సంతకం చేస్తే.. అంగీకరించినట్టే!!
eenadu telugu news
Updated : 27/10/2021 06:13 IST

సంతకం చేస్తే.. అంగీకరించినట్టే!!

 అందుకే తల్లిదండ్రుల ఆందోళన
 ‘ఎయిడెడ్‌’ రగడతో వెంటనే మారిన నిర్ణయాలు

‘ఎయిడెడ్‌’ పాఠశాలల భవిష్యత్తుపై రేగిన రగడ ప్రభుత్వ వర్గాలను విస్మయపరిచింది. రాష్ట్రంలో తొలిసారి విశాఖలో ప్రతిఘటన తీవ్రస్థాయిలో ఎదురవడంతో వెంటనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సోమవారం జ్ఞానాపురంలోని సేక్రెడ్‌ హార్ట్‌ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు, తల్లిదండ్రులు భారీ స్థాయిలో రాస్తారోకో చేయడంతో మంగళవారం విద్యాశాఖాధికారులు కొన్ని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అయితే అవన్నీ రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఉంటాయని చెబుతుండటం గమనార్హం. సేక్రెడ్‌ హార్ట్‌ పాఠశాల ప్రాంగణంలోనే  నడుస్తున్న ఆర్‌సీ ఎయిడెడ్‌ ప్రాథమిక, ఆర్‌సీఎం కేథడ్రల్‌ ఎయిడెడ్‌ ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థినుల నుంచి ఎందుకంత ఆగ్రహం వ్యక్తం అయిందనే అంశాన్ని పలువురు ఆరా తీయగా...అప్పటికే ‘ఎయిడెడ్‌’ నుంచి తప్పుకుంటామని యాజమాన్యం తెలిపిన నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సంతకాలు తీసుకోవాలని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ఎప్పుడైతే తల్లిదండ్రులకు అంగీకార లేఖలు ఇచ్చి సంతకాలు చేయమన్నారో...ఆ క్షణమే వారిలో ఆందోళన రేగింది. అందులో ఉన్న సారాంశమూ కలకలం రేపింది.

లేఖలో ఏముందంటే...

విశ్వసనీయ సమాచారం మేరకు అంగీకార లేఖల్లో ఏముందంటే..‘మా అబ్బాయి/ అమ్మాయి మీ పాఠశాలలో------ తరగతి చదువుతున్నాడు/చదువుచున్నది.. ప్రభుత్వ నిర్ణయం మేరకు అంగీకారం(విల్లింగ్‌) ఇచ్చిన ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా------ మండల విద్యాశాఖాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు మా అబ్బాయి/ అమ్మాయిని సమీపంలోగల------ పాఠశాలలో చేరుస్తామని చెప్పారు. అందుకు మేము అంగీకరించి మా సమ్మతిని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం/ కానీ, మేము మా ఇష్ట ప్రకారం మా అబ్బాయి/ అమ్మాయిని మాకు ఇష్టమైన పాఠశాలలో చేర్చుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేయుచున్నాము.

* ఈ తరహాలో ఉన్న అంగీకార లేఖలను విద్యార్థినులు తల్లిదండ్రులకు ఇచ్చేందుకు సిద్ధమవ్వగా వాటిని తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపలేదు. కొందరు తీసుకున్నా తిరిగి ఇవ్వలేదు.

అంతకు ముందు ఏం జరిగిందంటే...

* ఈ నెల 21న: ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై  జిల్లా విద్యాశాఖాధికారి ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి.. తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాలని వివరించారు.

* 23న: విద్యార్థినులు తమ తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకురావాలని యాజమాన్యం సూచించింది.

* 24న: ఆదివారం సెలవు

* 25న: పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులకు ‘ఎయిడెడ్‌’ విధానంలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు...పాఠశాల తీసుకున్న నిర్ణయం వివరించారు.

* ఆ తరువాత: వచ్చిన వారిలో ఆందోళన రేగింది. పాఠశాల ఎయిడెడ్‌గానే కొనసాగించాలని రాస్తారోకోకు దిగారు. కొత్త విధానంలో అయితే పాఠశాలను మూసేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. - సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం చోటుచేసుకున్న పరిణామాలతో అధికారులు పలు సూచనలు చేశారు. ఆ మేరకు  విద్యాశాఖకు యాజమాన్యం లేఖ రాసింది.

* యాజమాన్యం ఇచ్చిన తాజా లేఖలో ఏముందంటే: ‘ఈ నెల 21న జిల్లా విద్యాశాఖాధికారి ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఎయిడెడ్‌ పాఠశాలల స్వాధీనంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాలు (విల్లింగ్‌ లెటర్స్‌) తీసుకోమన్నారు. దీంతో ఈ నెల 25న వారితో సమావేశం ఏర్పాటు చేశాం. ఆ రోజు పాఠశాలకు చెందిన తల్లిదండ్రులు మాకు అంగీకార పత్రాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. పిల్లల చదువులు ఏంకావాలన్న ఆందోళన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాఠశాల ప్రాంగణం, రహదారులపై నిరసన తెలిపారు. ఎయిడెడ్‌ ఉద్యోగులను ఉంచి అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనం పథకాలను కొనసాగిస్తే విద్యార్థులను పాఠశాలల్లో ఉంచేందుకు యాజమాన్యానికి ఎటువంటి అభ్యంతరం లేదు. తల్లిదండ్రుల ఆందోళన, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని గతంలోలాగే ఎయిడెడ్‌ పాఠశాలగా కొనసాగించాలి. పాఠశాలల విలీన ప్రక్రియలో భాగంగా మా విద్యాసంస్థల నుంచి ఎవరికీ టీసీలు ఇవ్వలేదు. ఏ ఒక్క విద్యార్థి తాము వెళ్లిపోతామంటూ టీసీ అడగలేదు’ అని సేక్రెడ్‌హార్ట్‌ యాజమాన్య ప్రతినిధులు లేఖలో పేర్కొన్నారు.

* పూర్వ విద్యార్థుల ఆరా: జ్ఞానాపురంలోని సేక్రెడ్‌ హార్ట్‌ బాలికోన్నత పాఠశాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ ఎంతో మంది చదువుకున్నారు. కొన్ని వేలమంది దేశ,విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. తాజా పరిణామాలపై విదేశాల్లో ఉన్న పూర్వవిద్యార్థులు సైతం ఇక్కడి వారికి ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు.

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, జ్ఞానాపురం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని