Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిఘా నేత్రం.. వన్యప్రాణి నేస్తం

అడవుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో వేటగాళ్లకు అడ్డుకట్ట


అడవిలోని నీటికుంట వద్ద కోతులు

ములుగు, న్యూస్‌టుడే: అటవీ ప్రాంతంలో విచ్చలవిడిగా కలప స్మగ్లింగ్‌ జరిగేది. వన్యప్రాణుల వేటకు అంతేలేదు. అడవుల్లో ప్రవహించే వాగుల్లోంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయేది. ప్రస్తుతం ములుగు జిల్లా అడవులు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేస్తే అక్రమార్కులను నిఘా వెంటాడుతోంది. అటవీ సంపదను కాపాడడంతో పాటు వన్యప్రాణుల రక్షణపై అటవీ శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. నిరంతరం నిఘా పెంచడంతో పాటు రాత్రింబవళ్లు నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. కలప స్మగ్లర్లు, వన్యప్రాణుల వేటగాళ్ల ఆట కట్టిస్తున్నారు. ఈ నిఘా నేత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలియని విధంగా వాటిని అటవీశాఖ ఏర్పాటు చేసింది. ములుగు జిల్లా ఎక్కువ శాతం అటవీప్రాంతంతో కూడుకొని ఉంటుంది. ఈ అడవిలో వివిధ రకాల వన్యప్రాణులున్నాయి. ఏఏ రకాల వన్యప్రాణులు జిల్లా అడవుల్లో జీవిస్తున్నాయో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. ములుగు జిల్లా 3882 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ఎక్కువ శాతం అటవీ ప్రాంతంతో కూడుకొని ఉన్నాయి. జిల్లాలోని చాలా గ్రామాలు అడవిని ఆనుకొని ఉన్నాయి. పోడు, అడవి జంతువుల వేట, అడవులను నరకడం లాంటివి ఇలాంటి గ్రామాలను ఆసరా చేసుకొని జరుగుతుంటుంది. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు సీసీ కెమెరాలు బాగా ఉపయోగపడుతున్నాయి.

నాలుగు అటవీ డివిజన్లు, 13 రేంజిలు

ములుగు జిల్లాలో నాలుగు అటవీ డివిజన్‌లు, టెరిటోరియల్‌, వన్యప్రాణి విభాగాలకు సంబంధించి 13 అటవీ రేంజిలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 63 సీసీ కెమెరాలున్నాయి. అత్యధికంగా ఏటూరునాగానం వన్యప్రాణి విభాగం అటవీ రేంజిలో 35 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ రేంజి పరిధిలో అటవీ ప్రాంతం అధికంగా ఉంటుంది.


సీసీ కెమెరాలకు చిక్కిన వన్యప్రాణుల చిత్రాలు

జంకుతున్న స్మగ్లర్లు

అడవుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో స్మగ్లర్లు జంకుతున్నారు. ఇసుక అక్రమ రవాణాదారులు, వన్యప్రాణుల వేటగాళ్లు అక్రమాలు చేయడానికి వెనకాడుతున్నారు. ఇటీవల ములుగు జిల్లాకు పులి వచ్చిందనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కెమెరాల ఏర్పాటుతో పాటు వ్యక్తిగత నిఘా పెంచడం, చెక్‌ పోస్టులను మరింత పటిష్ఠం చేయడంతో అక్రమార్కులకు ఉచ్చు బిగించినట్లవుతోంది. అడవి జంతువులలో ఏఏ రకాలు ఉన్నాయనేది తెలుసుకునేందుకు ప్రధానంగా తాగు నీటి లభ్యత ప్రదేశాలు, అటవీ శాఖ ప్రత్యేకంగా నిర్మించిన సాసర్‌ పిట్‌లు, కుంటలను ఆధారం చేసుకొని సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని