సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 27/10/2021 01:46 IST

సంక్షిప్త వార్తలు

జరిమానా వేసింది 5 కోట్లు.. తగ్గించింది 25 లక్షలకు!

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రోలుగుంట మండలం కుంచుగుమ్మలలోని ఓ రాతి క్వారీలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని విజిలెన్స్‌ అధికారులు భారీ మొత్తంలో జరిమానా వేశారు. అయితే.. అంతగా మేం అక్రమాలకు పాల్పడలేదు.. మా జరిమానా తగ్గించండని క్వారీ నిర్వాహకులు అప్పిలేటు అధికారులకు దరఖాస్తు చేయడంతో వారు కరిగిపోయారు. ఎంతలా అంటే రూ.5 కోట్ల అపరాధ రుసుంను రూ.25 లక్షలకే సరిపెట్టేశారు. గతేడాది విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌ రెడ్డి జిల్లాలో తొలిసారిగా నర్సీపట్నం సమీపంలో ఉన్న ఓ స్టోన్‌ క్రషర్‌పై దాడిచేసి అక్రమ మైనింగ్‌ గుర్తించారు. లీజు లేని ప్రాంతంలో కూడా తవ్వకాలు చేశారని తేల్చారు. నిబంధనల మేరకు సాధారణ సీనరేజి రుసుం కంటే అయిదు రెట్లు కలిపి రూ. 5.68 కోట్లు అపరాధ రుసుంగా విధించి నిర్వాహకులకు నోటీసులు పంపించారు. తాము నిబంధనల మేరకే తవ్వకాలు చేశామని అప్పిలేట్‌ అధికారులను ఆశ్రయించారు. ఉన్నతాధికారులు ఈ కేసుకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించి రూ.25 లక్షలు జరిమానాగా చెల్లించి మైనింగ్‌ చేసుకోవడానికి అనుమతిచ్చినట్లు తెలిసింది. నిర్వాహకులు వెంటనే చెల్లించి క్వారీయింగ్‌ చేసుకుంటున్నారు.


డీలర్ల నిరసన.. రేషన్‌ సరఫరాకు ఆటంకం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలని రేషను డీలర్లు మంగళవారం నుంచి ఆందోళనకు దిగడంతో రేషన్‌ సరకుల సరఫరా నిలిచిపోయింది. పౌరసరఫరాల సంస్థకు చెందిన గోదాములు 30 వరకు ఉన్నాయి. ప్రధాన గోదాముల నుంచి మండల స్టాకు పాయింట్ల (ఎంఎల్‌ఎస్‌)కు బియ్యం వస్తున్నా.. అక్కడి నుంచి డిపోలకు సరఫరా నిలిచిపోయింది. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. డిపోలకు వెళ్లే సరకుల వాహనాలను డీలర్లు అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగడం వల్ల దాదాపు 600 టన్నుల బియ్యం సరఫరా నిలిచిపోయింది. జిల్లాలో దాదాపు 12లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. ఆయా కార్డులకు నెలకు 18వేల టన్నుల బియ్యం అవసరం. ప్రతి నెలా 26వ తేదీ నుంచి డిపోలకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి సరకులు చేరవేస్తారు. రోజుకు 1500 టన్నుల వరకు ఈ రకంగా పంపుతారు. జిల్లాలో 828 ఎండీయూ (మల్టీ డిస్పెన్సబుల్‌ యూనిట్లు) వాహనాల పరిధిలో 2,100కుపైగా రేషను డిపోలున్నాయి. 30వ తేదీ నాటికి 828 డిపోలకు బియ్యం చేర్చగలిస్తే ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీ ప్రారంభం అవుతుంది.


ఉద్యోగులు నిరసన తెలిపితే చర్యలు

పాడేరు, న్యూస్‌టుడే: సీసీఏ నిబంధనల ప్రకారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ధర్నాల్లో పాల్గొనకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో ఇటీవల ఉద్యోగులు పాల్గొనడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు, మండల, జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మంగళవారం మెమోలు జారీ చేశారు. విద్యాశాఖ వెబ్‌సైట్‌లో గిరిజన తెగల తొలగింపునకు వ్యతిరేకంగా గిరిజన సంఘాలు ఈ నెల 22వ తేదీన చేపట్టిన నిరసనలో పలువురు మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారికి ఇప్పటికే ఏజెన్సీ డీఈవో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న జేఏసీ పిలుపు మేరకు మరో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నిరసనలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని సూచిస్తూ ఏటీడబ్ల్యూవోలు, ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్య, అత్యవసర అవసరాలకు మాత్రమే ఈ నెల 27న సెలవులు మంజూరు చేయాలని, సాధారణ సెలవులు రద్దు చేయాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీసీఏ రూల్స్‌ అతిక్రమించరాదని ఏటీడబ్ల్యూవోలు, హెచ్‌ఎంలకు నోటీసులు పంపినట్లు గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.


నూకాలమ్మ సన్నిధిలో లా సెక్రటరీ

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి నూకాలమ్మను మంగళవారం లా సెక్రటరీ (అమరావతి) వి.సునీత దంపతులు దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో బుద్ద నగేష్‌ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఆలయంలోని హుండీలను తెరచి బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కిస్తామని ఈవో నగేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


ధాన్యం సేకరణకు 155 కేంద్రాలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణ, కొనుగోలుకు జిల్లావ్యాప్తంగా 155 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం తన ఛాంబరులో పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జేసీ మాట్లాడుతూ వెలుగు ద్వారా 48, గిరిజన ప్రాంతాల్లో 43, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 64 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఎలక్ట్రానిక్‌ తూకపు యంత్రాలు, టార్పాలిన్లు సమకూర్చుకోవాలన్నారు. సమావేశంలో పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖాధికారులు, ఆర్డీఓలు, మార్క్‌ఫెడ్‌, ఎఫ్‌సీఐ, డీసీసీబీ, సీఎస్‌సీ, డీఆర్‌డీఏ, ఐటీడీఏ తదితర సంస్థల అధికారులు పాల్గొన్నారు.


29న రుణ మేళా

విశాఖపట్నం: జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకుల సమన్వయంతో ఈనెల 29న నగరంలో రుణ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మార్గదర్శకాలను అనుసరించి రామాటాకీసు దరి అంబేడ్కర్‌ కల్యాణ మండపంలో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  


10న ‘మీ వద్దకే పీఎఫ్‌’

విశాఖపట్నం: భవిష్యనిధి ఖాతాదారులు, పింఛనుదారులు, పీఎఫ్‌ సంస్థల యజమానులకు సంబంధించిన సమస్యలపై నవంబరు 10న ‘మీ వద్దకే పీఎఫ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు భవిష్యనిధి కార్యాలయ సహాయ కమిషనర్‌   కె.వీర మణికాంత్‌ తెలిపారు. మర్రిపాలెం ప్రాంతీయ కార్యాలయంలో ఆరోజు ఉదయం  10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఆయా సమస్యలను వివరిస్తూ తయారు చేసిన పోస్ట్‌ కవర్‌పై ‘నిధి ఆప్కే నికత్‌’ అని రాసి, నవంబరు 5వ తేదీలోపు విశాఖపట్నం ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయం, మర్రిపాలెం చిరునామాకు పంపాలన్నారు.  ఫ్యాక్స్‌ (0891-2558734), మెయిల్‌ ‌vizag@epfindia.gov.inz చేయవచ్చన్నారు.


ఉపరాష్ట్రపతి రాక 2న

విశాఖపట్నం, న్యూస్‌టుడే: భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పర్యటన వాయిదా పడింది. నవంబరు 2న ఆయన విశాఖ రానున్నారు. ఆ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకుంటారు. 6వ తేదీ వరకు నగరంలోనే ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.


యువతిని మోసగించిన యువకుడిపై కేసు

అనకాపల్లి పట్టణం: యువతిని మోసగించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు అనకాపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐ ఎల్‌.భాస్కరరావు తెలిపారు. బుచ్చెయ్యపేటకు చెందిన బుల్లిబాబు తనను ప్రేమించి, పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని విజయరామరాజుపేటకు చెందిన యువతి మంగళవారం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.


ఐక్యతతోనే బీసీ కులాలకు రాజ్యాధికారం

విశాఖపట్నం న్యూస్‌టుడే: వెనుకబడిన కులాలు ఐక్యతతో ముందుకు సాగడం ద్వారా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవచ్చునని ఏపీ బి.సి. కులాల సమాఖ్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో మంగళవారం సాయంత్రం సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పెబ్బలి రవికుమార్‌, ప్రధాన కార్యదర్శిగా దేవరగుప్త రమేష్‌, అధికార ప్రతినిధిగా ఎం.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌తో పాటు కార్యవర్గాన్ని సంఘ గౌరవ అధ్యక్షులు తుమ్మిడి రామ్‌కుమార్‌ ప్రకటించారు. పొన్నాడ మోహనరావు, చిత్రాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


శతాధిక వృద్ధురాలి మృతి

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు మేజర్‌ పంచాయతీ పాతపాడేరు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు గంగమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలి వద్ద చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే ఈమె రెండు రోజుల కిందట అనారోగ్యానికి గురైంది. పరిస్థితి విషమించడంతో మంగళవారం ప్రాణాలు విడిచినట్లు గంగమ్మ కుమార్తె వరలక్ష్మి పేర్కొన్నారు.


108లో ప్రసవం

కశింకోట, న్యూస్‌టుడే: 108 వాహనంలో ఓ  మహిళ మంగళవారం ప్రసవించింది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పిసినికాడకు చెందిన ఎస్‌.ధనలక్ష్మి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరారు. కాన్సు కష్టంగా ఉండటంతో 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా పోర్టు రోడ్డులో ఆమెకు నొప్పులు ఎక్కువై మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు అత్యవసర విభాగం వైద్య సహాయకులు   అప్పలనాయుడు,  రామకృష్ణ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని