ప్రైవేటులో నిషేధం.. ఆర్బీకేల్లో అదృశ్యం
eenadu telugu news
Published : 27/10/2021 02:17 IST

ప్రైవేటులో నిషేధం.. ఆర్బీకేల్లో అదృశ్యం

ఎరువుల కోసం అన్నదాతల పరుగులు
అచ్యుతాపురం, న్యూస్‌టుడే

కొండకర్లలో సాగులో ఉన్న వరి పొలాలు

అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అని కొన్ని సందర్భాల్లో పెద్దలు విసుక్కుంటుంటారు. ప్రస్తుతం ఎరువుల కొరత చూస్తుంటే అన్నదాతలకు ఇదే గుర్తొస్తుంది. గతంలో పొటాష్‌, యూరియా వంటి ఎరువులు ప్రైవేటు దుకాణాలు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు, పీఏసీఎస్‌ల్లోనూ విక్రయించేవారు. దీంతో రైతులకు కొంత అదనపు డబ్బులు చెల్లించైనా అవసరమైన ఎరువులు కొనుగోలు చేసుకునేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ఏర్పాటు చేసిన 627 రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారానే వీటికి విక్రయిస్తామని ప్రచారం చేశారు. ప్రైవేటులో వీటి విక్రయాన్ని పూర్తిగా అడ్డుకున్నారు. రైతు భరోసా కేంద్రాల చుట్టూ రైతులు తిరుగుతున్నా పొటాష్‌ అందించే పరిస్థితులు కనిపించడం లేదు.
జిల్లాలో ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా వరినాట్లు వేశారు. వాతావరణ పరిస్థితులన్నీ కలిసి రావడంతో వరి పొట్టదశకు వచ్చింది. మరో రెండు నెలలు ఇవే పరిస్థితులు కొనసాగితే పంట చేతికి వస్తుందని సగటు రైతులు అశల్లో ఉన్నారు. ఇటువంటి కీలక దశలో వరికి కావాల్సిన ఎరువులు అందక వీరంతా ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, ఎలమంచిలి, పాయకరావుపేట, మాడుగుల నియోజకవర్గాలతోపాటు గిరిజన ప్రాంతాల్లోనూ ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో నాట్లు వేసిన 96,480 ఎకరాల్లో చాలా వరకు పొట్టదశకు వచ్చాయి. అంతా అనుకూలంగా ఉందని రైతులు ఆనందపడుతున్న సమయంలో రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. రైతు భరోసా కేంద్రాల్లో దొరకడం లేదు. ముఖ్యంగా పొటాష్‌ కోసం రైతులు పరుగులు తీయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొటాష్‌, యూరియా అందివ్వాలని సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వద్ద రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  
ప్రభుత్వానికి నివేదిక అందించామని, త్వరలో ఎరువులు అందిస్తామని చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అచ్యుతాపురం మండలంలో 24 ఆర్‌బీకేలు ఉండగా వీటి పరిధిలో ఉండే వరి రైతులకు నెల రోజుల నుంచి పొటాష్‌, యూరియా ఇవ్వడం లేదు. మునగపాక, తిమ్మరాజుపేట సచివాలయం వద్ద ఇప్పటికే రైతులు ఆందోళన నిర్వహించారు.

నెల్లాళ్లుగా తిరుగుతున్నా..
సొంతంగా సెంటు భూమి లేదు. రెండు ఎకరాల కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. వరి పొట్ట దశకు వచ్చిన సమయంలో అవసరమైన ఎరువుల కోసం నెల రోజులుగా రైతు భరోసా కేంద్రం, సచివాలయం చుట్టూ తిరుగుతున్నా. వచ్చే వారం అంటూ చెబుతున్నారు తప్ప వీటిని ఇవ్వడంలేదు. ఇలా అయితే పంట చేతికిరాక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవడం తప్ప రైతులకు మరో మార్గం లేదు.

- పోలార్పు నాగరాజు, రైతు, తిమ్మరాజుపేట

అంతా బాగుంది అనుకుంటే..
వ్యవసాయంపై ఉన్న ఆసక్తితో మొదటిసారి ఎకరా భూమిలో వరి సాగు చేస్తున్నా. అంతా బాగుంది అనుకున్న సమయంలో పొటాష్‌, యూరియా ఎరువులు లభించడంలేదు. ఎరువులు వేయకపోతే దిగుబడి తగ్గిపోవడంతోపాటు తెగుళ్లు వ్యాపిస్తాయని సహ రైతులు చెబుతుంటే భయమేస్తోంది.

- జ్యోత్స్న, మహిళా రైతు, తిమ్మరాజుపేట

ఎరువుల నిల్వలు ఉన్నాయి
జిల్లాలో ఖరీఫ్‌కు రైతులకు అవసరమైన పొటాష్‌, యూరియా అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో పొటాష్‌ 551 మెట్రిక్‌ టన్నులు ఉండగా ఇప్పటివరకు 176 మెట్రిక్‌ టన్నులు విక్రయించాం. ఎక్కడైనా ఎరువుల కొరత ఉన్నట్లు తెలిస్తే వెంటనే అందించడానికి చర్యలు తీసుకుంటాం. రైతు భరోసా కేంద్రంలోనూ రైతులకు అవసరమైన ఎరువులను ప్రభుత్వం అందిస్తుంది.

- లీలావతి, జేడీ, వ్యవసాయ శాఖ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని