Updated : 21/04/2021 04:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బుజ్జగింపులు.. మందలింపులు

ఈనాడు, వరంగల్‌

గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల్లో పార్టీల బుజ్జగింపుల పర్వం మొదలైంది. 66 డివిజన్లకుగానూ ప్రధాన పార్టీల నుంచి భారీగా నామపత్రాలు దాఖలు కావడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కాకుండా మిగతా వారిని పోటీలో నుంచి తప్పుకోవాలని బుజ్జగిస్తున్నారు. అయినా ససేమిరా అంటే ముఖ్యనేతలు రంగంలోకి దిగి అవసరమైతే మందలింపులకు కూడా వెనకాడటం లేదు. నామపత్రాల ఉపసంహరణకు బుధ, గురువారం వరకు గడువు ఉంది. ఈ క్రమంలో అధికార తెరాసతో పాటు, భాజపా, కాంగ్రెస్‌ పార్టీల నేతలు జాబితాలో లేని వారిని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

బుజ్జగింపుల పర్వంలో భాగంగా నామపత్రాలు దాఖలు చేసిన వారిని కలుస్తున్నారు. అవసరమైతే మందలింపు ధోరణిలో పార్టీపరమైన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రెబెల్స్‌ బెడద లేకుండా చూసేందుకు పావులు కదుపుతున్నారు.

సర్వే కీలకం: ఈసారి అభ్యర్థుల జాబితా ప్రకటించడంలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తుండడంతో పార్టీల తరఫున పోటీలో నిలిచి బీఫారం పొందేవారెవరనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. అన్ని డివిజన్లకు కలిపి పార్టీ నుంచి 286 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తెరాసలో టికెట్లు దక్కని కీలక నేతలను ఆకర్షించే యోచనలో ఉన్న భాజపా కూడా బీఫారాలు ఇంకా అందివ్వలేదు. అయితే 56 మంది అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్‌ కమిటీ ఆమోదించి అధిష్ఠానానికి పంపినట్టు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు పరిశీలించాకే భాజపా జాబితా విడుదల కానుంది. కాషాయం అన్ని డివిజన్ల నుంచి బరిలో నిలుస్తున్నా, తాము కచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానాల్లో మాత్రం ప్రత్యేకించి సర్వే చేసి, అందులో సానుకూలంగా ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

తుది జాబితాపై కసరత్తు: కాంగ్రెస్‌ తరఫున 240 మంది వరకు నామినేషన్లు వేశారు. జిల్లా నేతలతోపాటు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. మంగళవారం కాంగ్రెస్‌ కార్యాలయంలోనే నేతలు సమావేశమై పోటీ నుంచి తప్పుకోవాల్సిన వారిని పిలిపించి మాట్లాడారు. కొందరు కార్యాలయానికి రాకపోతే వారి ఇళ్లకి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. హస్తం సైతం చివరి రోజు నాడే బీఫారాలు కార్యాలయంలో అందజేసే యోచనలో ఉంది. ముందే అభ్యర్థులను ప్రకటిస్తే నష్టపోతామని భావించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.


గులాబీలో గుబులు

అధికార తెరాసలో కార్పొరేటర్‌ పదవులకు పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలయ్యాయి. ఒక్కో డివిజన్‌ నుంచి పోటీ చేసేందుకు సగటున పది మందికి పైగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఎవరికి బీఫారం వస్తుందో ఎవరికి రాదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తెరాసలో బుజ్జగింపుల పర్వం జోరందుకొంది. ఎమ్మెల్యేలు తమకు ముందే కార్పొరేటర్‌ టికెట్టు హామీ ఇచ్చారంటూ బరిలో నిలిచిన వారిని ఉపసంహరింపజేసేందుకు అధికార పార్టీలో మంతనాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలతోపాటు, మంత్రి దయాకర్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్‌తోపాటు ఇతర ముఖ్యనేతలు ఎప్పటికప్పుడు సమావేశమై బీఫారాలు అందజేయాల్సిన అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేస్తున్నారు. బుధవారం తెరాస మొదటి విడతలో పది పన్నెండు మంది పేర్లను ప్రకటించేందుకు సిద్ధమైంది. అసమ్మతి ఎక్కువగా ఉన్న చోట్ల 22న బీఫారాలు అందజేయాలని చూస్తున్నారు. నగరంలో త్వరలో పలు ఆలయాల ఛైర్మన్‌ పదవులతోపాటు, పార్టీ పదవులు, నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామని వారు నచ్చజెప్పడంతో సగానికి సగం మంది ఉపసంహరించుకోవడానికి సిద్ధపడ్డారు. తెరాస వ్యూహంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. నగరంలో అన్ని కులాల వారికి టికెట్లు దక్కితే తమకు కలిసొస్తుందనే వ్యూహంతో ఉన్న తెరాస కొన్ని సామాజిక వర్గాలకు ఎక్కువ టికెట్లు దక్కడంతో వాటిపై పునఃసమీక్షించి అవకాశం రాని సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికే బీఫారం ఇవ్వాలనే యోచనలో ఉంది. దీని వల్ల కూడా సిట్టింగ్‌ల స్థానాలు దాదాపు 40 శాతం వరకు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రధాన పార్టీల వారీగా దాఖలైన నామినేషన్లు

తెరాస 688

భాజపా 286

కాంగ్రెస్‌ 240


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని