Published : 05/05/2021 02:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రాణం నిలబెట్టి

‘ప్రభుత్వ ఆసుపత్రిపై నాకున్న అభిప్రాయం తెలుసుకున్నా.. ప్రైవేటు కంటే మంచి వైద్యసేవలు అందించారు.. 15రోజుల పాటు వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పేషెంట్‌కేర్‌, పారిశుద్ధ్య సిబ్బంది వరకు అందించిన సేవలు మరువలేను. ప్రభుత్వ ఆసుపత్రిపై చెడు అభిప్రాయాలను ప్రచారం చేయవద్దని అందరినీ కోరుకుంటున్నా..’ ఇది ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్‌ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లేముందు ఓ రోగి వీడియో రికార్డు చేసి ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డికి పంపించిన అభిప్రాయం.

నిద్రపోకుండా పనిచేస్తున్నాం: డాక్టర్‌ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ప్రస్తుతం కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ చాలా వేగంగా వస్తోంది. ప్రతిరోజు 150కి పైగా కొత్తవారు చేరుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో చేరి అక్కడ నయంగాక వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. నెలరోజులుగా రాత్రి నిద్ర ఎప్పుడు పోతున్నామో తెలియడం లేదు. నాతోపాటు మా వైద్యులు, సిబ్బంది అందరూ పనిచేస్తున్నారు. చాలా మంది కింది స్థాయి సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డా రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆక్సిజన్‌, మందులకు కొరత లేకుండా చూస్తున్నాం. ప్రజలు కూడా చిన్నపాటి జ్వరానికి ఆసుపత్రికి రాకుండా ఆక్సిజన్‌ అవసరం ఏర్పడినప్పుడే రావాలి. ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకుంటే క్షేమంగా ఇంటికి వెళ్లిపోవచ్ఛు

ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా ఉన్న వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఇటీవల ప్రైవేటు ఆసుపత్రిలో చేరి రూ.లక్షలు ఖర్చుచేసి, చివరకు ఎంజీఎం ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. కొన్నిసార్లు ప్రైవేటులో రూ.లక్షలు ఖర్చుచేసినా కోలుకోలేని వారిని, చివరి దశలో ఎంజీఎం ఆసుపత్రికి పంపించడం వల్ల ఇక్కడకు వచ్చిన వారికి చికిత్స ప్రారంభించే లోపే మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఒక్క రోజే 133మంది కొవిడ్‌ పాజిటివ్‌ బాధితులు ఆసుపత్రిలో చేరగా, మొత్తం 534మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం 61 మంది కొవిడ్‌ నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు.

● గత సంవత్సరం మార్చి 8న కొవిడ్‌-19 వైరస్‌ బాధితులకు చికిత్స అందించడానికి 50 పడకలతో ప్రత్యేక వార్డును ప్రారంభించారు. 13 నెలల కాలంలో 50 పడకల వార్డును నేడు 800 పడకలకు పెంచి పూర్తిస్థాయి కొవిడ్‌ సేవలందిస్తున్నారు. మొత్తం 8 వార్డుల్లో ఉన్న కొవిడ్‌ రోగులకు ప్రతి షిఫ్టులో 32 మంది చొప్పున స్టాఫ్‌ నర్సులు 8 గంటల పాటు పీపీీఈ కిట్లు వేసుకొని వైద్యసేవలందిస్తున్నారు. పీజీలు, హౌస్‌సర్జన్లు పీపీఈ కిట్లు ధరించి లోపల ఉక్కపోతను భరిస్తూ రోగులకు సేవలందించడంలో ముందుంటున్నారు.


ప్రత్యేక శ్రద్ధతో 24గంటలూ సేవలందిస్తున్నాం..

-డాక్టర్‌ ముత్తినేని పవన్‌కుమార్‌, ప్రొఫెసర్‌, జనరల్‌ మెడిసిన్‌, ఎంజీఎం ఆసుపత్రి

కొవిడ్‌ వార్డులో చేరిన ప్రతి ఒక్కరూ డిశ్ఛార్జి అయ్యేవరకు ప్రత్యేక శ్రద్ధతో మా వైద్యులు 24 గంటలూ సేవలందిస్తున్నారు. మూడు షిప్టుల్లో 130 మంది వైద్యులు, పీజీలు, ఫ్యాకల్టీ ప్రొఫెసర్లు సేవలందిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో కోలుకోలేని కొవిడ్‌ బాధితులను సైతం మేము అడ్మిట్‌ చేసుకుని కోలుకునేలా చికిత్స అందిస్తున్నాం. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మంచి సహకారం అందిస్తున్నారు.


వైద్యసేవలు చాలా బాగు..

-బౌరిశెట్టి వెంకటేశ్వర్లు, దామెర, ఎల్కతుర్తి మండలం

నేను జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నీటి పారుదలశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాను. గత నెల 16న కొవిడ్‌ రాగా ఎంజీఎం ఆసుపత్రి కొవిడ్‌ వార్డులో చేరాను. ఇక్కడి వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది ధైర్యం చెప్పారు. 15 రోజుల్లో కొవిడ్‌ నుంచి కోలుకొని ఇంటికి వచ్చాను.

త్వరగా బయటపడ్ఢా.

-అవునూరి అశోక్‌కుమార్‌, హుజూరాబాద్‌

నాకు ప్రభుత్వ వైద్యం అంటే తెలియదు. మొదటిసారి కొవిడ్‌ రాగానే ఎంజీఎం ఆసుపత్రిలోని వైద్యుడు డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ సూచన మేరకు గత నెల 18న ఎంజీఎంలో చేరా. 25వ తేదీ వరకు చికిత్స తీసుకున్నాను. వైద్యులు అందించిన చికిత్సతో త్వరగా కోలుకొని డిశ్ఛార్జి అయ్యాను.


ఏడాదిగా కొవిడ్‌ రోగుల సేవల్లోనే..

- ధనలక్ష్మి, హెడ్‌నర్సు, ఎంజీఎం ఆసుపత్రి

ఏడాది కాలంగా కొవిడ్‌ రోగులకు సేవలందిస్తున్నా. ఇప్పటివరకు 21సార్లు కొవిడ్‌ విధులు నిర్వర్తించాను. నాతోపాటు మా స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బంది 8 గంటలు పీపీఈ కిట్లు ధరించి షిఫ్టుకు 32 మందికి పైగా చికిత్స అందిస్తున్నాం. మాలో చాలా మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా తిరిగి కోలుకున్న వెంటనే సేవలందించాం. కొవిడ్‌ సేవలందిస్తున్న సమయంలో పిల్లలకు దూరంగా ఉంటున్నాం.


పణంగా పెట్టి.. ●ఎంజీఎం ప్రాణభిక్ష పెట్టిందంటున్న బాధితులు

వైద్యులు: 130

పీజీ, హౌస్‌సర్జన్లు: 250

స్టాఫ్‌నర్సులు: 500

హెడ్‌నర్సులు: 65

ఇతర సిబ్బంది: 1000

కొవిడ్‌ పడకలు: 800

ఆక్సిజన్‌ ,, 650

ఐసీయూ ,, 50

వెంటిలేటర్లు: 80

వినియోగంలో ఉన్నవి 30

ఇన్‌పేషెంట్లు: 8,833

చికిత్స పొంది ఇంటికి వెళ్లినవారు: 8,433



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని