
బంగారం గొలుసు దొంగల ముఠా అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు
నూజివీడు, న్యూస్‌టుడే: మహిళల మెడలోని బంగారు గొలుసులు తెంచుకుపోయే దొంగల ముఠాను మంగళవారం పట్టుకున్నట్లు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. నూజివీడులో మంగళవారం విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. ఏలూరుకు చెందిన కర్ణం సుధాకర్, మాడుగుల నాని, పులిగడ్డ జగదీష్‌బాబు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. నూజివీడు శ్రీనివాస కూడలిలో పోలీసులు ఆపారు. వారి వద్ద రెండు కిలోల గంజాయి ఉండటంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. మహిళల మెడలో బంగారు గొలుసులు చోరీ చేస్తారని తెలిసింది. గతంలో స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. ఆ చోరీలు ఈ దొంగలే చేశారని గుర్తించి మరింత లోతుగా ప్రశ్నించడంతో మరికొన్ని నేరాలు బయటపడ్డాయి. 2018 నుంచి వీరు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
పసిడిని కరిగించి..
ముఠాకు నాయకుడైన సుధాకర్ తన ఇంట్లోనే బంగారాన్ని కరిగించి ముద్దలుగా చేసి అమ్మేవాడు. వారి నుంచి రెండు కిలోల గంజాయితో పాటు 104 గ్రాముల బంగారం, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు నేరాలకు పాల్పడుతున్నారు.