నిర్వాసితుల సమస్యలపై దృష్టి
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

నిర్వాసితుల సమస్యలపై దృష్టి

‘న్యూస్‌టుడే’తో సబ్‌కలెక్టరు భావన

పార్వతీపురం, న్యూస్‌ టుడే: ఒడిశాతో వివాదంలో ఉన్న కొఠియా గ్రామాలను కలెక్టరు పర్యవేక్షిస్తున్నారని సబ్‌కలెక్టరు భావన చెప్పారు. శుక్రవారం తన కార్యాలయంలో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. కొఠియా గ్రామాలకు సంబంధించి అవసరమైన పత్రాల సేకరణ జరుగుతోందని వెల్లడించారు. ఇప్పటికే సర్వే విభాగానికి చెందిన అధికారులు పత్రాల కోసం విజయవాడ, సర్వే ఆఫ్‌ ఇండియా వద్దకు వెళ్లినట్లు తెలిపారు. పార్వతీపురం డివిజనులో సమగ్ర భూ సర్వే చురుగ్గా సాగుతోందని, నవంబరులో మూడో విడత ప్రక్రియ ప్రారంభమవుతుందని భావన పేర్కొన్నారు. ప్రస్తుతం రామభద్రపురం మండలం మర్రివలసలో తొలి అంచె సర్వే జరుగుతోందన్నారు. ఇది పూర్తయిన తర్వాత కొన్ని ప్రాంతాల చిత్రాలు రూపొందించి రామభద్రపురం, బాడంగిలో ప్రయోగాత్మకంగా మూడో విడత సర్వే ప్రారంభిస్తామని చెప్పారు. డ్రోన్ల సహాయంతో చేపట్టనున్న ఇది కష్టతరమైందని, పెద్ద సంఖ్యలో సర్వేయర్ల అవసరం ఉంటుందన్నారు.  తోటపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు. బాసంగిలో రెండు వర్గాల వివాదం నేపథ్యంలో తహసీల్దారు ఎప్పటికప్పుడు వారిని సంప్రదిస్తున్నారన్నారు. కొత్తగా ఇళ్ల నిర్మాణానికి స్థలం లేదా పాత ఇళ్ల మరమ్మతులకు సాయం కోరుతున్న నందివానివలస, సుంకిలో తహసీల్దార్లు పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. వారు మరమ్మతులకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని గృహ నిర్మాణసంస్థ ఇంజినీర్లను ఆదేశించామన్నారు. దీంతో పాటు పేదల ఇళ్ల నిర్మాణానికి పార్వతీపురం, సాలూరు పట్టణాల్లో స్థలాలు సేకరించాల్సి ఉందన్నారు. సాలూరు బైపాస్, అటవీ ప్రాంతాల్లోని రహదారులకు సంబంధించి భూమిని అటవీ శాఖకు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 28న సబ్‌కలెక్టరు కార్యాలయాన్ని కొత్త భవనంలోకి మారుస్తామని, భవనాన్ని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రారంభిస్తారని భావన వివరించారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని