్యం విధించగా ఈ ఆరు నెలల్లో రూ.361 కోట్ల రెవెన్యూ సాధించారు. కొవిడ్‌ సమయంలో ఆనందపురం, భీమిలి కార్యాలయాలు రెండు నెలల పాటు సక్రమంగా తెరుచుకోకపోవడంతో కొంత ఆదాయం తగ్గింది. ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్లు ఉన్నప్పటికీ కేవలం ఒకటి, రెండు చోట్ల ఎక్కువ రిజిస్ట్రేషన్లు, మిగిలిన చోట్ల తక్కువ అవ్వడం గమనార్హం. సెప్టెంబరు నెలలో 5724 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.70 కోట్ల ఆదాయం సాధించింది. ఈ రెవెన్యూను మరింత పెంచాలని అధికారులు చూస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని