Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డిజిటల్‌ ఢీ..

సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు

న్యూస్‌టుడే, ములుగు రోడ్డు

కరోనా నేపథ్యంలో ఈసారి ఎన్నికల ప్రచార సందడి కనిపించేలా లేదు.అభ్యర్థి ఇంటింటి ప్రచారంలో కేవలం నలుగురు మించి ఉండకూడదన్న నిబంధనతో కొత్త తరహాలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం సాగబోతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు, వీలైనంత ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు వీటిని ప్రధానాస్త్రాలుగా సంధిస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్‌ ఎన్నికల్లో వీటి ప్రచారం ద్వారా ప్రత్యర్థి పార్టీలను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ప్యాకేజీలతో సామాజిక మాధ్యమాల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం నిర్వహించేలా ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

సంక్షిప్త వీడియోలు..

ఎన్నికల బరిలో ఉన్న ఓ అభ్యర్థి ప్రజల సమస్యలపై తాను ఎలా స్పందిస్తానో చెప్పే తక్కువ నిడివి గల వీడియోలు, డివిజన్‌ అభివృద్ధికి చేసిన, చేయబోయే అంశాలను వివరించనున్నారు. ఎన్నికల్లో గుర్తు, పోలింగ్‌ తేదీ, పోలింగ్‌ కేంద్రం సమాచారం, గతంలో చేసిన కార్యక్రమాల వీడియోలను ప్రజలను ఆకట్టుకునేలా రూపొందించుకున్నారు. వీటిని సామాజిక మాధ్యమాలైన వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం తదితర వాటిలో ప్రచారం చేసుకుంటున్నారు. కొంతమంది తమ కుటుంబ నేపథ్యాన్ని జోడిస్తున్నారు.

సందేశాలు

పెద్ద మొత్తంలో ఒకేసారి సంక్షిప్త సందేశాలు పంపేందుకు ఇప్పటికే డివిజన్‌ ప్రజల ఫోన్‌ నెంబర్లు సేకరించారు. వారికి ముందే నిర్ణయించుకున్న సమయం, తేదీ ప్రకారం సంక్షిప్త సందేశాలు అందేలా చేస్తున్నారు. దీన్ని నిర్వహించేందుకు ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆపరేటర్లను బుక్‌ చేసుకున్నారు. రోజుకు ఇంత మందికి, ఇన్ని సందేశాలు పంపిస్తే ఇంత ధర అని ఆపరేటర్లు నిర్ణయించారు. దాని ప్రకారం ప్యాకేజీలు మాట్లాడుకుని ప్రచారం సాగిస్తున్నారు.

ప్రత్యేక బృందాలు..

ఆయా డివిజిన్ల అభ్యర్థులు సామాజిక మాధ్యమాల వినియోగించుకునేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసుకున్నారు. వీటిపై పట్టున్నవారికి ఈ ఎన్నికల్లో చేతి నిండా పని దొరికినట్లే. ఓటర్లను ఆకట్టుకునేలా డిజిటల్‌ పోస్టర్లను రూపొందించడం, తక్కువ నిడివి గల వీడియోలను అభ్యర్థులతో రికార్డు చేయించడం, రోజువారీ ప్రచారంలో విశేషాలను ప్రధాన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడం, మీడియా కవరేజీ అయ్యేలా చూడటం ఈ బృందాల పని. సందర్భానుసారంగా సూక్తులు రాస్తారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ డిజిటల్‌ ప్రచారంలో వందలాది మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా పనిచేస్తూ ఆయా అభ్యర్థులకు అనుకూలంగా పక్కాగా ప్రణాళికతో పనిచేస్తుంటాయి.

ఓటర్ల నంబర్ల సేకరణ..

డివిజన్‌లోని ఓటర్ల నంబర్లను ఇప్పటికే సేకరించారు. ముఖ్య అనుచరులు, కుల సంఘాలు, మహిళా ఓటర్లకు ప్రత్యేకంగా, బ్లాక్‌ల వారీగా వాట్సాప్‌ గ్రూపులను ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా అభ్యర్థులు తాము చెప్పాలనుకున్నది చేరేలా చూస్తున్నారు. వాయిస్‌ రికార్డులు సరేసరి. రోజూ వేలాది సందేశాలు, వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకుంటుండటంతో ఫోన్‌ మెమోరీ నిండిపోతోందని కొంత మంది చెప్పారు. ఎవరినీ వద్దనలేం.. ఏ గ్రూపులో నుంచి నిష్క్రమించినా సంకేతాలు వేరుగా ఉంటాయని.. ఎన్నికల వరకు కొనసాగుతాయని చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని