Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాఫియా రహిత నగరంగా మారుస్తాం

భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జి జితేందర్‌రెడ్డి


సమావేశంలో మాట్లాడుతున్న జితేందర్‌రెడ్ఢి చిత్రంలో రావు పద్మ, ప్రేమేందర్‌రెడ్డి, నాయకులు

ఎక్సైజ్‌కాలనీ, న్యూస్‌టుడే: అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వరంగల్‌ను మాఫియా నగరంగా మార్చారని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో భాజపా అభ్యర్థులను గెలిపిస్తే మాఫియా రహిత నగరంగా తీర్చిదిద్ది కేంద్రం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మంగళవారం హంటర్‌ రోడ్డులోని భాజపా ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి భాజపా అభ్యర్థులకు సంబంధించి స్క్రూటినీలో ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈనెల 22న అభ్యర్థులకు బీఫామ్‌లు ఇస్తామన్నారు. న్యాయపరంగా ఎన్నికలను ఎదుర్కొంటామన్నారు. కేంద్రం నిధులతో మాత్రమే వరంగల్‌ నగరం అభివృద్ధి జరిగిందన్నారు. కేటీఆర్‌ శంకుస్థాపన చేసిన సమయంలో శిలాఫలకంపై అమృత్‌ పథకం అని ఉంది. కానీ మంత్రి మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అమృత్‌ పథకం కింద రూ. 400 కోట్లు ఇచ్చి కేంద్రం అభివృద్ధి చేసిందన్నారు. స్మార్ట్‌ సిటీ పథకం కింద కేంద్రం రూ. 196 కోట్లు ఇస్తే కాళేశ్వరం కోసం రూ. 156కోట్లు మళ్లించారన్నారు. వరంగల్‌, కాజీపేట రైల్లేస్టేషన్లను రూ. 28 కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. ప్రతి ఓటరును కలిసి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తామన్నారు. మడికొండ సమీపంలో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్‌ యార్డు వలన నగరంలోకి వచ్చే తాగునీరు కలుషితమవుతోందన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు బంగారు శృతి, అలే భాస్కర్‌, మీసాల చంద్రయ్య, కొరబోయిన సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని