ఒకటనుకొంటే.. మరొకటయింది!!
eenadu telugu news
Published : 25/10/2021 03:58 IST

ఒకటనుకొంటే.. మరొకటయింది!!

అటకెక్కిన ‘స్మార్ట్‌ క్లాస్‌’

ఈనాడు, విశాఖపట్నం

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన ఉండాలనేది లక్ష్యం. అలా అమలు చేయతలపెట్టిన ‘స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌’, ‘డిజిటల్‌ క్లాస్‌రూమ్‌’ ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి కొన్న అత్యాధునిక బోధన పరికరాలు మరమ్మతులకు గురయ్యాయి. నగర వ్యాప్తంగా జీవీఎంసీ పాఠశాలల్లో ఇలాంటి స్థితి నెలకొంది.

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) వ్యాప్తంగా పలు పాఠశాలల్లో ‘స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌’, ‘డిజిటల్‌ క్లాస్‌రూమ్‌’లు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు డిజిటల్‌ పెన్‌తో ఇచ్చే సందేశాల్ని బట్టి... ప్రొజెక్టర్‌ ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. మినీ ల్యాప్‌టాప్‌ల్లాంటి క్రోమ్‌ పుస్తకాల్లోనే విద్యనభ్యసించే విధానం ‘స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌’ ప్రాజెక్టులో తెచ్చారు. ఉన్నత పాఠశాలల్లో కనీసం 5 తరగతులు, ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 1, 2 తరగతుల్ని ఇలా మార్చారు. అలాగే కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని మరింతగా పెంచుకునేందుకు ‘డిజిటల్‌ క్లాస్‌రూమ్‌’ ప్రాజెక్టుల్ని తెచ్చారు. చాలా పాఠశాలల్లో ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. సుమారు 60 నుంచి 80 శాతం పాఠశాలల్లో పరికరాలు మూలకు చేరాయి. సాంకేతిక నిపుణులు లేకపోవడం, నిర్వహణ చేసేవారు కరవై...భారీధనంతో ఏర్పాటు చేసిన పరికరాలు మూలకు చేరాయి.

‘చెప్పేవారు’ లేరు...

పరికరాల్లో వచ్చే సాఫ్ట్‌వేర్‌ ఇబ్బందులు, ఇతర సాంకేతిక సమస్యలపై ఉపాధ్యాయులకు పట్టులేకపోవడంతో విద్యార్థులకు తగిన రీతిలో బోధన సాగటం లేదు. గత విద్యా సంవత్సరం వరకూ ఓ ప్రైవేటు సంస్థకు చెందిన నిపుణులు పిల్లలకు సాంకేతికాంశాలు చెప్పేవారు. వారి ఒప్పందం ముగియడంతో ప్రస్తుతం నిర్వహణపై యంత్రాంగం ముప్పుతిప్పలు పడుతోంది.

ఏముంది ప్రయోజనం...

కొన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు చొరవ చూపి...తమ ఉపాధ్యాయుల్లోనే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారితో ఈ తరగతుల్ని నడిపించేస్తున్నారు. ఎన్జీజీవోస్‌ కాలనీ ఉన్నత పాఠశాలలో 10 స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌లుండగా ప్రస్తుతం 3 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగిలినవి మరమ్మతులు పూర్తవలేదు. 40 క్రోమ్‌ పుస్తకాలున్నప్పటికీ వాటిని వినియోగించలేకపోతున్నారు. నక్కవానిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలితో స్మార్ట్‌ క్లాసులు చెప్పిస్తున్నా.. క్రోమ్‌పుస్తకాల్ని ఛార్జింగ్‌ పెట్టుకునేందుకు అవస్థలుపడుతున్నారు. అక్కడ యూపీఎస్‌లో లోపాలున్నాయి. డిజిటల్‌ క్లాసుల్లో సీపీయూలు కూడా పని చేయడంలేదు. ఇలా పలు పాఠశాలల్లో సమస్యలున్నాయి.

యంత్రాంగం మౌనం...

కొవిడ్‌ రెండో విడత తర్వాత పాఠశాలలు తెరచి చాలారోజులైనా ఇప్పటికీ ఆ సాంకేతిక పరికరాలపై యంత్రాంగం దృష్టిపెట్టలేదు. ఈ విషయమై జీవీఎంసీ ఉప విద్యాశాఖాధికారి శ్రీనివాస్‌ను సంప్రదించగా.. జీవీఎంసీ పాఠశాలల్లో ఎక్కడెక్కడ ఎలాంటి సమస్య ఉందనే దానిపై ఆరా తీస్తున్నామని, త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.


ఇదీ.. రాత

ఈ చిత్రాన్ని బాగా గమనిస్తే.. దుస్థితి గుర్తించొచ్ఛు పసుపు వృత్తంలో కనిపించే ప్రొజెక్టర్‌ ద్వారా దానికెదురుగా ఉన్న తెల్లబోర్డుపై డిజిటల్‌ పాఠాలు చెప్పాలి. ప్రొజెక్టర్‌ ఉపయోగంలో లేక సాధారణ బోర్డుపై పాఠాలు చెప్పే పరిస్థితి ఎన్జీజీవోస్‌ కాలనీలోని పాఠశాలలో ఉంది.


అలా ఉంచేశారు...

డిజిటల్‌ విధానంలో క్లాస్‌లు వినేందుకు, నేర్చుకునేందుకు వినియోగించే క్రోమ్‌ పుస్తకాలు (మినీ ల్యాప్‌టాప్‌లు) వినియోగంలోకి రావడంలేదు. తాటిచెట్లపాలెంలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఇవి దుమ్ముపట్టాయి. ఇక్కడ వాటినలాగే వదిలేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని