తేనెటీగల దాడి.. బావిలో వ్యక్తి గల్లంతు
eenadu telugu news
Published : 25/10/2021 03:58 IST

తేనెటీగల దాడి.. బావిలో వ్యక్తి గల్లంతు

కొనసాగుతున్న గాలింపు


అప్పికొండ ప్రసాద్‌

పరవాడ, న్యూస్‌టుడే: తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి బావిలో దూకి గల్లంతైన ఘటన ఆదివారం పరవాడ మండలం జాజులవానిపాలెంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పరవాడ సి.ఐ. ఈశ్వరరావు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అప్పికొండ ప్రసాద్‌(51) వ్యవసాయం, పశుపోషణ చేస్తూ వీలు చిక్కినప్పుడు లారీ డ్రైవింగ్‌కు వెళ్తాడు. ఆదివారం పశువులను మేతకు తీసుకెళ్లడానికి ఉదయం 9 గంటలకు తన పొలానికి వెళ్లాడు. అక్కడ కొబ్బరి చెట్టుకు ఉన్న తేనెపట్టు నుంచి పెద్దఎత్తున ఈగలు ప్రసాద్‌పై దాడి చేయడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు పొలంలో ఉన్న విశాలమైన నేల బావిలో దూకేశాడు. బావిలో ఊబి, నాచు ఉండడంతో లోపల చిక్కుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పక్క పొలంలో ఉన్న అప్పికొండ నాగేశ్వరరావు(45)పైన కూడా తేనెటీగలు దాడి చేయడంతో ఆయన పరుగు తీస్తూ వాటి బారి నుంచి తప్పించుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సీ.ఐ ఈశ్వరరావు, ఎస్సై సురేశ్‌ సిబ్బందితో కలిసి ప్రదేశానికి చేరుకున్నారు. బావిలో దూకిన ప్రసాద్‌ను బయటకి తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. బావి సుమారు 25 నుంచి 30 అడుగుల లోతు ఉంటుందని, పుష్కలంగా నీరు ఉండటంతో గాలింపు కష్టతరంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. అనకాపల్లి నుంచి అగ్నిమాపక శకటంతో పాటు వ్యవసాయ పంపుసెట్లను తెప్పించి నీటిని బయటికి తోడుతున్నా నీరు ఊరడంతో ప్రసాద్‌ ఆచూకీ లభించలేదు. గేలాలు వేసి ప్రయత్నించగా ప్రసాద్‌కు చెందిన టవల్‌ దొరికిందని పోలీసులు తెలిపారు. ప్రసాద్‌కు భార్య నర్సయమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు త్రివేణి, వనజ ఉన్నారు.


ప్రసాద్‌ దూకిన బావిని పరిశీలిస్తున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని