చరవాణి పాఠాలే తోడయ్యాయి...
eenadu telugu news
Updated : 28/10/2021 12:16 IST

చరవాణి పాఠాలే తోడయ్యాయి...

ఐఏఎస్‌ ర్యాంకర్‌ ప్రశాంత్‌

పార్వతీపురం మండలంలో అతి చిన్న పల్లెటూరు తాళ్లబురిడి. ఆ పిల్లల తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఆ తల్లి బాధ్యతల్ని భుజానికి ఎత్తుకుని ఇద్దరు పిల్లల్ని చక్కగా చదివించింది. ఆమె కష్టాన్ని అర్థం చేసుకున్న పెద్దకొడుకు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగంలో చేరితే... ఆ ఇంటి చిన్నకొడుకు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. ఆయనే సూరాపాటి ప్రశాంత్‌కుమార్‌. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే పేదరికం అడ్డుకాదని ప్రశాంత్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ఆయన ఇంకేమన్నారంటే....

న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం నాన్న చనిపోయాక అమ్మ స్వర్ణలత నన్ను, అన్నయ్యను బాగా చదివించింది. అన్నయ్య ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అమ్మ, అన్నయ్యల ప్రోత్సాహంతో బీఈ పూర్తి చేశాను. సివిల్స్‌కు సిద్ధమవ్వాలని హైదరాబాద్‌లో శిక్షణ తరగతులకు రెండు నెలలు వెళ్లాను. వాటివల్ల లాభం లేదనుకుని సొంతంగా పరీక్షలకు సిద్ధమవ్వాలని భావించాను. మొదటిసారి ప్రిలిమ్స్‌ పాసైనా...ఇంటర్వ్యూలో అర్హత సాధించలేకపోయాను. అయినప్పటికీ సివిల్స్‌పై మమకారం తగ్గలేదు. రెండోసారి ఇంటర్వ్యూ బాగా చేద్దామనే ఆలోచనతో సిద్ధమయ్యాను. కానీ ఈ సారి అపజయమే పలకరించింది. ఇక తాడోపేడో తేల్చుకుందామని మళ్లీ ప్రణాళికాబద్ధంగా చదివాను..ఫలితాలు చూసి సంతోషమేసింది. పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది. ఐఏఎస్‌ సాధించడంతో నా ఆనందానికి అవధుల్లేకపోయాయి. అమ్మ, అన్నయ్యల ప్రోత్సాహాన్ని ఎన్నడూ మర్చిపోలేను.

లక్ష్యం పెద్దదిగా ఉండాలి

నా దృష్టిలో ‘స్మాల్‌ ఎయిమ్‌ ఈజ్‌ క్రైం’.. చదువరులు పెద్ద లక్ష్యాలను కలిగి ఉండాలి..వాటిని సాధించే క్రమంలో ఆటుపోట్లు ఎదురైతే కనీసం చిన్నదైనా సాధించవచ్ఛు డిగ్రీ పూర్తయ్యే వరకూ ఐఏఎస్‌ చేయాలనే ఆలోచన లేదు. అప్పట్లో పేదరికం కారణంగా సివిల్స్‌ను అందుకోగలమా...? లేదా..? అని బీఈ చదువుతున్నప్పుడే మథనపడే వాడ్ని. అమ్మ...అన్నయ్య...స్నేహితుల ప్రోత్సాహంతో సివిల్స్‌ సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అప్పట్నుంచీ సివిల్స్‌కు వివరాలను సేకరించాను. శిక్షణ తీసుకుంటున్నప్పుడు సమయం వృథా అవుతోందని భావించి సొంతంగా సిద్ధమయ్యా. ఐఏఎస్‌ సాధనకు పేదరికం అడ్డుకాదు. చిన్న స్మార్టుఫోన్‌ ఉంటే చాలు..ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చుననేది నా స్వీయానుభవం. నావరకు ఎక్కువగా ఫోన్‌లో పాఠాలే ఉపయోగపడ్డాయి. పట్టుదలతో కృషిచేస్తే సాధించలేని లక్ష్యం ఉండదు. మొదటి రెండుసార్లు ఊరించిన విజయం..మూడోసారి సొంతమైంది. ప్రస్తుతం మా అన్నయ్య కూడా ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతుండటంతో నాకెంతో సంతోషంగా ఉందని ప్రశాంత్‌ చెప్పారు.

విద్యాభ్యాసం ఇలా...

1 నుంచి 4 వరకు పార్వతీపురంలోని నోబుల్‌ పాఠశాల, 5, 6 సురేష్‌ పాఠశాల, ఏడు నుంచి పది వరకు కేంద్రియ విద్యాలయం (నాసిక్‌, మహారాష్ట్ర), పాలిటెక్నిక్‌ విశాఖ కళాశాల, బీఈ వాసవి కళాశాల (హైదరాబాద్‌)లో చదివాను. ఈఏడాది డిసెంబరు 5 నుంచి ముస్సోరీలో ఐఏఎస్‌ శిక్షణకు వెళ్తున్నాను.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని