ఐటీలో అందొచ్చిన అవకాశాలు
eenadu telugu news
Published : 27/10/2021 02:17 IST

ఐటీలో అందొచ్చిన అవకాశాలు

కొవిడ్‌ సమయంలోనూ 11,600 మందికి కొలువులు ‌

విశాఖలోనే 8 వేలు

ఈనాడు, విశాఖపట్నం: కొవిడ్‌ సమయంలోనూ పలువురికి ఐ.టి.రంగం కొత్త ఉద్యోగాలు కల్పించగలిగింది. కొవిడ్‌ మహమ్మారి కొన్ని సంస్థలపై తీవ్ర ప్రభావం చూపగా కొన్ని సంస్థలపై అధిక పనిభారం మోపింది. దీంతో ఐ.టి. నిపుణుల అవసరం పెరిగి కొన్ని సంస్థలు కొత్త ఉద్యోగాలు సైతం ఇవ్వగలిగాయి. ఇటీవలే ఏపీ ఐటీ సంఘం (ఐటాప్‌) ప్రతినిధులు నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో 11,600 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు తేలింది. వాటిలో సుమారు 8 వేల ఉద్యోగాలు విశాఖలోని సంస్థలే ఇచ్చాయి. కొవిడ్‌ అనంతరం ఆరోగ్య, బీమా రంగాల అవసరాలు గణనీయంగా పెరిగాయి. ఇంట్లోంచి వెళ్లాల్సిన అవసరాన్ని సాధ్యమైనంత తగ్గించి ఆన్‌లైన్‌ విధానాల్లోనే సేవలు పొందాలనుకునే వారి శాతం పెరిగింది. ఆయా సంస్థలకు సేవలు అందిస్తున్న ఐటీ సంస్థలకు డిమాండ్‌ పెరిగింది. పలు బీపీఓ (బిజినెస్‌ ప్రోసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌), కేపీఓ (నాలెడ్జ్‌ ప్రోసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌) సంస్థలకు కొత్త ఆర్డర్లు వచ్చాయి.
తొలుత తీవ్ర ఇబ్బందులు: గత సంవత్సరం కొవిడ్‌ తరువాత పలు సంస్థలు ఇబ్బందులు పడ్డాయి. అత్యధిక సంస్థలు ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వర్తించే వెసులుబాటు కల్పించాయి. వారు ఆ విధంగా సేవలందించడానికి వీలుగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాయి. ఆ ప్రయోగం విజయవంతం అవడంతో ఐ.టి. కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలగలేదు. తీవ్రమైన సంక్షోభ సమయంలోనూ సమర్థంగా విధులు నిర్వర్తించే మానవ వనరులు అందుబాటులో ఉండడంతో  అదనపు ఆర్డర్లనూ విశాఖలోని సంస్థలు చేజిక్కించుకోగలిగాయి.
హైబ్రిడ్‌ విధానం కలిసొచ్చింది: కొవిడ్‌ సమయంలో పలువురు ఐ.టి. ఉద్యోగులు కూడా కొవిడ్‌ బారినపడ్డారు. వారు ఇంటి దగ్గర నుంచే విధులు నిర్వర్తించడంతో వారి కారణంగా ఆయా సంస్థల్లోని మిగిలిన వారికి వైరస్‌ వ్యాపించలేదు. ఫలితంగా నగరంలోని అత్యధిక సంస్థలు ఎలాంటి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోకుండా వాటి కార్యకలాపాల్ని కొనసాగించగలిగాయి. కొవిడ్‌ తగ్గిన తరువాత కూడా ఐ.టి. సంస్థలు ‘హైబ్రిడ్‌ విధానం’ పేరుతో కొందరు ఇంటి నుంచి, కొందరు కార్యాలయం నుంచి పనిచేసేలా ఏర్పాట్లు చేశాయి. ఇప్పుడిప్పుడే పలు సంస్థలు పూర్తిస్థాయిలో కార్యాలయం నుంచే విధులు నిర్వర్తించేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని