ఆద్యంతం...ఉత్కంఠ
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

ఆద్యంతం...ఉత్కంఠ

ఎమ్మెల్యేను అడ్డగించిన వైకాపా రెబల్‌ మద్దతుదారులు
గొడవల  మధ్య వేపాడలో ఎన్నిక


అంగరక్షకులతో వేపాడ ఎంపీడీవో కార్యాలయానికి వస్తున్న ఎమ్మెల్యే కడుబండి 

వేపాడ, న్యూస్‌టుడే: వేపాడ మండలాధ్యక్షుడి, ఉపాధ్యక్షుడి ఎన్నిక ఉత్కంఠ రేపింది. రెండు రోజులుగా తమ వారిని ఎంపీపీని చేయాలని వైకాపాలోరెండు వర్గాలుగా విడిపోయారు. బీఫారమ్‌ కోసం పోటీపడ్డారు. ఈనెల 20న ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కార్యకర్తల సమావేశంలో నీలకంఠాపురం ఎంపీటీసీ వేచలపు వెంకట చినరామునాయుడుకు ఎంపీపీ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని పలువురు వ్యతిరేకించారు. ఆయనకే బీఫారం ఇస్తామని, ఆయనే సమర్థుడని ఎమ్మెల్యే చెప్పడం.. ఈ నెల 23న సమావేశాన్ని నిర్వ హిద్దామని తెలిపారు. కానీ 20న రాత్రే ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు వారంతా ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కోఆప్షన్‌ సభ్యుడి ఎన్నికలో పాల్గొన్నారు. షేక్‌ నరసయ్యను కోఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఇది నచ్చని మరో వర్గం దీన్ని నిలుపుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. కొందరు ఎంపీడీఓ కార్యాలయంలోనికి వెళ్లి పత్రాలను చించేశారు. ఎంపీడీవో కార్యాలయానికి వెళ్తున్న ఎమ్మెల్యే కడుబండిని అడ్డగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంగరక్షకులు దగ్గరుండి ఎమ్మెల్యేను ఎంపీడీఓ కార్యాలయంలోనికి తీసుకువెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఇక్కడి విషయాలను జిల్లా అధికారులకు చేరవేశారు. సాయంత్రం 5 గంటలకు విజయనగరం అడిషనల్‌ ఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మండలాధ్యక్ష ఎన్నికను నిర్వహించారు. కంపల్లి ఎంపీటీసీ సభ్యుడు దొగ్గ సత్యవంతుడ్ని అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. గుడివాడ ఎంపీటీసీ సభ్యుడు అడపా ఈశ్వరరావు  ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్లు రిటర్నింగు అధికారి లక్ష్మీనారాయణ ప్రకటించారు.  వైకాపాలోనే రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో భారీ బందోబస్తు నిర్వహించారు. విజయనగరం నుంచి రిజర్వు దళాలను రప్పించారు. ఎంపీడీఓ కార్యాలయ పరిసరాల్లోని జనాలను తరిమేశారు. ఈ క్రమంలో విజయనగరం ఒకటో పట్టణ ఎస్సై కాలికి గాయమైంది.


చిందరవందరగా కాగితాలు 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని