
అటవీ సంపద అన్యులపరం
కలప తీసుకెళ్లి వదిలేసిన చెట్టు
జీలుగుమిల్లి, న్యూస్టుడే: మన్యం ప్రాంతంలోని అటవీ సంపద అన్యుల పరమవుతోంది. మారుజాతి వృక్షాలను మాయం చేస్తున్నారు. కామయ్యపాలెం, రాచన్నగూడెం అటవీ బీటు పరిధిలో ఎక్కువగా మారుజాతి వృక్షాలను పెంచుతున్నారు. ఇందులో నారవేపి, టేకు, ఇరుగుడుచావ తదితర చెట్లు అధికంగా ఉన్నాయి. ఒక్కో చెట్టు విలువ ప్రస్తుత ధర రూ.లక్షల్లో ఉంది. వీటిపై కన్నేసిన అక్రమార్కులు పగలంతా చెట్లను నరికి లోడుచేసి రాత్రి సమయంలో సరిహద్దు దాటిస్తున్నారు. ఇదంతా స్థానిక అటవీ శాఖాధికారులకు తెలిసే జరుగుతుందని అక్కడి ప్రజల ఆరోపణ. రాచన్నగూడెం - పూచికపాడు మార్గమధ్యంలో రాళ్లదేవుడు మార్గం నుంచి రెండు కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్తే ఈ అక్రమ దందాకు ఆనవాళ్లు కనిపిస్తాయి. వారం రోజుల కిందట ఒకే ప్రాంతంలో ఏకంగా కోత యంత్రాలతో ఆరు భారీ చెట్లను కోసి మొదళ్లను అక్కడే వదిలేసి వాహనాల్లో తరలించేశారు. నారవేపి జాతికి చెందిన ఈ వృక్షాలు లక్షలాది రూపాయల విలువ ఉంటాయి. ఇదే ప్రాంతంలో ఆరు నెలల కిందట నరికిన మరికొన్ని చెట్లు దర్శనమిచ్చాయి. ప్రధాన రహదారికి కూత వేటు దూరంలో యంత్రాలతో కోస్తుండగా శబ్దం వస్తుంది. రాత్రి సమయంలో అటవీ మార్గం గుండా వెలుపలకు వస్తే వాహన వెలుతురు రహదారిపై పడుతుంది. ఇది తెలిసి కూడా అక్రమార్కులు దర్జాగా కలప తరలించారంటే ఇంటి దొంగలహస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ‘రాష్ట్ర సరిహద్దులో జరుగుతున్న కలప అక్రమ రవాణాపై విచారణ చేస్తాం.. మారుజాతి వృక్షాలను నరికిన ప్రాంతాన్ని పరిశీలించి అక్రమార్కులపై ఆరా తీస్తాం’ అని జిల్లా అటవీశాఖ అధికారిణి యశోదాభాయ్ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న పుల్లల లోడు