Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘మహా’ముప్పును తప్పిద్దాం!

న్యూస్‌టుడే, డోర్నకల్‌


డోర్నకల్‌ జంక్షన్‌లో రైలు దిగి పట్టాలు దాటుతున్న మహారాష్ట్ర కూలీలు

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరోవైపు మహారాష్ట్ర నుంచి కూలీలు జిల్లాలోని మిరప తోటల్లో పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు. వీరంతా తమకున్న పాత పరిచయాల మేరకు కేసముద్రం, మహబూబాబాద్‌, డోర్నకల్‌ రైల్వేస్టేషన్లలో దిగుతున్నారు. ఒక్క డోర్నకల్‌ ప్రాంతానికే రోజుకు 300 మంది కూలీలు వస్తున్నారు. వీరంతా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకుని అదిలాబాద్‌-తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలుని ఆశ్రయిస్తున్నారు. రైల్వేస్టేషన్లలో దిగాక ట్రాలీల్లో ఇతర ప్రాంతాలకు తీసుకెళుతున్నారు. రైతులే వాహన సదుపాయాలు సమకూర్చుతున్నారు. వీరిలో చాలామంది నిరక్షరాస్యులు కావడంతో కొవిడ్‌ నిబంధనలపై పెద్దగా అవగాహన లేదు. గుంపులు గుంపులుగా కిక్కిరిసిన టాటా ఏస్‌ వాహనాల్లో వెళుతున్నారు. జీవనోపాధికి వలస వస్తున్నా మహారాష్ట్రలోని పరిస్థితులను అర్థం చేసుకుని రైతులు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఫలితంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క డోర్నకల్‌ మండలంలోనే ప్రస్తుతం 154 పాజిటివ్‌ కేసులుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రైతులు మేల్కొంటేనే ‘మహా’ మప్పు దరిచేరదని టాస్క్‌ఫోర్స్‌ కమిటీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అధికారులు చెబుతున్నారు.

రైలు బోగీలలోనూ సంకట స్థితి..

కూలీలు రిజర్వేషన్‌ చేసుకుని వస్తుండటంతో రైలు బోగీలలోనూ సంకట స్థితి ఎదురవుతోంది. నాందేడ్‌, కాజీపేట, వరంగల్‌ రైల్వేస్టేషన్లలో రైలెక్కుతున్నారు. అక్కడి కేసుల దృష్ట్యా కూలీల పక్కన కూర్చోవడానికి తోటి ప్రయాణికులు భయపడుతూ ఇతర బోగీల్లోకి వెళ్లిపోతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని టీటీఈలు సైతం సర్దుకుపోతున్నారు. కూలీల రాకతో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో భయభయంగా ప్రయాణం కొనసాగిస్తున్నట్లు నిత్యం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వచ్చే ఉద్యోగులు చెబుతున్నారు. అధికారులు కట్టడి చేస్తున్నా, కేసులు పెడుతున్నా వలస మాత్రం తగ్గడం లేదు. మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.

అవగాహన కల్పిస్తేనే..

కూలీలకు రైతులు భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌, మాస్కులు అందించడం చేయాలి. డోర్నకల్‌ జంక్షన్‌లో రైలు దిగే కూలీలు కురవి, డోర్నకల్‌, ఖమ్మం గ్రామీణ మండలం, కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాలకు వెళుతున్నారు. ఆయా పంచాయతీ పాలకవర్గాలు, స్థానిక అధికారులు స్పందించి కొవిడ్‌ నియంత్రణకు ప్రజలతో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయాలి.


మహారాష్ట్ర కూలీలే ఎందుకు..?

అక్కడివారు ఉదయం 6 గంటలకు పనిలో దిగితే మళ్లీ సాయంత్రం 6 గంటలకు బయటకొస్తారు. అదే మన ప్రాంతం వారు ఉదయం 9 గంటలకు వచ్చి మధ్యాహ్నం ఒంటి గంటకు వెళ్లిపోతారు. పైగా మహారాష్ట్ర కూలీలే ఎక్కువ మిరప ఏరుతారు. రైతులకు ఇది కలిసొచ్చే అంశం అయినందున మహారాష్ట్ర కూలీలను పనిలో పెట్టుకోవడానికే మొగ్గు చూపుతుంటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని