సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 25/10/2021 03:58 IST

సంక్షిప్త వార్తలు

‘ఆసరా’డబ్బులుఎప్పుడిస్తారో!

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: డ్వాక్రా సంఘాల సభ్యులకు ఆసరా పథకం రెండో విడత నిధులు ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. కొంత మందికి బ్యాంకు ఖాతాలలో పడినా, రెండు, మూడు వారాల తరువాత డబ్బులు తీసుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు. ఇప్పటి వరకు 80 శాతం సభ్యుల ఖాతాల్లో నిధులు జమయ్యాయని, మిగతావారికి రెండు రోజుల్లో వస్తాయని మెప్మా డీఎంసీ నాగరాజు తెలిపారు. జీవీఎంసీలో మొత్తం 31 వేలకు పైగా డ్వాక్రా సంఘాలు ఉండగా, వాటిల్లో 3,40,890 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 22,285 సంఘాలు ఆసరా పథకానికి అర్హత సాధించాయి. వాటిలో ఉన్న 2,25,149 మంది సభ్యుల ఖాతాలో రూ.184.75కోట్ల నిధులు జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎంత నిధులొచ్చాయనే అంశంపై యూసీడీ అధికారుల వద్ద సమాచారం లేదు.


నవంబరు 2 న న్యాయవాదుల సంఘం ఎన్నిక

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలు నవంబరు 2న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కె.నరసింహమూర్తి ఆదివారం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 24న జరగాల్సిన ఎన్నికలు కరోనా తీవ్రత దృష్ట్యా వాయిదా పడిన విషయం తెలిసిందే. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదుల సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం జరిగిన సమావేశంలో ఎన్నికల అధికారి కె.నరసింహమూర్తి మాట్లాడుతూ గతంలో ఎన్నికలు నిలిపివేసిన స్థితి నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్‌ 22వ తేదీ నాటికి ఓటు అర్హత కలిగిన న్యాయవాదులు మాత్రమే ఓటు వేయవచ్చన్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ కార్యదర్శి, క్రీడా సాంస్కృతిక కార్యదర్శి స్థానాలతోపాటు ముగ్గురు సీనియర్‌, ఆరుగురు జూనియర్‌ కార్యనిర్వాహక సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. నవంబరు 2న జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరుగుతుందని, అదే రోజు రాత్రి ఫలితాలు ప్రకటిస్తామన్నారు.


ప్రత్యేక రైలు 10 గంటలు ఆలస్యం

జ్ఞానాపురం, న్యూస్‌టుడే: విశాఖపట్నం- ముంబయి లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ (08519) ప్రత్యేక రైలు 10 గంటలు ఆలస్యంగా నడుస్తోందని వాల్తేరు రైల్వే అధికారులు తెలిపారు. అనుసంధాన రైలు ఆలస్యంగా విశాఖ చేరుకోవడంతో 24వ తేదీ రాత్రి 11.20గంటలకు బయలుదేరాల్సిన రైలు 25వ తేదీ ఉదయం 9.35గంటలకు వెళ్లేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.


కొత్తగా 33 కొవిడ్‌ కేసులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 33 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ తెలిపారు. మొత్తం బాధితుల సంఖ్య 1,58,009కు చేరిందన్నారు. తాజాగా 47 మంది డిశ్ఛార్జి కాగా, ఇప్పటి వరకు 1,56,156 మంది కోలుకున్నారన్నారు. కొవిడ్‌తో అచ్యుతాపురానికి చెందిన 51 ఏళ్ల మహిళ మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 1095కు చేరిందన్నారు. ప్రస్తుతం 758 మంది కొవిడ్‌ ఆసుపత్రులు, ఇళ్లలో చికిత్స పొందుతున్నారని వివరించారు.


జిల్లా స్థాయి జానపద నృత్యం, నటన పోటీలకు ఆహ్వానం

భీమునిపట్నం, న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9 తరగతుల విద్యార్థులకు జనాభా విద్య ఇతివృత్తాలపై ఈనెల 27న భీమిలి డైట్‌లో జిల్లాస్థాయిలో జానపద నృతం(ఫోక్‌ డ్యాన్స్‌), పాత్రపోషణ(రోల్‌ప్లే) పోటీలు నిర్వహించేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. పాత్రపోషణకు నలుగురు, జానపద నృత్యానికి ఆరుగురిని అనుమతిస్తారు. రాష్ట్ర విద్య శిక్షణ పరిశోధన మండలి(ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి) ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోటీల్లో ప్రథమ విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతారు. ద్వితీయ, తృతీయ స్థానాలకు బహుమతులు ఇస్తారు. ఈ విషయమై డైట్‌ ప్రధానాచార్యులు యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ పాత్రపోషణకు ఎటువంటి కాస్ట్యూమ్స్‌ ధరించరాదన్నారు. జానపద నృత్యానికి అవసరమైన దుస్తులను సంబంధిత విద్యార్థులు తెచ్చుకోవాలన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఈనెల 27న ఉదయం 10 గంటలకు డైట్‌కు చేరుకోవాలన్నారు. మిగిలిన వివరాల కోసం 98859 41559, 98664 35934 నంబర్లకు ఫోనులో సంప్రదించాలని కోరారు.


ఇస్కాన్‌లో దామోదర మాసోత్సవాలు

సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: సాగర్‌నగర్‌ ఇస్కాన్‌ మందిరంలో దామోదర మాసోత్సవాలు ఆదివారం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తికమాసం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలు పేరిట వచ్చే నెల 19వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం నుంచి మంగళహారతి, తులసి హారతి, భగవద్గీత ప్రవచనం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని ఇస్కాన్‌ (విశాఖ) శాఖ అధ్యక్షుడు సాంబదాసు, మాతాజీ నితాయిసేవిని తెలిపారు. దీనిలో భాగంగా కేంద్రంలోని రాధాకృష్ణులు, సుభద్ర బలభద్ర, జగన్నాథుడు, సీతారాముల విగ్రహాలను ఆదివారం తెల్లవారుజామున దీపాలతోనూ మధ్యాహ్నం వివిధ రకాల పుష్పాలతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే రీతిలో విశేషంగా అలంకరించి భజనల నిర్వహణ, గీతాలాపన చేశారు.


కిక్‌ బాక్సింగ్‌ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. దండుబజార్‌ సామాజిక భవనంలో జరిగిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపకులు కిలాని సింగ్‌ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా కేజీహెచ్‌ ఉద్యోగి నీలాపు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షునిగా జి.కనకరాజు, కార్యదర్శిగా బుద్ధ నరేష్‌, సంయుక్త కార్యదర్శిగా సోము వీరయ్య, కోశాధికారిగా ఎ.త్రినాథ్‌, సంయుక్త కోశాధికారిగా శ్యామ్‌సన్‌, టెక్నికల్‌ డైరెక్టర్లుగా జి.రాజేష్‌, రాజశేఖర్‌, జానకీరామ్‌, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రామ్‌దేవప్రసాద్‌, సంతోష్‌, కేజేఆర్‌ యాదవ్‌, కె.మధుసూదనరావు, సలహాదారులుగా కాళ్ల అప్పారావు, కిలాని సింగ్‌ ఎన్నికయ్యారు.


ఏపీ ఎన్జీఓ సంఘం...

సీతంపేట: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వేతర సంస్థల (ఏపీ ఎన్జీఓ) నూతన కార్యవర్గం ఎంపిక ఆదివారం ద్వారకానగర్‌ విశాఖ పౌరగ్రంథాలయంలో జరిగింది. అసోసియేషన్‌ గౌరవాధ్యక్షునిగా నగరానికి చెందిన నరవ ప్రకాశరావు ఎన్నికయ్యారు. అధ్యక్షునిగా ఎమ్‌.నాగిరెడ్డి(ప్రకాశం జిల్లా), కార్యదర్శిగా పి.కె.ప్రకాష్‌(విజయనగరం), ఉపాధ్యక్షులు కె.గ్రేష్‌(విశాఖపట్నం), షేక్‌ షమీరా(కడప), శ్రీనివాస చౌదరి(శ్రీకాకుళం), కోశాధికారిగా జల్లూరి సువర్ణకుమారి(నెల్లూరు) సంయుక్త కార్యదర్శులుగా మమ్ముల తిరుపతిరావు(విజయనగరం), దివానపు వెంకటేశ్వర్లు (కృష్ణా), ఎం.మధుసూదనరావు( నెల్లూరు), సహాయ కార్యదర్శులుగా ఎం.ఎస్‌.శ్రీనివాసరావు(విజయనగరం), ఈశ్వరి(అరకు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


నేడు కమిషనర్‌ లక్ష్మిశ బాధ్యతల స్వీకరణ

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌గా డాక్టర్‌ జి.లక్ష్మిశ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కమిషనర్‌ సృజన.. పరిశ్రమలశాఖ సంచాలకులుగా బదిలీ కావడంతో రిలీవ్‌ కానున్నారు. సృజన స్థానంలో తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ లక్ష్మిశ బాధ్యతలు తీసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కమిషనర్‌ (పరిపాలన) ఏవీ రమణి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని