ముగిసిన మండల ప్రాదేశిక ఘట్టం
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

ముగిసిన మండల ప్రాదేశిక ఘట్టం


బొండపల్లి మండల పరిషత్తు కార్యాలయంలో వివరాలు
చదువుతున్న రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్‌ దండే

ఈనాడు-విజయనగరం: మండలాధీశులు ఎవరో తెలిసింది. శిబిర రాజకీయాలు, బేరసారాలు, మంతనాలు, కప్పదాట్లతో శుక్రవారం హడావుడి నెలకొంది. అధికార పార్టీలో కొన్నిచోట్ల విభేదాలు బయటపడ్డాయి. జిల్లావ్యాప్తంగా ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఉదయం 10 గంటలకు కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ఎంపీపీ అభ్యర్థుల నుంచి అధికారులు బీఫారాలను తీసుకున్నారు. ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి.. మధ్యాహ్నం 3 గంటలకు మండల పరిషత్తు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహించారు. 34 మండలాలకు 33 చోట్ల ఎన్నికలు జరగ్గా.. కొత్తవలసలో వాయిదా పడింది. 

* రామభద్రపురం మండలంలో 14 స్థానాలకు 13 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఇందులో తెదేపా ఆరు, వైకాపా ఆరు స్థానాల్లో గెలుపొందింది. ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించగా.. ఇందులో ఒకరు తెదేపా రెబల్, ఇద్దరు రెబల్స్‌ ఉన్నారు. లెక్కింపు పూర్తయిన నాటి నుంచి రెండు పార్టీలు క్యాంపు రాజకీయాలు నెరపుతున్నాయి. కొండకెంగువకు చెందిన తెదేపా రెబల్‌ అభ్యర్థి బెల్లాన ప్రసాదరావు గురువారం మధ్యాహ్నం వరకు ఆ పార్టీ శిబిరంలోనే ఉన్నారు. తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. శుక్రవారం ఉదయం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ వైకాపాకు చెందిన ఎంపీటీసీ సభ్యులతో పాటు ప్రసాదరావును కూడా తన వాహనంలో తీసుకొచ్చారు. వైకాపాకు చెందిన చొక్కాపు లక్ష్మణరావును ఎంపీపీగా, బెల్లాన ప్రసాదరావును ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 

* చీపురుపల్లిలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గం కావడంతో ఎంపీపీ ఎన్నిక సులువేనని అంతా భావించారు. ఇక్కడ 18 స్థానాలకు గానూ 16 చోట్ల వైకాపా విజయం సాధించినా ఎన్నిక మాత్రం ఉత్కంఠను రేపింది. గురువారం రాత్రి వరకు అంతా సజావుగానే కనిపించినా.. శుక్రవారం ఉదయమయ్యే సరికి సీను మొత్తం మారిపోయింది. ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ ఇంట్లో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. వారంతా మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నారు. ముందుగా అనుకున్న వ్యక్తి కాకుండా మరొకర్ని ఎంపీపీ అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చారు. చివరకు రామలింగాపురం అభ్యర్థిని ఇప్పిలి వెంకటనర్సమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు.

* భోగాపురం ఎంపీపీ స్థానం ఊగిసలాటల నడుమ చివరకు వైకాపాకు దక్కింది. ఇక్కడ 16 స్థానాలకు ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు ఎన్నికలకు ముందు, మరొకరు తరువాత మృతి చెందారు. 14 స్థానాలకు తెదేపా, వైకాపాలు ఏడు చొప్పున గెలుపొందాయి. ఇరుపార్టీలు శిబిరాలు  నిర్వహించాయి. తెదేపాకు చెందిన భోగాపురం ఎంపీటీసీ పడాల సత్యవతి గైర్హాజరయ్యారు. వైకాపాకు ఏడుగురు, తెదేపా తరఫున ఆరుగురు మాత్రమే ఉండటంతో ఎ.రావివలసకు చెందిన వైకాపా అభ్యర్థిని ఉప్పాడ అనూషను ఎంపీపీగా ఎన్నికైనట్లు ప్రకటించారు. 

* కొత్తవలసలో ఎంపీపీ ఎన్నికతో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. 20 స్థానాలకు 17 చోట్ల వైకాపా, మూడు తెదేపా గెలుచుకుంది. వైకాపాను గెలిచిన వారు రెండుగా చీలిపోయారు. ఓ వర్గం నుంచి ఆరుగురు మాత్రమే హాజరుకాగా.. రెండో వర్గంతో పాటు తెదేపాకు చెందిన సభ్యులు 14 మంది గైర్హాజరయ్యారు. కోరం లేకపోవడంతో రేపటికి ఎన్నికను వాయిదా వేశారు. రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి గురువారం రాత్రి ఒంటి గంట వరకు విజయనగరంలోని ఓ నాయకుడి ఇంట్లో చర్చలు జరిగినా కొలిక్కిరాలేదు. 

వాయిదా: జిల్లాలో ఆరుచోట్ల ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆశావహులు ఎక్కువగా ఉండటం, కొన్నిచోట్ల అభ్యర్థి ఎవరో తేల్చకపోవడం, ప్రకటించిన వ్యక్తిపై వ్యతిరేకత ఉండటంతో జరగలేదు. కొత్తవలసలో కోరం లేకపోవడంతో వాయిదా వేశారు. భోగాపురంలో ఉపాధ్యక్ష పదవికి ఎవరి పేరూ ప్రతిపాదించలేదు. ఎల్‌.కోటలో వైకాపా తరఫున ఓ అభ్యర్థి పేరు ఉపాధ్యక్ష పదవికి ప్రతిపాదించగా.. మిగతావారు వ్యతిరేకించారు. మరో నలుగురు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండు చేయగా చివరికి ఎన్నిక జరగలేదు. మెంటాడలో ఎంపీపీ ఎన్నిక తరువాత సభ్యులతో వెళ్లిపోయారు. ఉపాధ్యక్ష పదవికి కోరం లేకపోవడంతో, గంట్యాడ అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో వాయిదాపడింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని