నూరేళ్ల జీవితం.. కరోనాతో అంతమా
eenadu telugu news
Updated : 27/05/2021 04:26 IST

నూరేళ్ల జీవితం.. కరోనాతో అంతమా

ఈనాడు, వరంగల్‌

వరంగల్‌ నగర శివారులో 25 ఏళ్ల రంజిత్‌కుమార్‌ తనకు పాజిటివ్‌ వచ్చిందని మే 10న రైలు కింద పడి నిండు ప్రాణం తీసుకున్నాడు. భార్య, బిడ్డ దిక్కులేని వారయ్యారు.


భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన వృద్ధురాలు తనకు కొవిడ్‌ సోకిందని మనస్తాపానికి గురై గత నెల 30న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఆలనా పాలనా చూసేందుకు కొడుకు ఉన్నా భయంతో తనువు చాలించింది.

వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్‌కు చెందిన సరోజన కరోనా వచ్చి కోలుకున్నారు. మళ్లీ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడంతో 67 ఏళ్ల భర్త సారంగపాణి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుమారుడు అంతులేని దుఃఖంలో మునిగిపోయాడు.


కొవిడ్‌ వచ్చిందని ఎక్కడలేని భయం, అనవసరమైన ఆందోళన, తీవ్ర మనస్తాపం.. ఇలా అనేక రకాల ఆలోచనలతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే అనాలోచితంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని కనిపించని వైరస్‌ కారణంగా బలితీసుకుంటున్నారు. ఓరుగల్లులో గతేడాది నుంచి ఇప్పటి వరకు కొవిడ్‌ సోకిందనే భయంతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినవాళ్లు అండగా ఉన్నా, ఆసుపత్రుల్లో వైద్యం తీసుకునే అవకాశం ఉన్నా, ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి మందులతో కోలుకునే వీలున్నా జీవితాన్ని చేతులారా చిదిమేసుకోవడం శోచనీయం.


రహదారిపై వాహనం నడిపే సమయంలో ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలకు గురి కావచ్చు. ప్రయాణం చేయాల్సి ఉంటుందని భయపడి ఆత్మహత్య చేసుకుంటామా? అన్ని రకాల జాగ్రత్తలు పాటించి వాహనాన్ని నడిపి క్షేమంగా గమ్యం చేరుతాం. కొవిడ్‌ విషయంలోనూ అంతే.. వైరస్‌ సోకని వారు అత్యవసరమైతేనే బయటకెళ్లడం, మాస్కు, శానిటైజర్‌ ధరించి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొవిడ్‌ బారిన పడ్డా ఇబ్బందేమీ లేదు. వైద్యులు సూచించిన మందులను వాడి ఇంట్లోనే వ్యాధిని నయం చేసుకోవచ్చు. కొంత మంది మాత్రమే ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఆక్సిజన్‌ పెట్టుకొని వెంటిలేటర్‌ వరకు వెళ్లి మళ్లీ కోలుకుంటున్నవారు కోకొల్లలు.

99 శాతం కోలుకుంటున్నారు
కొవిడ్‌ సోకిన వారిలో 99 శాతం మంది కోలుకుంటున్నారు. కేవలం వారం వ్యవధిలో ఇళ్లలోనే ఉండి ఆరోగ్యంగా వైరస్‌ను జయిస్తున్నారు. మరి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారు కచ్చితంగా 99 శాతం కోలుకునే వారిలోనే ఉంటారుగా. వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్సలు చేస్తున్నారు. ఒకసారి వైరస్‌ వచ్చినా కోలుకున్న వెంటనే మళ్లీ విధుల్లోకి వస్తున్నారు. వారు మనల్ని కాపాడేందుకు పాటుపడుతుంటే మన ప్రాణాలు తీసుకోవడం మూర్ఖత్వం కాక మరేమవుతుంది? కరోనా సోకినా ధైర్యంగా ఎదుర్కొన్న వందేళ్ల బామ్మలు, తాతలు ఉన్నారు.
ఇవి పాటించండి
భయమే వైరస్‌, ధైర్యమే మందు..అనేది వాస్తవం. ఈ క్రమంలో మొదట ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. సానుకూలమైన ఆలోచన. ఒక్కరికి వైరస్‌ సోకితే ఒంటరి భావన కలగకుండా మంచి పుస్తకం చదవండి. అది మనలో ఎంతో ధైర్యం నింపుతుంది. వ్యక్తిత్వ వికాస నిపుణుల ప్రసంగాలు వినండి. ధైర్య వచనాలు మందులా పనిచేస్తాయి. మొబైల్లో ఇష్టమైన సినిమా చూస్తే అన్నీ మరచిపోయి కాసేపు నవ్వుకోవచ్చు. మీ ఫొటో ఆల్బం చూస్తూ పాత జ్ఞాపకాలు నెమరేసుకోండి. అసలు మీలో వైరస్‌ ఉందన్న భావనే వీడి మామూలుగా ఉండండి. స్నేహితులతో కాసేపు సరదాగా మొబైల్‌లో మాట్లాడండి. చాన్నాళ్ల నుంచి మీరు చేయాలనుకున్న పని ఈ సమయంలో చేయండి. ధ్యానం, యోగా లాంటివి చేసి భయం నుంచి పూర్తిగా బయటపడండి. సెకండ్‌ వేవ్‌లో అనేక కుటుంబాలకు వైరస్‌ సోకుతోంది. అలాంటప్పుడు అంతా కలిసి సరదాగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకరికొకరు ధైర్యం చెప్పి కరోనాను జయించవచ్చు. అనేక రకాల వ్యాపకాలతో కాలక్షేపం చేసి కరోనాను తరిమికొట్టడం మీ చేతుల్లోనే ఉంది.

మానసికంగా దృఢంగా ఉండాలి
- డాక్టర్‌ శ్రీనివాస్‌, మానసిక వైద్యుడు, ఎంజీఎం ఆసుపత్రి

పుట్టినప్పటి నుంచి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి.. తగ్గుతుంటాయి. అందులో కొవిడ్‌ ఒకటి. అదేం ప్రాణాంతకం కాదు. 99 శాతం రికవరీ రేటు ఉంది. వైరస్‌ వస్తే మానసికంగా దృఢంగా ఉండాలి. హోం ఐసోలేషన్‌లో ఇతరత్రా వ్యాపకాలతో కాలక్షేపం చేయాలి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఏ మాత్రం పనికిరాదు. పాజిటివ్‌ వచ్చిన వాళ్లకు ఇంట్లో వాళ్లు ధైర్యం చెప్పాలి. ఫోన్‌లో  మాట్లాడాలి. మందులతోపాటు ధైర్యమూ ఎంతో పనిచేస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని