
పోలీసులపై కేసు నమోదు చేయాలి: బండి
జనగామ: భాజపా శ్రేణులు నిరసనకు పిలుపునివ్వడంతో జనగామలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. నిన్న మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. పోలీసుల తీరుకు నిరసనగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం బండి సంజయ్ జనగామ చేరుకున్నారు. జనగామ చౌరస్తా నుంచి ఆసుపత్రి వరకు ప్రదర్శనగా వెళ్లి..పోలీసుల లాఠీ ఛార్జిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌శర్మ, తదితరులను బండి సంజయ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. లాఠీ ఛార్జిచేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెరాస ఫ్లెక్సీలు ఉంచి, స్వామి వివేకానంద ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాక్షసపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని విమర్శించారు. ర్యాలీలో భాజపా శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
ఇవీ చదవండి..
నా సర్వీసులో ఇలాంటి వ్యాఖ్యలు వినలేదు