Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

22 చెక్‌పోస్టులతో తనిఖీలు

తక్కువ మందితో శుభకార్యాలు మేలు

‘ఈనాడు’తో ఎస్పీ కోటిరెడ్డి

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌

ఎస్పీ కోటిరెడ్డి

‘కరోనా రెండో దశ కేసులు పెరుగుతుండడంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఏప్రిల్‌ 30 వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది. దీనికి జిల్లా ప్రజలు సహకరించాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్ద’ని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. కర్ఫ్యూలో భాగంగా జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న వేళ పోలీస్‌ శాఖ పరంగా తీసుకుంటున్న చర్యలను ఎస్పీ కోటిరెడ్డి మంగళవారం ‘ఈనాడు’కు వివరించారు.

వారికి స్టేషన్‌లోనే విధులు..

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పోలీస్‌ సిబ్బందికి బయట కాకుండా స్టేషన్‌లోనే విధులను అప్పగిస్తున్నాం. జిల్లాలో మొదటి దశలో 270 మంది సిబ్బందికి కరోనా రాగా కోలుకున్నారు. ప్రస్తుతం రెండో దశలో తొమ్మిది మందికి వచ్చింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన వారిని ఇంట్లో ఉంటూ ఐసోలేషన్‌ చేయాలంటూ సూచిస్తున్నాం. ఇప్పటి వరకు 90శాతం సిబ్బందికి వ్యాక్సిన్‌నేషన్‌ పూర్తి చేశాం.

జరిమానాల విధింపుతో జనాల్లో మార్ఫు..

జిల్లాలో మాస్కు ధరించకుండా తిరుగుతున్న వారిని గుర్తించి వారికి ఈ-చలానా విధించేలా పది రోజుల కిందట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 1300 ఈ-చలానాతో జరిమానాలు విధించాం. ఇప్పటివరకు 243 మంది రూ.2.43 లక్షలు జరిమానాలు చెల్లించారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు మాస్కు లేకుండా తిరిగితే 3600 కేసులు నమోదు చేశాం. 229 ఈ-పెట్టి కేసులు నమోదు చేశాం. జరిమానాలు విధిస్తుండటంతో ప్రజల్లో మార్పు వచ్చింది. చాలామంది మాస్కులు ధరిస్తున్నారు.

టికెట్లను వెంట ఉంచుకోవాలి..

కర్ఫ్యూకు సంబంధించి వాణిజ్య, వ్యాపార సముదాయాలను రాత్రి 8 గంటలకే బంద్‌ చేసుకోవాలి. రాత్రి 9 గంటల వరకు ఇళ్లకు చేరుకోవాలి. అత్యవసరమున్న వారిని తప్ప ఎవరినీ రోడ్డు మీదికి వస్తే అనుమతించం. దీని కోసం జిల్లా కేంద్రంలో నాలుగు, డోర్నకల్‌, మరిపెడ, తొర్రూరు పట్టణాల్లో రెండేసి, మండలానికి ఒకటి చొప్పున మొత్తం 22 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా తనిఖీలు చేపడుతాం. రైళ్లు, బస్సుల ద్వారా రాత్రి 9 గంటల తర్వాత వస్తే వెంట టికెట్‌ ఉంచుకోవాలి. లేకుంటే చర్యలు తప్పవు. 18 పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పెట్రోలింగ్‌ నిర్వహించేందుకు బృందాలను నియమించాం.


100 మందికి మించవద్ధు..

కరోనా కేసులు పెరుగుతుండటంతో శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. పరిమిత సంఖ్యలోనే 50 నుంచి 100 మందికి మించకుండా చూసుకోవాలి. ఇప్పటికే వేడుకల మందిరం నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. పెళ్లిళ్లు జరుపుకోవాలనుకునే వారు తప్పనిసరిగా కార్డుతో తహసీల్దార్‌, ఎస్సైకి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని