అయ్యో ‘పాపం’.. వైద్యమందే దారేది?
eenadu telugu news
Updated : 27/10/2021 12:07 IST

అయ్యో ‘పాపం’.. వైద్యమందే దారేది?

 బిడ్డకు జన్మనిచ్చి బాలింత మృతి
 తల్లిని కోల్పోయిన నలుగురు బిడ్డలు
చింతపల్లి/ గ్రామీణం, న్యూస్‌టుడే

తల్లిని కళ్లారా చూసే అదృష్టమేది

అమ్మ పొత్తిళ్లలో హాయిగా ఉండాల్సిన ఆ నవజాత శిశువుకు మన్యంలోని దుర్భర పరిస్థితులు తల్లిని దూరం చేశాయి. పండంటి బిడ్డకు జన్మనిచ్చి, సకాలంలో వైద్యం అందక బాలింత మృతి చెందిన హృదయవిదారక సంఘటన మన్యంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీలోని వెదురుపల్లి గ్రామానికి చెందిన గెమ్మెలి బాబూరావు భార్య దివ్య (27) నిండు గర్భిణి. లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వెదురుపల్లి గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. కొండమార్గంలో కాలిబాటే శరణ్యం. దివ్య నాలుగో సారి గర్భం దాల్చింది. ఈమెకు అంతకు ముందు ఇద్దరు అబ్బాయిలు, ఒక పాప సంతానం. నిండు గర్భిణిగా ఉన్న ఈమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్సుకు సమాచారం ఇద్దామన్నా రహదారి లేని పరిస్థితి అని కుటుంబసభ్యులు మిన్నకున్నారు. ఇంతలో పురిటినొప్పులు అధికమవడంతో మంగళవారం ఇంట్లోనే ప్రసవించింది. పాపకు జన్మనిచ్చింది. కొద్దిసేపటికే ఈమె అస్వస్థతకు గురై మరణించింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శిశువు కళ్లు తెరవకముందే కన్నతల్లి దూరమవడంతో ఆ చిన్నారిని చూసి అంతా కన్నీరుమున్నీరవుతున్నారు. దివ్య మృతికి రక్తహీనతతోపాటు ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడమే కారణమని లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రామ్‌నాయక్‌ తెలిపారు. ఈమె నాలుగోసారి గర్భం దాల్చడంతో రక్తహీనతతో బాధపడుతోందని చెప్పారు.
* ఈ ఏడాది జులై 4న జి.మాడుగుల మండలం గెమ్మలిబారు గ్రామానికి చెందిన పాంగి జానకిని ప్రసవం కోసం తరలిస్తున్న క్రమంలో తల్లీబిడ్డా చనిపోయారు. ఈ గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడంతో డోలీలో మోసుకుంటూ వచ్చే క్రమంలో దారిలోనే మగబిడ్డను ప్రసవించింది. కాసేపటికే ఇద్దరూ మృత్యుఒడికి చేరిపోవడం కుటుంబ సభ్యులనే కాదు స్థానికులందరినీ కలచివేసింది.
* రెండు నెలల క్రితం ముంచంగిపుట్టు మండలం బూసిపట్టు నుంచి రహదారి సదుపాయం లేకపోవడంతో గర్భిణిని కష్టం మీద కొంత దూరం నడిపించారు. తరువాత ఓ ప్రైవేటు అంబులెన్స్‌ ఎక్కించగా కొంత దూరం వెళ్లాక బురదలో ఆ వాహనం టైరు కూరుకుపోయి కదల్లేదు. అటుగా వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడు మోటారుసైకిల్‌పై ఆ గర్భిణిని ఆసుపత్రికి తరలించగా ప్రసవనంతరం బిడ్డ చనిపోయింది.
* రెండేళ్ల క్రితం పాడేరు మండలం సంపాలు నుంచి గర్భిణిని ఆసుపత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలోనే బిడ్డను ప్రసవించగా పుట్టిన బిడ్డ అక్కడే ప్రాణాలొదిలేసింది.


ఆపదలో మాతాశిశు ఆరోగ్యం
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

మృతురాలు దివ్య (పాత చిత్రం)

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మన్యంలో చాలా గ్రామాలకు ఇంకా రహదారి సదుపాయాలే లేవు. మావోయిస్టు బూచి, నిధుల కొరత కారణాలను చూపించి మారుమూల గ్రామాలకు నడక దారి కూడా లేకుండా చేశారు. ఫలితంగా గిరిజనులకు విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ముఖ్యంగా కాబోయే అమ్మలకు కష్టాలు, కన్నీళ్లు నిత్యకృత్యంగా మారాయి. అత్యవసర వైద్యం కోసం డోలిమోతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. వాగులు, వంకలు, గెడ్డలు, కొండలు దాటి ఆసుపత్రికి తీసుకువచ్చేలోగానే తల్లీబిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి మరణాలను తగ్గించేందుకు సర్కారు గర్భిణుల వసతిగృహాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నా అవగాహనా లేమితో వాటిని వినియోగించుకోలేకపోతున్నారు.
రాష్ట్రంలో విశాఖ జిల్లాలోనే మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. దీనికి రక్తహీనత కొంత కారణమైతే.. మన్యంలో రహదారి సమస్యలు కారణమవుతున్నాయి. అప్పటికీ తెదేపా ప్రభుత్వం బైక్‌ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. అయినా కొన్ని గ్రామాల్లోకి ఈ వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి. వర్షాలు వస్తే ఇక బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే గిరి గ్రామాలెన్నో ఉన్నాయి. ఆయా గ్రామాలకు వైద్య సేవలు అందించడమంటే సాహసంతో కూడుకున్న పనేనని వైద్యారోగ్య సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులున్నాయనే గర్భిణుల విషయంలో ప్రసవానికి వారం ముందుగానే అరకులోయలో ఏర్పాటు చేసిన గర్భిణుల వసతిగృహాల్లో చేరాలని కోరుతున్నారు. అయితే సిబ్బంది ఎంత చెప్పినా ఈ వసతిగృహ సేవలను వినియోగించుకోవడానికి కొద్దిమందే ముందుకొస్తున్నారు. వచ్చినవారు కూడా చెప్పాపెట్టకుండా వారి గ్రామాలకు వెళ్లిపోతున్నారని సిబ్బంది చెబుతున్నారు. చింతపల్లిలో కూడా మరో గర్భిణి విశ్రాంతి గృహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని త్వరలోనే వినియోగంలోకి తేనున్నారు.

 ఇళ్లలో ప్రసవాలు..
ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకునేవారికి జననీ సురక్షా, మాతృత్వ వందన తదితర పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నారు. అయినా ఇళ్లల్లో కాన్పులు ఇంకా జరుగుతున్నాయి. గత నాలుగు నెలల్లో 279 ప్రసవాలు ఇళ్లల్లోలోనే జరిగాయి. ఈ క్రమంలో రెండు చోట్ల మాతృమరణాలు చోటుచేసుకున్నాయి. చింతపల్లి ఘటనలో మాతృ మారణానికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని అదనపు జిల్లా వైద్యాధికారి డా.లీలాప్రసాద్‌ను ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశించారు.
మాతాశిశు మరణాలు ఇలా..
జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 24,561 ప్రసవాలు జరిగాయి. అందులో 67 మంది తల్లులు వివిధ కారణాలతో మరణించారు. అలాగే ఏడాది లోపు చిన్నారులు 269 మంది చనిపోయారు. రక్తహీనత, ఇతర వ్యాధుల వల్లే మరణాలు చోటుచేసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కొవిడ్‌ కారణంగా ఏప్రిల్‌, మే, జూన్‌ల్లో ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నాయి. తరువాత కొంతమేర తగ్గాయంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని