Published : 03/03/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనుమతి ఉంటేనే ఆక్వాసాగు!

ప్రతి చెరువుకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: సిరుల పంట అయిన ఆక్వా రంగంలో సాగుతో పాటు వివిధ అనుబంధ విభాగాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేలా ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించింది. కొద్ది రోజుల కిందట ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ అభివృద్ధి అథారిటీ ద్వారా రూపొందించిన చట్టం ఇటీవలే అమల్లోకి వచ్చింది.

గతంలో అనుమతి పొంది ఆక్వా చెరువు తవ్వి సాగు చేస్తున్నా ప్రతి ఐదేళ్లకోసారి లైసెన్సులను పునరుద్ధరించుకోవాల్సి వచ్చేంది. ఇక నుంచి ఎండోస్‌మెంట్‌ అనే శాశ్వత అనుమతి పత్రాన్ని అందజేస్తారు. ఆక్వాజోన్‌ పరిధిలో కొత్తగా చెరువు తవ్వకానికి దరఖాస్తు చేసుకొంటే మత్స్య అభివృద్ధి అధికారి నుంచి నేరుగా జిల్లా స్థాయి కార్యాచరణ కమిటీకి చేరుతుంది. పరిశీలన తరువాత వారం రోజుల్లోనే అనుమతి వస్తుంది. అదే జోన్‌కి వెలుపల చెరువు తవ్వాలనుకుంటే మండల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా కమిటీకి నివేదిస్తుంది. ఎలాంటి అభ్యంతరాలు లేవనుకుంటేనే కొత్తగా చెరువు తవ్వకానికి అనుమతి ఇస్తారు. ఆక్వా రంగానికి సంబంధించి జీవో 7, జీవో 15, జీవో 32లు అమలవుతున్నాయి. ఇకపై కొత్త చట్టం ప్రకారం నిబంధనలు అమలు చేస్తారు.

స్థిరత్వం కోసం..

గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఆక్వా ఉత్పత్తుల కొనుగోలుపై సందిగ్ధత ఏర్పడింది. అప్పట్లో వ్యాపారులు అతి తక్కువ ధరకు ఉత్పత్తులు కొనుగోలు చేశారంటూ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం పరిశ్రమల నిర్వాహకులతో చర్చించి అధికారుల పర్యవేక్షణలో నిర్ణీత ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే కంటే ఆ రంగం అభివృద్ధికి సమగ్రమైన, స్థిరమైన వ్యవస్థ ఉండేలా కొత్త చట్టాన్ని రూపొందించి అమలులోకి తెచ్చింది.

 

జూన్‌ 4 వరకు గడువు

కొత్త చట్టం ప్రకారం ఆక్వా రంగానికి సంబంధించిన అన్ని విభాగాల వారు (ప్రాసెసింగ్‌ పరిశ్రమలు మినహా) తప్పనిసరిగా అనుమతి పొందాలి. గ్రామ సచివాలయాల్లో డిజిటల్‌ సహాయకులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్ఛు దీనికి జూన్‌ 4 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. కొత్త చెరువు తవ్వాలన్నా, పాత వాటికి రిజిస్ట్రేషన్‌ పునరుద్ధరించుకోవాలన్నా నిర్ణీత రుసుములు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. చాలా ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఆక్వా సాగు జరుగుతుంది. ఇలాంటి వారంతా కచ్చితంగా అనుమతులు పొందాల్సిందే. ఆక్వా ప్రయోగశాలలు, మేతలు, సంబంధిత ఔషధాలు విక్రయించే వారు కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

అభివృద్ధికి చేయూత

ఆక్వా రంగానికి చేయూతనిచ్చి స్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని వల్ల ధరల స్థిరీకరణకు అవకాశం ఉంటుంది. అన్ని విభాగాల్లో పారదర్శకత పెరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. నిబంధనల మేరకు ఆక్వాసాగు చేయటం వల్ల వ్యాధుల ప్రభావం తగ్గుతుంది. - తిరుపతయ్య, సహాయ సంచాలకుడు, మత్స్యశాఖ

జిల్లాలో ఇలా.. 

విస్తీర్ణం ఎకరాల్లో 1.72 లక్షలు

రొయ్యల చెరువులు 97 వేలు

చేపలు 75 వేలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని