కల.. సాకారమైన వేళ
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

కల.. సాకారమైన వేళ

అఖిల భారత సర్వీసు ఫలితాల్లో  మెరిసిన మనోళ్లు

పార్వతీపురం, న్యూస్‌టుడే: అంకితభావం, కఠోర శ్రమ, పట్టుదలతో జిల్లాకు చెందిన యువకులు సివిల్స్‌ కల సాకారం చేసుకున్నారు. ప్రణాళికతో ముందుకెళ్తే దేన్నైనా సాధించొచ్చని నిరూపించారు. అవమానాలు, అడ్డంకుల్ని విజయానికి నిచ్చెనలుగా మలచుకొని ప్రయాణించారు. ఒకరు జాతికి బువ్వపెట్టే రైతన్న బిడ్డ కాగా మరొకరు సరిహద్దుల్లో దేశాన్ని రక్షించే సైనికుడికి వారసుడు. శుక్రవారం ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో జిల్లాకు చెందిన గంటా తిరుపతిరావు, సురపాటి ప్రశాంత్, కునిబిల్లి ధీరజ్‌ సత్తాచాటారు. పార్వతీపురం నియోజకవర్గం పరిధిలోని పార్వతీపురం, బలిజిపేట మండలాలకు చెందిన వారు. వారెలా విజయాలను అందుకుందీ... ‘న్యూస్‌టుడే’ విజేతల విజయం వెనుక కథను తెలుసుకుందాం...

కష్టాలు ఎదురైనా..: 
పార్వతీపురం పట్టణంలోని వసుంధరానగర్‌లో నివసిస్తున్న సురపాటి ప్రశాంత్‌ సివిల్స్‌లో 498వ ర్యాంకును సాధించారు. తల్లి స్వర్ణలత సచివాలయంలో ఆరోగ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. సైన్యంలో సేవలు అందించి... ఉద్యోగ విరమణ చేశాక కొన్నాళ్లకే రోడ్డు ప్రమాదంలో తండ్రి బాబూరావు చనిపోయారు. అప్పటికి ప్రశాంత్‌ వయసు పదేళ్లు. ఐదో తరగతి వరకు పార్వతీపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుని, ఆపై ఉన్నత పాఠశాల విద్యను నాసిక్‌లో పూర్తి చేశారు. విశాఖలో పాలిటెక్నిక్‌ చేసి, హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంజినీరింగు కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌లో ఉంటూ మూడో ప్రయత్నంలో ర్యాంకు సాధించారు. తన కుమారుడు లక్ష్యం సాధించినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని స్వర్ణలత ‘‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

ఆకలి బాధ తెలుసు..:
బలిజిపేట మండలం గంగాడకు చెందిన గంటా తిరుపతిరావు యూపీఎస్సీలో 441వ ర్యాంకు సాధించారు. కష్టజీవుల ఆకలిబాధలు, గిరిజనుల పేదరికపు కన్నీటి చారికలు దగ్గర నుంచి చూసి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో సివిల్స్‌ వైపు దృష్టి సారించినట్లు చెప్పారు. తల్లిదండ్రులు రమణమ్మ, సన్యాసినాయుడు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తమిళనాడులో ఈఈఈలో బీటెక్‌ పూర్తి చేశారు. ఒడిశాలోని కలహండిలో ప్రధానమంత్రి రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫెలోషిప్‌లో పని చేస్తున్నప్పుడు పేదరికాన్ని చూసి చలించిపోయినట్లు చెప్పారు. నాలుగో సారి పరీక్ష రాసి లక్ష్యం చేరుకున్నట్లు తిరుపతిరావు చెప్పారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేయకుండా, ఇలా ఎన్నాళ్లని, ఏం సాధిస్తావని చాలా మంది హేళనగా మాట్లాడారని, మాటలతో గాయపరిచారని.. అయినా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన తల్లిదండ్రుల వల్ల ఈ స్థాయికి తాను చేరానని తిరుపతిరావు చెప్పారు.

 ప్రణాళికాబద్ధ కృషితోనే విజయం: 
సివిల్స్‌లో విజయానికి శిక్షణ సంస్థలపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. కునిబిల్లి ధీరజ్‌ మాత్రం భిన్నంగా తానే సొంతంగా సాధన చేశానన్నారు. ముందు నుంచీ సివిల్స్‌పై అవగాహన ఉండడంతో ప్రతిరోజూ ఇంటి వద్ద ఏడెనిమిది గంటలు ప్రణాళికాబద్ధంగా కృషి చేశానని ఆయన చెప్పారు..ధీరజ్‌ తండ్రి కె.వి.రమణ 1991వ సంవత్సరం బ్యాచ్‌ ఎస్‌.ఐ.వీరి స్వస్థలం జిల్లాలోని పార్వతీపురం మండలం ఎంఆర్‌ నగరం. చాలా ఏళ్ల కిందటే ఉద్యోగరీత్యా విశాఖకు వచ్చేశారు. ధీరజ్‌ 273వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. చిన్ననాటి నుంచి చదువుతో పాటు టెన్నిస్‌లోనూ రాణించారు. పది, ఇంటర్‌ నగరంలో చదివారు. చెన్నై ఐ.ఐ.టి.లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. సంవత్సరం పాటు హైదరాబాద్‌లోని ఓ ఐ.టి. సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించేవాడినన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని