
ఏటీఎంల్లో పెట్టాల్సిన రూ.43.93 లక్షల స్వాహా
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: ఏటీఎంల్లో పెట్టాల్సిన రూ.43.93 లక్షల నగదును ఆ సంస్థ ఉద్యోగులే కాజేసిన ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కుటుంబరావు కథనం ప్రకారం.. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి ఏటీఎంల్లో లోడ్ చేసే కాంట్రాక్టును రైటర్ సేఫ్ గార్డ్ ఏజెన్సీ పొందింది. జంగారెడ్డిగూడెంలో పలు బ్యాంకులలో ఏటీఎంల్లో ఈ సంస్థ నగదు పెడుతోంది. ఈ విధులు నిర్వహించే సంరక్షకులు ఇద్దరు నగదు కాజేయడంతో సంస్థ రూట్ ఆఫీసర్ గాదె రామకృష్ణ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతి మూడు నెలలకోసారి దీనిపై ఆడిట్ జరుగుతోంది. అయితే ఆడిట్ అధికారులను మోసగించేందుకు ఈ యువకులు ఒక ఏటీఎంలో నగదును తెచ్చి మరో ఏటీఎంలో పెడుతూ ఏడాది కాలంగా తప్పించుకున్నారు. గత నెల 19న రైటర్ సంస్థ ఉద్యోగులు నగదులో వ్యత్యాసాలను గుర్తించి.. పుట్టగట్లగూడెం గ్రామానికి చెందిన పల్లి వీరవెంకటభాస్కరరావు, టి.నరసాపురానికి చెందిన భీమ నాగేశ్వరరావులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.